ఎస్సై వీరాంజనేయుడు (ఫైల్ ఫొటో)
'నెల రోజుల క్రితం ఆత్మహత్యచేసుకున్న ఎస్సై దెయ్యమై తిరుగుతున్నాడు. గ్రామంలోని పిల్లాజల్లా అందరినీ భయపెడుతున్నాడు' అంటూ విశాఖ జిల్లా గోపాలపురంలోని లక్ష్మీనగర్ గ్రామస్తులు హడావుడి చేశారు. అంతటితో ఆగకుండా సదరు ఎస్సై ఇంటిముందు మంట పెట్టి, గ్రామం విడిచి వెళ్లిపోవాల్సిందిగా ఇంటిముందు బైఠాయించారు. మూఢనమ్మకాలకు పరాకాష్టలాంటి ఈ ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. దీంతో భయాందోళనకు గురైన ఎస్సై వీరాంజనేయుడు కుటుంబ సభ్యులు సాయం కోసం పోలీసులను ఆశ్రయించారు.
లక్ష్మీపురం గ్రామానికి చెందిన వీరాంజనేయుడు ఎంబీఏ పూర్తిచేసి 2008లో ఎస్సై ఉద్యోగంలో చేరాడు. ఓ కేసు పరిష్కారం అనంతరం ఎస్‌ఐ ఆంజనేయులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని వంగర మండలం అరసాడ గ్రామానికి చెందిన కడుమల సత్యనారాయణ 2014 అక్టోబర్ 24న ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అదే రోజు ఏసీబీ అధికారులు వీరాంజనేయులుపై నిఘా వేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. అయితే తాను నిర్దోషినని, కొందరు రాజకీయనాయకులు కావాలనే తననీ కేసులో ఇరికించారని సూసైడ్ నోట్ రాసి గత ఏప్రిల్ నెలలో వీరాంజనేయుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అసలే కొడుకును కోల్పోయిన ఆ కుటుంబం ఇప్పుడు గ్రామస్తుల వికృతచర్యలతో కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది.