సీమాంధ్ర ఉద్యోగుల మౌన ప్రదర్శన | Silent protest continues by Seemandhra employees in Secretariat | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ఉద్యోగుల మౌన ప్రదర్శన

Published Fri, Aug 9 2013 5:07 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

Silent protest continues by Seemandhra employees in Secretariat

సచివాలయంలో ఆందోళన
 విభజన నిర్ణయాన్ని యూపీఏ వెనక్కి తీసుకోవాలని డిమాండ్

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం గురువారం కూడా నిరసనలు కొనసాగించింది. ఎల్ బ్లాక్ నుంచి హెచ్ బ్లాక్ వరకు ఉద్యోగులు మౌన ప్రదర్శన నిర్వహించారు. తొలుత ఎల్ బ్లాకు వద్ద ఉద్యోగులను ఉద్దేశించి ఫోరం నాయకులు మాట్లాడుతూ.. విదేశీ వనిత సోనియాగాంధీ రూపురేఖల్లో భారతీయతను అనుకరిస్తే సరిపోదని, ఆలోచనల్లో కూడా భారతీయతను అనుసరిస్తే అనీబిసెంట్ మాదిరిగా గౌరవం దక్కుతుందని పేర్కొన్నారు. విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని భారతీయతను అనుసరించాలని డిమాండ్ చేశారు. మరోవైపు సచివాలయంలో గురువారం తెలంగాణ ఉద్యోగులు బోనాలు నిర్వహించారు. బోనాలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సీమాంధ్ర ఉద్యోగులు మౌన ప్రదర్శనకు పరిమితమయ్యారు. సీమాంధ్ర ఉద్యోగులు కూడా బోనాల్లో పాల్గొన్నారు. అనంతరం అందరూ కలిసి భోజనాలు చేశారు.
 
 సచివాలయ తెలంగాణ సమన్వయ కమిటీ
 తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకుండా వాటిని ప్రతిపాదనల దశలోనే అడ్డుకోవడానికి సచివాలయంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులు అనుక్షణం జాగరూకతతో ఉండి, పరస్పర సమాచారం ఇచ్చిపుచ్చుకొనే లక్ష్యంతో ‘సచివాలయ తెలంగాణ సమన్వయ కమిటీ’ ఏర్పాటైంది. సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం, రికార్డు అసిస్టెంట్ల సంఘం, ఏపీ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం, డ్రైవర్ల సంఘం, డీఆర్‌అండ్‌టీ అసిస్టెంట్ల సంఘం, లిఫ్ట్ ఆపరేటర్ల సంఘం, రోనియో ఆపరేటర్ల సంఘాలు కలిసి సమన్వయ కమిటీగా ఏర్పడ్డాయి.
 
 ఈ కమిటీకి ఎన్.శంకర్ చైర్మన్‌గా, జె.సుభద్ర సలహాదారుగా, యం.నరేందర్‌రావు సెక్రటరీ జనరల్‌గా, వెంకటేశ్వరరావు కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. సంయుక్త కార్యదర్శులుగా నర్సింగ్‌రావు, కిషన్‌లాల్, కోశాధికారిగా మోహన్, సభ్యులుగా యాసిన్, జగన్, శ్రీనివాస్, సూర్యనారాయణ నియమితులయ్యారు. రాజకీయ డిమాండ్లు మినహా ఉద్యోగుల సమస్యలపై చర్చించడానికి ఈనెల 12న సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులను కూడా కమిటీ ఆహ్వానించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement