లబ్ డబ్.. లబ్ డబ్.. | since from nine days candidates sleep less nights due to elections | Sakshi
Sakshi News home page

లబ్ డబ్.. లబ్ డబ్..

Published Fri, May 16 2014 1:57 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

లబ్ డబ్.. లబ్ డబ్.. - Sakshi

లబ్ డబ్.. లబ్ డబ్..

సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులు తొమ్మిది రోజులుగా నిద్ర లేని రాత్రులు గడిపారు. మరికొందరైతే రెండు మూడు రోజులుగా సరిగా భోజనం కూడా చేయలేదు. పోటీ చేసిన అభ్యర్థుల  పరిస్థితి ఇలా వుంటే వారి గెలుపు ఓటములపై బెట్టింగ్‌లు వేసిన వారు తాము పందెం కాసిన అభ్యర్థి గెలుస్తాడో లేదోననే ఆందోళనలతో సతమతమయ్యారు. అప్పుడప్పుడు కొంత ఉపశమనం పొందేందుకు వీలుగా వారికి ఎదురుపడిన ప్రతి ఒక్కరినీ విజయం ఎవరి వైపు ఉంటుందనే సమాచారాన్ని సేకరించడంలో నిమగ్నమయ్యారు. చాలా మందికి గురువారం రాత్రి నిద్రకరువైంది.
 
 అర్ధరాత్రి దాటినా సెల్ ఫోన్లలో చర్చలే చర్చలు. కూడికలు.. తీసివేతలు.. ఏది ఏమైనా ఇటు పోటీ చేసిన అభ్యర్థులు.. అటు బెట్టింగ్ వేసిన వారి ఉత్కంఠకు శుక్రవారంతో తెరపడనుంది. ఈ నెల 7వ తేదీన జిల్లాలోని 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ  ఎన్నికల్లో 188 మంది అసెంబ్లీ, 25 మంది పార్లమెంటు స్థానాలకు పోటీ చేశారు. ముఖ్యంగా వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ మధ్యనే రసవత్తర పోరు కొనసాగింది. అభ్యర్థుల్లో కొందరు టెన్షన్ తగ్గించుకునేందుకు విహార యాత్ర పేరుతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి గురువారం సాయంత్రానికి వారి వారి ప్రాంతాలకు చేరుకున్నారు.

గతంలో ఎప్పుడూ లేని విధంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఓటింగ్ శాతం పెరగడంతో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారన్నది చర్చనీయాంశమైంది. ఓటింగ్ సరళిని పరిశీలిస్తే అనంతపురం నియోజకవరగలో 60.30 శాతం, ఉరకొండలో 85.34, గుంతకల్లులో 74.11, తాడిపత్రిలో 79.35, శింగనమలలో 83.48, ధర్మవరంలో 84.02, రాప్తాడులో 83.88, కదిరిలో 74.90, పుట్టపర్తిలో 81.59, హిందూపురంలో 76.20, పెనుకొండలో 82.99, మడకశిరలో 83.88, కళ్యాణదుర్గంలో 85.47, రాయదుర్గంలో 85.11 శాతం మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
 వీరిలో ఎక్కువ భాగం యువకులు ఓటింగ్‌లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాలపైనే ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది.
 
 జిల్లా కేంద్రమైన అనంతపురంలో హోటళ్లు, టీ కొట్లు, బస్ స్టేషన్, రైల్వే స్టేషన్‌తో పాటు ప్రధాన రోడ్లపై ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కన్పిస్తే చాలు ఫలితాలపైనే చర్చ. విజయావకాశాలపై ఇటు వైఎస్సార్ కాంగ్రెస్, అటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. మెజార్టీ స్థానాలు తమ పార్టీకి దక్కుతాయంటే కాదు మా పార్టీకి దక్కుతాయనే రీతిలో చ ర్చించుకోవడం కనిపించింది. ఏ పార్టీకి ఎన్ని స్థానాలు దక్కుతాయనే విషయంలో రాజకీయ పార్టీ నాయకులు చెప్పే మాటల్లో నమ్మకం సన్నగిల్లడంతో ఇంటెలిజెన్స్ శాఖ నుంచి వచ్చిన సమాచారం మేరకు ఎక్కువ స్థానాల్లో మేమే గెలుస్తామంటూ ప్రధానంగా రెండు పార్టీల్లోనూ చర్చ సాగింది.
 
 మున్సిపల్, జెడ్పీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకోవడంతో ఈ ఫలితాలు కూడా తమకే అనుకూలంగా వస్తాయని తెలుగుదేశం పార్టీ నాయకులు చెబుతుండగా... సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం అధిక శాతం ఓటర్లు తమ పార్టీని ఆదరించినందున అధిక సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పార్టీల పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ నామరూపాలు లేకుండా పోయినప్పటికీ మొన్నటి వరకు మంత్రులుగా కొనసాగిన ఎన్.రఘువీరారెడ్డి, శైలజానాథ్‌లు తిరిగి పోటీ చేయడంతో ఆ ఇద్దరు గెలుపు గురించి కాకుండా అసలు డిపాజిట్టు దక్కుతుందా లేదా అనే విషయంపై చర్చ సాగుతోంది. ఏది ఏమైనా కొద్ది గంటల్లో అందరి ఉత్కంఠకు తెరపడనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement