
షార్‌టసర్క్యూట్‌తోనే ‘నాందేడ్’ ప్రమాదం
నెల్లూరు, న్యూస్‌లైన్: నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ బోగీ దగ్ధమై 26 మంది ప్రాణాలు కోల్పోవడానికి షార్ట్‌సర్క్యూటే కారణమని ప్రాథమికంగా నిర్ధారించామని గుంతకల్ రైల్వే డివిజన్ ఎస్పీ ఎస్.జె.జనార్దన్ తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలోని రైల్వే డీఎస్పీ కార్యాలయాన్ని బుధవారం సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. డిసెంబర్ 28వ తేదీ తెల్లవారు జామున అనంతపురం జిల్లా పుట్టపర్తి నుంచి నాందేడ్ ఎక్స్‌ప్రెస్ కదిలిన 10 నిమిషాల వ్యవధిలోనే ప్రమాదం సంభవించిందన్నారు.
కొత్తచెరువు సమీపంలోకి వచ్చేసరికి మంటలు దట్టంగా వ్యాపించాయని, ఇది గమనించిన ఓ మహిళా ప్రయాణికురాలు ఘటనా స్థలానికి ఒకటిన్నర కిలోమీటర్ ముందు ఉన్న టన్నెల్ వద్ద రైలులో నుంచి దూకేసినట్లు ప్రత్యక్ష సాక్షులు, 108 సిబ్బంది తెలిపినట్లు ఎస్పీ పేర్కొన్నారు. దగ్ధమైన బోగీలో కొందరు ల్యాప్‌టాప్‌లు చార్జింగ్ పెట్టుకున్నారని, ఈ క్రమంలో ప్లగ్‌లో షార్ట్‌సర్క్యూట్ సంభవించి మంటలు వ్యాపించాయని వివరించారు. పొగలు దట్టంగా వ్యాపించడంతో కొందరు ప్రయాణికులు మొదట సృ్పహ కోల్పోయారని, అనంతరం మంటల్లో చిక్కుకుని ఆహుతైనట్లు నిర్ధారణకొచ్చామన్నారు. ఈ ఘటనకు సంబంధించి త్వరలో ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్ట్ రానుందన్నారు.