వారంతా మహిళా కార్పొరేటర్లు. అధ్యక్షా.. అంటూ సభను అదరగొడతారు.
59 మంది కార్పొరేటర్లలో
29 మంది మహిళలే.. ఇద్దరు కోఆప్షన్ సభ్యులు
ప్రధాన ప్రతిపక్ష నేతగా తొలి అవకాశం దక్కించుకున్న పుణ్యశీల
ఏవారంతా మహిళా కార్పొరేటర్లు. అధ్యక్షా.. అంటూ సభను అదరగొడతారు. మాత్రం రాజకీయ అనుభవం లేకపోయినా సమస్యలపై అనర్గళంగా ప్రసంగిస్తారు. మగమహారాజులకు తీసిపోమని కౌన్సిల్‌లో నారీభేరి మోగిస్తూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. నగరపాలక సంస్థలో మొత్తం 59 డివిజన్లు ఉండగా, 29 మంది మహిళా కార్పొరేటర్లు, ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులుగా మహిళలే ఉన్నారు. ఇందులో టీడీపీ నుంచి 17 మంది ఎన్నికవగా, వైఎస్సార్ సీపీ నుంచి 11 మంది, సీపీఎం నుంచి ఒకరు ఎన్నికయ్యారు.
ప్రతిపక్ష నేతగా పుణ్యశీల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ప్రతిపక్ష నేతగా బండి నాగేంద్ర పుణ్యశీల కొనసాగుతున్నారు. బీఏ పట్టభద్రురాలైన ఈమెకు రాజకీయ అనుభవం లేనప్పటికీ కార్పొరేషన్ రాజకీయాల్లో సమర్థవంతంగా ‘రాణి’స్తున్నారు. ఇప్పటివరకు మూడు విడతలుగా జరిగిన కౌన్సిల్ సమావేశాల్లో పలు సమస్యలపై అధికార పార్టీని ఎండగట్టారు. కౌన్సిల్ రాజకీయాలను అవపోసన పట్టిన టీడీపీ సీనియర్లను దీటుగా ఎదుర్కొంటున్నారు.
అరుదైన అవకాశం
1981లో విజయవాడ నగరపాలక సంస్థ ఆవిర్భవించింది. నాటి నుంచి నేటి వరకు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఓ మహిళ వ్యవహరించడం ఇదే ప్రథమం. అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న పుణ్యశీలను మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ పలకరించగా తన మనోభావాలను ఇలా వెల్లడించారు. ‘రాజకీయాలంటే నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. నా భర్త ప్రోత్సాహంతోనే వచ్చా. అధిష్టానం ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలు అప్పగిస్తోందని కలలో కూడా ఊహించలేదు. నాకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు కృషిచేస్తున్నా..’ అన్నారు.
ఆత్మవిశ్వాసమే ఆయుధంగా ఆదిలక్ష్మి
సీపీఎం నుంచి ఒకే ఒక్క కార్పొరేటర్ కౌన్సిల్‌కు ఎన్నికయ్యారు. ఆమె గాదె ఆదిలక్ష్మి. సభలో ఒక్కరే ఉన్నా సమస్యలపై పాలక పక్షాన్ని ఎండగట్టడంతో ఆమె స్టైలే వేరు. ఒంటరిని.. అనే బెరుకు లేకుండా ప్రతి అంశంపైనా కూలంకషంగా చర్చిస్తారు. స్టాండింగ్ కమిటీ సభ్యురాళ్లుగా టీడీపీ నుంచి ఎన్నికైన గుర్రం కనకదుర్గ, సుకాశి సరిత వ్యవహరిస్తున్నారు. కో-ఆప్షన్ సభ్యులిగా వ్యవహరిస్తున్న సీహెచ్ ఉషారాణి నిర్మొహమాటంగా మాట్లాడి సభలో తన వాణి వినిపిస్తారు.