కల్వకుర్తి రూరల్, న్యూస్‌లైన్: ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి సూచించారు. గత నెల 25న ప్రమాదవశాత్తు కల్వకుర్తి కూరగాయల మార్కెట్‌లో దుకాణాలు కాలిపోవడంతో బాధితులకు పార్టీ తరఫున రూ.1.7 లక్షలు ఇస్తామని అప్పట్లో ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం 34 మంది బాధితులకు రూ.ఐదు వేల చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సాయాన్ని రాష్ట్ర పార్టీ అందించిందన్నారు. పేదవాడికి సాయం అం దించడానికి కులం మతం లేదన్నారు.
భవిష్యత్తులో ఈ మార్కెట్‌లో ప్రమాదాలు జరగకుండా శాశ్వతమైన నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గతంలో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడ్డారని విమర్శించారు. దివంగత రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక్క కల్వకుర్తి నియోజకవర్గానికే 384 మందికి రూ.1.42 కోట్లు అందజేశారన్నారు.
ఈ ప్రాంతానికి ఎన్నో పథకాలు అందించడంతోపాటు విద్యుత్ సమస్య తీర్చడానికి ఎన్నో సబ్‌స్టేషన్లు మంజూరు చేశారన్నారు. పేదవారితో పాటు బాధితులను ఆదుకోవడానికి ఆయన ముందుండే వారన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాధవయ్య, కూరగాయల మార్కెట్ కమిటీ అధ్యక్షు డు పాషా, పార్టీ నాయకులు రవిప్రకాష్, రాంరెడ్డి, ఎడ్మసత్యం, జూపల్లి వెంకటయ్య, శేఖర్, జంగయ్యగౌడ్, విష్ణువర్ధన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మసూద్, సూరి, ఆనంద్‌గౌడ్, నరేష్, తహసీల్దార్ శ్యాం సుందర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
Published Sat, Jan 11 2014 3:43 AM | Last Updated on Sat, Jul 28 2018 6:43 PM
Advertisement