కొండవీటివాగుకు సింగపూర్ తరహా డిజైన్
►వాగు నుంచి వచ్చే వరద నీటి నిల్వకు చెరువులు
►మరో వైపు కృష్ణానదిలోకి మళ్లించే ఆలోచన
►చర్చించేందుకు వెళ్లిన రాష్ట్ర మంత్రి నారాయణ
సాక్షి ప్రతినిధి, గుంటూరు : కొండవీటివాగు ముంపు నుంచి రాజధానిని కాపాడేందుకు సింగపూర్ నదికి ఉపయోగించిన డిజైన్ రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడికి వెళ్లి పరిశీలించిన ఉన్నతాధికారులు ఆ డిజైన్ కొండవీటి వాగుకూ అనుకూలంగా ఉంటుందని ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఈ నెల 3 నుంచి 6 వరకు సీఆర్‌డీఏ చీఫ్ ఇంజినీరు కాశీవిశ్వేశ్వరరావు, ప్లానింగ్ డెరైక్టర్ రాముడు, ప్లానింగ్ ఆఫీసరు నాగేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరు బాబురావుతోపాటు రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు కె.పాపారావు సింగపూర్‌లోని సర్బానా జూర్డాన్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో చర్చించారు. వరద ముంపు నుంచి సింగపూర్‌ను కాపాడేందుకు అనుసరించిన విధానాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిపై చర్చించేందుకు మంత్రి నారాయణ మంగళవారం సింగపూర్ పయనమయ్యారు.
అక్కడ చెక్‌డామ్ తరహా నిర్మాణాలు...
ఆటు,పోటు సమయంలో సముద్రంలోని నీటిమట్టం పెరిగి ఆ నీరు సింగపూర్ నదిలోకి చేరడంతో అక్కడి పలు ప్రాంతాలు గతంలో ముంపునకు గురైయ్యేవి. దీని నివారణకు సముద్ర నీరు క్రీక్‌లు(పాయలు) నుంచి నదిలో కలవకుండా చెక్‌డామ్ తరహా నిర్మాణాలు చేపట్టారు. నదికి పరిసర ప్రాంతాల్లో చెరువుల నిర్మాణాలు చేపట్టారు. ఇదే పరిస్థితి కొండవీటి వాగుకు కూడా ఉండటంతో ఆ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారని అధికారుల కథనం.
తొలుత కన్సల్టెన్సీ ప్రతినిధులు కొండవీటి వాగు వరదను పరిగణనలోకి తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అయితే జలవనరుల శాఖ ఇంజినీర్లు వరదల సమయంలో వాగు ప్రవాహ వేగాన్ని, ముంపు విస్తీర్ణాన్ని కన్సల్టెన్సీ ప్రతినిధులకు వివరించారు. దీంతో సింగపూర్ నదికి సంబంధించి ఇవే పరిస్థితులు ఉన్నాయని, అక్కడికి వచ్చి పరిశీలన చేయాలని సీఆర్‌డిఏ అధికారులను కన్సల్టెన్సీ కోరింది. ఈ మేరకు సీఆర్‌డీఏ అధికారులు అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన తరువాత కొండవీటి వాగు నుంచి వచ్చే వరద నీటిని నిల్వ చేయడానికి చెరువుల నిర్మాణాలతోపాటు, వరద సమయంలో కృష్టానది నీటిమట్టం వాగుకంటే అధికంగా ఉంటుందని, ఆ సమయంలో వాగునీటిని నదిలో కలిపి అవకాశం ఉండదని, దానికి ప్రత్యామ్నాయ మార్గం చూపాలని సీఆర్‌డీఏ అధికారులు కోరారు.
వాగు వరద నీటిని అవసరమైతే నదిలోకి మోటార్లు ద్వారా (బెయిల్‌ఔట్)మళ్లించడం లేక కృష్ణానది దిగువ ఆప్రాన్‌లో కలిపే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి నారాయణ పర్యటనలో కొండవీటి వాగు ప్లాన్‌పై ఇరువురు నిర్ధిష్టమైన అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. రాజధానికి శంకుస్థాపనలోపే కొండవీటివాగు డిజైన్‌పై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది.