సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెందిన ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అధికారులు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. న్యాయస్థానాలను రాజకీయాలకు వేదికలుగా చేయవద్దని టీడీపీకి చీవాట్లు పెట్టింది. ప్రతి చిన్న విషయానికీ న్యాయస్థానాలను ఆశ్రయించడం మాని, ప్రత్యామ్నాయాలను ఉపయోగించుకోవాలని హితవు పలికింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ జితేంద్రకుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
వారికి లేని బాధ మీకెందుకు?
స్థానిక ఎన్నికల్లో తమ పార్టీతో పాటు ఇతర ప్రతిపక్షాల తరఫున పోటీ చేస్తున్న ఎస్సీ,ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అధికారులు కుల ధ్రువీకరణ పత్రాలు, నో డ్యూస్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదంటూ బుద్దా వెంకన్న హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. అధికారులు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుంటే బాధిత వ్యక్తులు కోర్టుకు రావాలని, వారి తరఫున మీరెలా పిటిషన్ దాఖలు చేస్తారని బుద్దా వెంకన్నను ధర్మాసనం నిలదీసింది.
వారికి లేని బాధ మీకెందుకని ప్రశ్నించింది. ఇలాంటి వ్యాజ్యాలు దాఖలు చేసి న్యాయస్థానాలను రాజకీయాలకు వేదికలుగా చేయవద్దని తీవ్ర స్వరంతో మందలించింది. ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసేందుకు బుద్దా వెంకన్నకు ఎటువంటి అర్హత లేదని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమంటూ వెంకన్న పిటిషన్‌ను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
టీడీపీకి హైకోర్టులో చుక్కెదురు
Published Sat, Mar 14 2020 5:22 AM | Last Updated on Sat, Mar 14 2020 5:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment