ఎస్‌ఐ సురేష్‌కు వినతి పత్రం ఇస్తున్న వ్యాపారులు
వైఎస్‌ఆర్ జిల్లా, పోరుమామిళ్ల : పోరుమామిళ్ల పట్టణంలో ఇటీవల కాలంలో హిజ్రాలు వ్యాపారులను డబ్బులు డిమాండ్ చేయడం, అడిగినంత ఇవ్వకపోతే దాడి చేయడం, అసభ్యంగా ప్రవర్తిస్తుండటంతో వ్యాపారులు బెంబేలెత్తి పోతున్నారు. హిజ్రాల ప్రవర్తనతో విసిగి, భయపడిన కిరాణా, కూరగాయల, టీ బంకుల, తోపుడుబండ్ల, వస్త్ర దుకాణాల, మటన్, చికెన్ దుకాణాల వ్యాపారులు ఆదివారం ఎస్‌ఐ రెడ్డి సురేష్‌కు వినతిపత్రం ఇచ్చి తమకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. ఇటీవల కాలంలో వారానికి రెండు దఫాలు అంగళ్ల వద్దకు హిజ్రాలు డబ్బుల వసూళ్లకు రావడం, అడిగినంత ఇవ్వకపోతే దాడి చేస్తుండటంతో వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
శనివారం ఫాస్టుఫుడ్ సెంటర్ యజమాని వెంకటరామిరెడ్డి రూ. 50 లు ఇస్తే తీసుకోకుండా రూ. 200 లేదా 100 ఇవ్వాలని దబాయించారు. అంతలేదని చెప్పిన వెంకట్రామిరెడ్డిపై నూనెగోళం ఎత్తివేసి, తినుబండారాలు విసిరివేయడంతో నూనె పడి శరీరం కాలిందని వ్యాపారులు వివరించారు. వారం క్రితం చికెన్‌షాపు దగ్గర అడిగినంత డబ్బు ఇవ్వలేదని, వేలాడదీసిన చికెన్ విసిరి వేశారని, టెంకాయల వ్యాపారి నాగేశ్వరరావు రూ. 100 ఇవ్వలేదని కాలితో తన్నారని, తోపుడు బండి దగ్గర తక్కెడ తీసుకెళ్లారని, అంబటి అశోక్ దగ్గర నూనె క్యాన్ ఎత్తుకెళ్లారని ఇవన్నీ హిజ్రాల ఆగడాలకు పరాకాష్ట అని వారు ఎస్‌ఐకి తెలిపారు. ఇదిలా ఉండగా పట్టణ శివారులోని మల్లకతువ స్పీడ్‌బ్రేకర్ దగ్గర, మైదుకూరు రోడ్డులో రంగసముద్రం క్రాస్‌రోడ్డు స్పీడ్ బ్రేకర్ దగ్గర, ఆసుపత్రి స్పీడ్ బ్రేకర్ దగ్గర వాహనాలను అటకాయించి డబ్బులు అడుగుతూ ఇబ్బందులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు. హిజ్రాల పరిస్ధితి అదుపు తప్పిందని, తక్షణం వారిని పట్టణంలో లేకుండా తరిమి వేయాలని కోరారు. ఎస్‌ఐకి ఫిర్యాదు చేసిన వారిలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మస్తాన్, పట్టణ కార్యదర్శి మహమ్మద్ రఫి, తోపుడుబండ్ల యూనియన్ కార్యదర్శి సుబ్రమణ్యం, ఆర్యవైశ్య నాయకులు నటరాజ, అంబటి, బంగారు వ్యాపారులు రఫి, మాబు, నారాయణ, బాషా, పూల వ్యాపారులు సయ్యద్, మధు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment