రాజధాని ప్రాంతంలో సింగపూర్ బృందం పర్యటన
తుళ్ళూరు/తాడేపల్లి రూరల్: రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలంలోని కృష్ణానది తీర ప్రాంతాన్ని మంగళవారం ఏడుగురు ప్రతినిధులతో కూడిన సింగపూర్ బృందం పరిశీలించింది. నూతన రాజధానికి మాస్టర్ ప్లాన్ ఇచ్చిన మర్నాడే ఈ బృందం రాజధాని ప్రాంతంలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడ నుంచి బయలుదేరిన ఈ బృందం ప్రకాశం బ్యారేజి మీదుగా గుంటూరు జిల్లా సీతానగరం చేరుకుని అక్కడ నుంచి ఉండవల్లి కరకట్ట మీదుగా తూళ్లూరు మండలం వెంకటపాలెం చేరుకున్నారు.
అక్కడి నుంచి మందడం మీదుగా తాళాయపాలెంలోని శ్రీశైవక్షేత్రానికి వెళ్లారు. అక్కడ ఐదు నిమిషాల పాటు మ్యాప్‌ల ఆధారంగా కృష్ణానదిని పరిశీలించారు. ఈప్రాంతాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దాలని రాజధాని మాస్టార్ ప్లాన్‌లో పొందు పరిచిన నేపథ్యంలో సింగపూర్ బృందం శ్రీశైవక్షేత్రంకు ఉత్తరంగా కనిపించే కృష్ణానది గురించి ఆసక్తి కనబరిచింది. పరిసర ప్రాంతాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఈ బృందం విజయవాడ తిరుగు ప్రయాణమయ్యింది.