మొగుడి కోసం మౌన పోరాటం
హిందూపురం అర్బన్ : వరంగల్‌కు చెందిన సంయుక్త అనంతపురం జిల్లా హిందూపురంలోని తమ అత్తారింటి ఎదుట మౌన దీక్షకు కూర్చున్నారు. నాలుగు రోజులుగా ఆమె దీక్ష కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... నా పెళ్లి హిందూపురానికి చెందిన డాక్టర్ జక్కా నరేంద్రకుమార్‌తో 2006లో అయింది. 2008లో మాకు పాప ప్రణవి పుట్టింది. ఉన్నత విద్య కోసం మా ఆయన లండన్ వెళ్లారు. నన్ను కూడా వెంట తీసుకెళ్లారు. అక్కడ మా మధ్య సఖ్యత కుదరక వెనక్కి వచ్చేశా. అప్పటి నుంచి మా తల్లిదండ్రులు, అన్న కలసి కాపురాన్ని హైదరాబాద్‌కు మార్చి నన్ను ఎంబీబీఎస్ చదివించారు.
2010లో హైదరాబాద్‌లో స్థిరపడ్డాక నరేంద్రను కూడా హైదరాబాద్‌కు వచ్చేయమన్నాం. అందుకు అతను అంగీకరించలేదు. హిందూపురంలోనే ప్రాక్టీస్ చేస్తానని చెప్పారు. ఆ తరువాత ఆయన కోర్టును ఆశ్రయించారు. నేనను కాపురానికి రావడం లేదని, ఫ్యామిలీ రైట్స్(ఆర్‌హెచ్‌సీ) కావాలని కోరారు. ఈ కేసు 2012 వరకు సాగింది. కోర్టులో రెండుసార్లు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు. అయినా మా సంసారం కుదుట పడకపోవడంతో నా భార్య నుంచి విడాకులు ఇప్పించాలంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో నేను 2012లో తిరిగి భర్త వద్దకు వస్తే ఆయన నన్ను ఇంట్లోకి పిల్చుకోకపోగా, గొడవపెట్టుకని నా సామన్లు బయటకు పడేశారు.
రెండో పెళ్లి చేసుకున్నాడని తెలిసి వచ్చా..
నా భర్త నరేంద్ర అనంతపురానికి చెందిన అమ్మాయిని రెండో పెళ్లి చేసుకున్నాడని, వారికి మూడు నెలల బాబు కూడా ఉన్నాడని తెలిసి వచ్చా. నాకు, నా బిడ్డకు అన్యాయం చేశారు. మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని ఆమె అంటున్నారు.
పరస్పర ఫిర్యాదులు
నా భార్య ఆస్పత్రి ఎదుట హంగామా చేస్తోందని అతను వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, నాకు, నా బిడ్డకు న్యాయం చేయాలంటూ సంయుక్త కూడా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
డాక్టర్ నరేంద్ర ఏమంటున్నారంటే...
నేను ఎవరికీ అన్యాయం చేయలేదు. పెళ్ల య్యాక కాపురానికి రాకుండా ఆమె అమ్మానాన్నల వద్దే ఉంది. ఇప్పుడు నా పరువు తీయడానికి క్లినిక్ వద్దకు వచ్చి కూర్చుంది. విడాకు ల కేసు కోర్టులో నడుస్తోంది. కోర్టు ఏం తీర్పు చెబితే నేను దానికి కట్టుబడి ఉంటా. నేను రెండో పెళ్లి చేసుకున్నట్లు ఆమె ఆరోపిస్తోంది. ఆమె రుజువు చూపాలి. నా బిడ్డపై ప్రేమతోనే ఆస్పత్రికి ప్రణవి అనే పేరు కూడా పెట్టుకున్నాను. నా బిడ్డకు అన్యాయం చేయను.