
మంటల్లో ‘కావేరి’ బస్సు
•నాలుగేళ్ల హైదరాబాద్ బాలుడి సజీవ దహనం
•షిర్డీ నుంచి హైదరాబాద్ వస్తుండగా దుర్ఘటన
•ఐదుగురికి గాయాలు కర్ణాటక సరిహద్దులో ఘటన
•డ్రైవర్ అప్రమత్తతో తప్పిన పెను ప్రమాదం
సాక్షి, జహీరాబాద్ టౌన్ /తణుకు : సాయినాథుని దర్శనం చేసుకున్న 36 మంది తెలుగు భక్తులు కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సులో గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.. శుక్రవారం ఉదయం ఆరుగంటలవుతోంది. అందరూ ఆదమరిచి నిద్రిస్తున్నారు. బస్సు తెలంగాణ-కర్ణాటక సరిహద్దుల్లోని ఉమ్నాబాద్ పట్టణం దాటి 2 కిలోమీటర్లు వచ్చింది. మరో మూడు గంటల్లో హైదరాబాద్ చేరుకోవాలి. అంతలోనే ఉపద్రవం..! బస్సు ఇంజన్‌లోనుంచి ఒక్కసారిగా పొగలు కమ్ముకొచ్చాయి.
అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే ఆపి.. పక్కనే ఉన్న ధాబా, పెట్రోల్ బంకులో పనిచేసే వాళ్లను పిలిచి మంటలు ఆర్పేందుకు యత్నించాడు. మంటలు అంతకంతకు విస్తరించాయి. ప్రయాణికులు నిద్రలో ఉండగానే బస్సంతా పొగ నిండింది. బయట ఉన్నవారు ప్రయాణికులను అప్రమత్తం చేసి అద్దాలు పగలగొట్టారు.అరుపులు కేకలకు మేల్కొన్న వారు వీలున్న చోటినుంచి బయటకు దూకేశారు. కిటీకీలు బద్దలుకొట్టి బయటపడ్డారు.
నాలుగేళ్లకే నూరేళ్లు.. బస్సులో వెనకసీట్లో నిద్రపోతున్న అచ్చుత రామ ప్రసాద్, వెంకటేశ్వరి దంపతులూ ప్రాణాలతో బయటపడేందుకు పరిగెత్తారు. వీరికి ఇద్దరు పిల్లలు.. పెద్ద కుమారుడు విహాల్ (4), మరో రెండేళ్ల బాబు. నిద్రమత్తో, మరేమోగాని ఆందోళనలో రెండేళ్ల బాబును తీసుకుని ప్రసాద్ కిందికి దిగగా.. భార్య వెంకటేశ్వరి కూడా కిందకు దిగారు. భార్య పెద్ద కుమారుడిని తీసుకొస్తుందని ప్రసాద్ అనుకున్నారు. చూస్తుండగానే బస్సు మొత్తం కాలిపోతోంది. అంతలోనే విహాన్ కనిపించటం లేదని కంగారు పడ్డ భార్యాభర్తలకు.. పక్కసీట్లో పడుకున్న విహాల్‌ను తీసుకురాలేదని అర్థమైంది.
దీంతో విహాల్‌ను తీసుకొచ్చేందుకు ఇద్దరూ దగ్ధమవుతున్న బస్సులోకి ఎక్కారు. వెంటనే పక్కనున్న వారు వీళ్లను కిందకు లాక్కొచ్చారు. ఎగసిపడుతున్న అగ్నికీలలతో వీరికీ గాయాలయ్యాయి. వెనకసీట్లో నిద్రిస్తున్న విహాల్ మంటల్లో కాలి బూడిదయ్యాడు. వీరితోపాటు రాణి (50), వరుణ్ కుమార్(35), నాగలక్ష్మి(22) గాయపడ్డారు. ఉమ్నాబాద్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పేశారు. ప్రభాకర్‌రెడ్డి అనే ప్రయాణికుడికి చెందిన రూ.45 వేలు, మరో ప్రయాణికుడి ల్యాప్‌టాప్ కాలిపోయాయి.
అతివేగం వల్లే.. ‘డ్రైవర్ మితిమీరిన వేగంతో నడిపాడు. మెల్లగా వెళ్లాలని చెప్పినా వినలేదు. డ్రైవర్ దగ్గర్నుంచే మంటలొచ్చాయి’ అని ప్రభాకర్ రెడ్డి అనే ప్రయాణికుడొకరు చెప్పారు. క్షతగాత్రులను ప్రథమ చికిత్స తర్వాత హైదరాబాద్ తరలించారు.
తణుకులో విషాదం.. విహాన్ (4) తల్లిదండ్రులది పశ్చిమగోదావరి జిల్లా తణుకు. రామప్రసాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. బుధవారం సాయంత్రం భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి షిర్డీ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో దుర్ఘటన జరిగింది. విహాన్ మృతితో తణుకులో, గచ్చిబౌలిలో వీరుంటున్న కాలనీలోనూ విషాదం నెలకొంది. జూలైలో నాలుగో పుట్టినరోజు జరుపుకున్న విహాన్.. ఈ ఏడాది నుంచే ప్లే స్కూలుకెళ్తున్నాడు.