అనంతపురం న్యూటౌన్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్రకు మద్దతుగా సీమాంధ్ర విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన 72 గంటల సమ్మెతో అనంతపురం జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు ధర్మవరం, హిందూపురం, మడకశిర, తాడిపత్రి, గుంతకల్లు, పెనుకొండ, కళ్యాణదుర్గం తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఉద్యోగుల సమ్మె కారణంగా శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం, కడపలోని ఆర్‌టీపీపీ, విజయవాడలోని వీటీపీఎస్‌లో సేవలు నిలిచిపోయాయి. దీంతో జిల్లాకు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తాయి. ఈ నెల 11న అర్ధరాత్రి నుంచి జిల్లాలోని రెండు వేల మంది విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో సమస్య పరిష్కారమయ్యే అవకాశం లేకుండా పోయింది.
జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు పలు చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. హిందూపురం, తాడిపత్రి, అనంతపురం, గుత్తి, కదిరి డివిజన్లలో 24 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఇవి పునరుద్ధరణకు నోచుకోక పోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సుమారు 150 గ్రామాల్లో మూడు రోజులుగా చీకట్లు అలుముకున్నాయి. జిల్లా కేంద్రంలో సైతం సమస్యలు తలెత్తాయి. స్థానిక ఎంజీ పెట్రోల్ బంక్ ప్రాంతం, 3,4,5,6వ రోడ్లు, రంగస్వామినగర్, తపోవనం, ఆజాద్‌నగర్, హైదరవలి కాలనీ, విమలా ఫరూక్‌నగర్, లక్ష్మీనగర్ తదితర ప్రాంతాలు 48 గంటల పాటు అంధకారం నెలకొంది.
ఇక్కడ 12వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికీ పునరుద్ధరణకు నోచుకోలేదు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రారంభమైన తొలిరోజు పెద్దగా సమస్యలు తలెత్తకపోయినా.. శుక్రవారం సాయంత్రం నుంచి మాత్రం జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా సమస్యలు మొదలయ్యాయి. అనంతపురంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలకు ఉదయం పూట విద్యుత్ సరఫరాను నిలిపేశారు. హిందూపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి, కదిరి, రాయదుర్గం, పెనుకొండ, మడకశిర, కళ్యాణదుర్గం పట్టణాలతో పాటు జిల్లా వ్యాప్తంగా దాదాపు 1,200 గ్రామాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
పరిశ్రమలకు దెబ్బ
విద్యుత్ ఉద్యోగుల సమ్మె వల్ల జిల్లాలోని పలు పరిశ్రమలలో మూడు రోజుల పాటు ఉత్పత్తి నిలిచిపోయింది. తాడిపత్రిలోని గ్రానైట్, నాపరాళ్ల పరిశ్రమలు, హిందూపురంలోని స్టీల్ ప్లాంట్లు, రాయదుర్గంలోని టెక్స్‌టైల్స్ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రెండు రోజుల పాటు వాటికి సెలవు ప్రకటించారు. విద్యుత్ ఉత్పత్తి లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని, పది శాతం మంది ఉద్యోగులు కూడా అందుబాటులో లేకపోవడంతో అత్యవసర సేవలు కూడా అందించలేకపోయామని ఏపీసీపీడీసీఎల్ ఎస్‌ఈ రమణమూర్తి తెలిపారు.
ముగిసిన విద్యుత్ ఉద్యోగుల సమ్మె విద్యుత్ ఉద్యోగుల సమ్మె శనివారం అర్ధరాత్రి ముగిసింది. సమ్మె ముగియగానే ఉద్యోగులు యధావిధిగా విధులకు హాజరయ్యారు. సమ్మె సమయంలో తలెత్తిన విద్యుత్ సమస్యలను ఆదివారం మధ్యాహ్నంలోపు పరిష్కరించడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
సమ్మె చీకటి
Published Sun, Sep 15 2013 4:29 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
Advertisement