Kondaveeti stream
-
ఎందుకు దెబ్బతీస్తున్నారు?
కొండవీటి వాగు స్వరూపంపై ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ ప్రశ్న సాక్షి, న్యూఢిల్లీ: కొండవీటి వాగు సహజ స్వరూపాన్ని ఎందుకు దెబ్బ తీస్తున్నారని జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అమరావతికి వరద ముప్పు ఉండగానే పర్యావరణ అనుమతులు దక్కడంపై దాఖలైన పలు పిటిషన్లను ఎన్జీటీ మంగళవారం విచారించింది. ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది ఎ.కె.గంగూలీ, గుంటూరు ప్రమోద్‌కుమార్ వాదనలు వినిపిస్తూ రాజధాని ప్రాంతం వరద ప్రభావ ప్రాంతానికి సమీపంలో ఉన్నప్పటికీ.. ఈ వరద ప్రభావ ప్రాంతం క్రియాశీలకంగా లేదని, వరదలు వచ్చిన చరిత్ర లేదని పేర్కొన్నారు. కొండవీటి వాగు ప్రవాహం వర్షాకాలానికే పరిమితమై ఉంటుందని, ఎలాంటి వరద ముప్పు లేకుండా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని చెపుతూ.. వాగుకు సంబంధించి కొన్ని వీడియో క్లిప్పింగులను చూపించారు. వాగు సహజ ప్రవాహ దిశను మళ్లించే యత్నం చేస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది సంజయ్ ఫారిఖ్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్జీటీ ఛైర్మన్ స్పందిస్తూ... అంత చక్కగా సహజ ప్రవాహ దిశను కలిగి ఉన్న కొండవీటి వాగును ఎందుకు ధ్వంసం చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం ఆక్రమణలను తొలగిస్తున్నామని గంగూలీ వివరించారు. విచారణను ధర్మాసనం బుధవారానికి వాయిదా పడింది. -
కృష్ణా, కొండవీటికి వరదొస్తే అమరావతికి ముప్పు
ఎన్జీటీలో పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు సాక్షి, న్యూఢిల్లీ: రాజధాని అమరావతి నిర్మాణాన్ని సవాల్ చేస్తూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాఖలై న పిటిషన్లపై విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా పడింది. ఈ కేసులో తుది వాదనలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ కేసును జస్టిస్ స్వతంత్ర కుమార్ నేతృత్వంలోని నలుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాది సంజయ్ పరేఖ్ వాదనలు వినిపిస్తూ.. కృష్ణా నది, కొండవీటి వాగుకు వరదలొస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రాజధానికి తీవ్ర ముప్పు వాటిల్లుతుందన్నారు. రాజధాని ఎంపికకు ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా అమరావతిని ఎంపిక చేసిందని సంజయ్ వాదించారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.కాగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని చేపడుతోందని సామాజికవేత్త మేథాపాట్కర్ విమర్శించారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో విచారణ సందర్భంగా మంగళవారం ఆమె కోర్టుకు హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. -
రాజధాని నిర్మాణంలో కొండవీటి వాగు కీలకం
తాడేపల్లి రూరల్ : రాజధాని ప్రాంతంలో గురువారం సింగపూర్ బృందం పర్యటించింది. కొండవీటి వాగును పరిశీలిస్తూ ఈ బృందం పర్యటన కొనసాగింది. ముందుగా ఉండవల్లి కరకట్టపై వర్కుషాపు సమీపంలోని హెడ్ రెగ్యులేటర్‌ను బృందం పరిశీలించింది. దాని పని తీరు, నీటి నిల్వ తదితర అంశాలపై అధికారులతో చర్చించారు. రాజధాని నిర్మాణంలో కొండవీటి వాగు కీలక పాత్ర పోషించనున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ చర్యలపై సింగపూర్ బృందం అధ్యయనం ప్రారంభించింది. ఈ సందర్భంగా ఏపీ సీఆర్డీఏ చీఫ్ ఇంజినీర్ కాశీ విశ్వేశ్వరరావు సింగపూర్ బృందంతో మాట్లాడుతూ రాజధాని నిర్మాణం చేపట్టే క్రమంలో కొండవీటి వాగు ముంపుపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. కృష్ణానదికి, కొండవీటి వాగుకు ఏకకాలంలో వరదలు సంభవించినప్పుడు కృష్ణానది నుంచి కృష్ణాయపాలెం వరకు బ్యాక్ వాటర్ వచ్చి, పైనుంచి వచ్చే కొండవీటి వాగు నీరు అక్కడ పంట పొలాలను ముంచెత్తుతోందని వివరించారు. ఈ క్రమంలో కృష్ణాయపాలెంలో నీరు నిల్వ ఉంచుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. లాం ఫారం దగ్గర చెరువు తవ్వి గ్రీనరీ పార్కు ఏర్పాటు చేసి, అక్కడ కూడా నీరు నిల్వ చేయాల్సి ఉందన్నారు. దీంతోపాటు నీరుకొండ ప్రాంతంలో మరొక నీటి నిల్వ భాగాన్ని ఏర్పాటు చేసి, ఎగువ ప్రాంతానికి నీరు పంపించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. వేసవి సమయంలో కృష్ణానది నుంచి కృష్ణాయపాలెంలోకి నీటిని వెనక్కు మళ్లించి, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉందని సింగపూర్ బృందంతో చర్చించారు. కొండవీటి వాగు మలుపులు ఎక్కువగా ఉన్నాయని, ఆ మలుపులను కట్ చేయాల్సి ఉందన్నారు. కొండవీటి వాగు ముంపు నుంచి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్లు, కల్వర్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉందని సూచించారు. రాజధాని నిర్మాణంలో కొండవీటి వాగు కీలక పాత్ర పోషించడమే కాక, భవిష్యత్తు అవసరాలకు ప్రధాన వనరుగా నిలపాల్సిన అవసరం ఉందనే అంశాన్ని సింగ్‌పూర్ బృందం, అధికారులు చర్చించుకున్నారు. ఇదిలా ఉంటే రాజధాని నిర్మాణం అనంతరం వచ్చే మురుగును ఎటువైపు మళ్లించాలనే దానిపై కూడా చర్చించారు. కొండవీటి వాగు నీటిని రాజధాని అవసరాల కోసం ఉపయోగించుకునేందుకు ఏర్పాట్లు చేస్తే మురుగునీటిని కృష్ణానదిలో కలపకుండా వేరే మార్గాన్ని అన్వేషణ చేయాలని నిర్థారణకు వచ్చారు. ఈ పర్యటనలో ఏపీ సీఆర్డీఏ అసిస్టెంట్ ఇంజినీర్ ప్రేమ్‌కుమార్, ప్రణాళిక అధికారి నాగేశ్వరరావు, 12 మంది ఉన్న ఈ సింగపూర్ బృందంలో స్ట్రాటజిక్ అడ్వైజర్ వాంగ్కాయి యంగ్, అసిస్టెంట్ డెరైక్టర్ సీఎల్సీ జేమ్స్ టే, సైమన్టాంగ్, సుబానా తదితరులు ఉన్నారు. -
కొండవీటివాగుకు సింగపూర్ తరహా డిజైన్
►వాగు నుంచి వచ్చే వరద నీటి నిల్వకు చెరువులు ►మరో వైపు కృష్ణానదిలోకి మళ్లించే ఆలోచన ►చర్చించేందుకు వెళ్లిన రాష్ట్ర మంత్రి నారాయణ సాక్షి ప్రతినిధి, గుంటూరు : కొండవీటివాగు ముంపు నుంచి రాజధానిని కాపాడేందుకు సింగపూర్ నదికి ఉపయోగించిన డిజైన్ రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అక్కడికి వెళ్లి పరిశీలించిన ఉన్నతాధికారులు ఆ డిజైన్ కొండవీటి వాగుకూ అనుకూలంగా ఉంటుందని ముఖ్యమంత్రికి నివేదిక ఇచ్చినట్టు సమాచారం. ఈ నెల 3 నుంచి 6 వరకు సీఆర్డీఏ చీఫ్ ఇంజినీరు కాశీవిశ్వేశ్వరరావు, ప్లానింగ్ డెరైక్టర్ రాముడు, ప్లానింగ్ ఆఫీసరు నాగేశ్వరరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీరు బాబురావుతోపాటు రిటైర్డ్ చీఫ్ ఇంజినీరు కె.పాపారావు సింగపూర్‌లోని సర్బానా జూర్డాన్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో చర్చించారు. వరద ముంపు నుంచి సింగపూర్‌ను కాపాడేందుకు అనుసరించిన విధానాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. దీనిపై చర్చించేందుకు మంత్రి నారాయణ మంగళవారం సింగపూర్ పయనమయ్యారు. అక్కడ చెక్‌డామ్ తరహా నిర్మాణాలు... ఆటు,పోటు సమయంలో సముద్రంలోని నీటిమట్టం పెరిగి ఆ నీరు సింగపూర్ నదిలోకి చేరడంతో అక్కడి పలు ప్రాంతాలు గతంలో ముంపునకు గురైయ్యేవి. దీని నివారణకు సముద్ర నీరు క్రీక్‌లు(పాయలు) నుంచి నదిలో కలవకుండా చెక్‌డామ్ తరహా నిర్మాణాలు చేపట్టారు. నదికి పరిసర ప్రాంతాల్లో చెరువుల నిర్మాణాలు చేపట్టారు. ఇదే పరిస్థితి కొండవీటి వాగుకు కూడా ఉండటంతో ఆ డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసి మాస్టర్ ప్లాన్ రూపొందించనున్నారని అధికారుల కథనం. తొలుత కన్సల్టెన్సీ ప్రతినిధులు కొండవీటి వాగు వరదను పరిగణనలోకి తీసుకోకుండా మాస్టర్ ప్లాన్ రూపొందించారు. అయితే జలవనరుల శాఖ ఇంజినీర్లు వరదల సమయంలో వాగు ప్రవాహ వేగాన్ని, ముంపు విస్తీర్ణాన్ని కన్సల్టెన్సీ ప్రతినిధులకు వివరించారు. దీంతో సింగపూర్ నదికి సంబంధించి ఇవే పరిస్థితులు ఉన్నాయని, అక్కడికి వచ్చి పరిశీలన చేయాలని సీఆర్డిఏ అధికారులను కన్సల్టెన్సీ కోరింది. ఈ మేరకు సీఆర్డీఏ అధికారులు అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిన తరువాత కొండవీటి వాగు నుంచి వచ్చే వరద నీటిని నిల్వ చేయడానికి చెరువుల నిర్మాణాలతోపాటు, వరద సమయంలో కృష్టానది నీటిమట్టం వాగుకంటే అధికంగా ఉంటుందని, ఆ సమయంలో వాగునీటిని నదిలో కలిపి అవకాశం ఉండదని, దానికి ప్రత్యామ్నాయ మార్గం చూపాలని సీఆర్డీఏ అధికారులు కోరారు. వాగు వరద నీటిని అవసరమైతే నదిలోకి మోటార్లు ద్వారా (బెయిల్ఔట్)మళ్లించడం లేక కృష్ణానది దిగువ ఆప్రాన్లో కలిపే ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. మంత్రి నారాయణ పర్యటనలో కొండవీటి వాగు ప్లాన్‌పై ఇరువురు నిర్ధిష్టమైన అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. రాజధానికి శంకుస్థాపనలోపే కొండవీటివాగు డిజైన్‌పై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకోనుంది.