విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్‌లో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రజారోగ్య పరిరక్షణకు చిత్తశుద్ధితో విధులు నిర్వహించాల్సిన సిబ్బంది అక్రమార్జనలకు అలవాటు పడి అడ్డంగా దొరికిపోయిన అవినీతి భాగోతం బట్టబయలైంది. రూ.1.50లక్షలు సొమ్ము కోసం బిల్లు కలెక్టర్‌గా వేషం మార్చి.. ఏకంగా కార్పొరేషన్ కమిషనర్ పేరిట దొంగ సంతకం చేయడంతో పాటు దొంగ స్టాంపులు వేయటం సంచలనం సృష్టించింది. డబ్బులిచ్చిన వ్యక్తి ఫిర్యాదుతో స్పందించిన కమిషనర్ తన సంతకం చేయలేదని తేల్చటంతో అసలు విషయం బట్టబయలైంది. తదుపరి సొమ్ములు తీసుకున్న ఉద్యోగిపై చట్టపరమైన క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే...
విజయనగరం: విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజారోగ్య విభాగంలో సార్జెంట్ (పీహెచ్ మేస్త్రీ)గా ఎం.ఎల్లారావు పని చేస్తున్నారు. అక్రమార్జనకు అలవాటు పడిన ఎల్లారావు అడ్డగోలుగా డబ్బు సంపాదించేందుకు అలవాటు పట్టాడు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌లో రెవెన్యూ విభాగంలోని విధులు నిర్వహించాల్సిన బిల్లు కలెక్టర్ ఉద్యోగాన్ని ఎంచుకున్నాడు. బిల్లు కలెక్టర్‌లు మాదిరి నగరంలోని కార్పొరేషన్‌కు చెందిన షాపింగ్ కాంప్లెక్స్‌లో అద్దెకు ఉంటున్న వారి వద్దకు వెళ్లి షాపుల రెన్యువల్ చేయించుకునేందుకు చలానా రూపంలో డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ షాపింగ్ కాంప్లెక్స్‌లో 18, 21, 22, 23 షాపులు లీజుకు తీసుకున్న రేగాన ఆదినారాయణ అనే వ్యక్తి రూ.1.50 లక్షల మొత్తాన్ని ఎల్లారావుకు చెల్లించారు.
ఈ మేరకు ఎల్లారావు కమిషనర్ సంతకం, స్టాంపులు ఉన్న కొన్ని కాగితాలను ఆదినారాయణకు ఇచ్చారు. రెండు నెలలు గడుస్తున్నా రెన్యువల్‌కు సంబంధించిన పత్రాలు ఇవ్వకపోవటంతో ఆదినారాయణ కార్పొరేషన్ ఉద్యోగి ఎల్లారావుపై ఒత్తిడి తీసుకువచ్చారు. దీంతో ఎల్లారావు రూ.50,000 నగదుకు సంబంధించి అగ్రిమెంట్స్ వస్తాయని సమాధానమిచ్చారు. అనుమానం వచ్చిన ఆదినారాయణ నేరుగా కార్పొరేషన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఎల్లారావు ఇచ్చిన కాగితాలను పరిశీలించిన కమిషనర్ ఆ కాగితాలపై ఉన్నవి తన సంతకాలు కావని తేల్చారు.
ఎల్లారావు దొరికిపోయింది ఇలా...?
అచ్చం కమిషనర్‌లానే సంతకాలు చేశానని అనుకుంటున్న మేస్త్రీ ఎం.ఎల్లారావు ఆ సంతకం చేయటంలో దొర్లిన తప్పిదంతో అడ్డంగా దొరికిపోయాడు. వాస్తవానికి కమిషనర్ వర్మ ప్రతి ఫైల్‌పై తన పూర్తి పేరు ఎస్.సచ్చిదానంద వర్మ పేరిట సంతకం చేస్తారు. అయితే ఎల్లారావు బిల్లు కలెక్టర్‌గా మాయ చేసిన విషయంలో ఎస్‌ఎస్.వర్మ అంటూ సంతకం చేశాడు. సదరు పత్రాలను కమిషనర్ పరిశీలించిన సమయంలో ఎస్‌ఎస్ వర్మ అంటూ ఆ పత్రాలపై ఉండటంతో ఇవి తన సంతకాలు కాదని, మీరు మోసపోయారంటూ ఫిర్యాదుదారుడు రేగాన ఆదినారాయణకు వివరించారు. దీంతో అవాక్కయిన ఆదినారాయణ ఈ విషయంలో మీరే న్యాయం చేయాలంటూ లబోదిబోమంటున్నాడు.
ఎల్లారావుపై ఫిర్యాదు
కమిషనర్ సంతకం ఫోర్జరీ చేసి రూ1.50లక్షలు అక్రమార్జనకు పాల్పడిన ఎల్లారావుపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయటంతో పాటు చట్టపరంగా క్రమశిక్షణా చర్యలకు ఆదేశించినట్టు కమిషనర్ ఎస్‌ఎస్.వర్మ సాక్షికి తెలిపారు. అక్రమార్జనకు పాల్పడిన ఎల్లారావును 24 గంటల్లోగా విధుల నుంచి తొలగించాలని ప్రజారోగ్య విభాగాధికారులను ఆదేశించినట్టు చెప్పారు. ఇటువంటి తప్పిదాలు ఎవ్వరు చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment