
‘రాజధాని’లో సింగపూర్ బృందం
రెండురోజుల పాటు గ్రామాల్లో పర్యటన
సాక్షి, విజయవాడ బ్యూరో/ గుంటూరు: రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతలు చేపట్టిన సింగపూర్ అధికారుల బృందం ఆ ప్రాంతంలో రెండురోజులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. రాజధాని ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, భవన నిర్మాణాలపై దృష్టి సారించింది. శనివారం ఏరియల్ సర్వే కూడా నిర్వహించింది. మధ్యాహ్నం బృందం సభ్యులు విజయవాడ సీఆర్‌డీఏ కార్యాలయంలో రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌తో సమావేశమయ్యారు.వీరి పర్యటనను గోప్యంగా ఉంచేందుకు అధికారులు ప్రయత్నించారు.
సీఆర్‌డీఏ కార్యాలయంతో పాటు గుంటూరు కలెక్టర్ నుంచి బేస్ మ్యాప్‌లు తీసుకున్న నలుగురు సభ్యుల సింగపూర్ బృందం.. ఆ మ్యాప్‌ల ఆధారంగా పర్యటన కొనసాగించింది. శుక్ర, శనివారాల్లో అమరావతి, ఉండవల్లి, తుళ్లూరు గుంటూరు పరిసర ప్రాం తాల్లో పర్యటించి అక్కడి భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, భూములను పరిశీలించింది. శని వారం గుంటూరులో ఆర్డీవో భాస్కర్ నాయు డు వీరిని పలు ప్రాంతాలకు తీసుకువెళ్లారు. మధ్యాహ్నం విజయవాడ వెళ్లిన ఈ బృందం మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్‌తో సమావేశమయ్యింది. ఈ నెల 12, 13 తేదీల్లో సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో పాటు ఉన్నతాధికారు లు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపనున్న నేపథ్యంలో పర్యటనకు ప్రాధాన్యత చేకూరింది. కాగా 13న చంద్రబాబుతో కలసి ఈశ్వరన్ సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారని ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ చెప్పారు.