
'ఆట మొదలైంది.. ఇక ఏ ఆటకైనా రెడీ'
విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను గౌరవించి శిల్పా చక్రపాణిరెడ్డి నిన్న టీడీపీకి రాజీనామా చేశారు.
నంద్యాల: విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను గౌరవించి శిల్పా చక్రపాణిరెడ్డి నిన్న టీడీపీకి రాజీనామా చేశారు. నేడు నంద్యాలలోని ఎస్పీజీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు చక్రపాణిరెడ్డి ప్రకటించారు. అనంతరం రాజీనామా లేఖను వేదిక మీద ఉన్న వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అందజేశారు. ఎమ్మెల్సీ పదవి చేపట్టి పట్టుమని 90 రోజులు కూడా కాలేదని పేర్కొన్న ఆయన.. దమ్ముంటే పార్టీ మారిన 21 మంది ఎమ్మెల్యేలు కూడా తనలాగే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. ఓ వైపు సీఎం చంద్రబాబు నాయుడు చెప్పింది చేయడు.. ప్రియతమ నేత వైఎస్ జగన్ మాత్రం ఇచ్చిన మాట తప్పరని పేర్కొన్నారు.
భారీ బహిరంగ సభలో శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. ఈ రోజు నుంచి ఆట మొదలైంది.. ఇక ఏ ఆటకైనా రెడీ అన్నారు. తనకు అత్యాశ అని మంత్రి లోకేష్ అన్నారని, అసలు నాకు అశే లేదు కదా మరి అత్యాశ ఎక్కడిదని ప్రశ్నించారు. ఎలాంటి త్యాగాలకైనా శిల్పా సోదరులం సిద్ధంగా ఉన్నామని, ప్రజల కోసం ఏమైనా చేస్తామన్నారు. భూమా ఫ్యామిలీ డ్రామా మొదలైందని, ప్రజలు మాత్రం ఆ డ్రామాలు ఈజీగా తెలుసుకోవాలని సూచించారు. మా అన్న శిల్పా మోహనరెడ్డి చీమకు కూడా హానీ చేసే వ్యక్తి కాదన్నారు. పార్టీ వీడి రాజీనామా చేయని ఏ ఎమ్మెల్యేను గానీ, ఎంపీని గానీ నంద్యాలలో అడుగు పెట్టనీయవద్దని పిలుపునిచ్చారు.