జనం అవసరాల రీత్యా ఆ పని అత్యవసరం.. దాన్నే వారు అడ్డంగా వాడుకొని సర్కారు సొమ్ము దోచుకోవాలనుకున్నారు. సింగిల్ టెండరే.. అది కూడా ఎక్సెస్ రేటుకు బిడ్ దాఖలైనా.. నిబంధనలు అంగీకరించకున్నా.. ఖాతరు చేయలేదు. ఏదోలా దాన్ని ఓకే చేసేసి పబ్బం గడిపేయాలని ప్లాన్ వేశారు. గుట్టుగా టెక్నికల్ బిడ్ కూడా తెరిచి ఓకే చేశారు. అక్కడే కథ అడ్డం తిరిగింది. విషయం లీకైంది. బాస్ ఆరా తీశారు. లోగట్టు అర్థమైంది. అంతే టెండర్ రద్దు చేసి.. మళ్లీ కొత్తగా ఆహ్వానించాలని ఆదేశించడంతో అక్రమార్కుల నోట్లో వెలక్కాయ పడినట్లయ్యింది.
విశాఖపట్నం : అధిక రేటుతో దాఖలైన ఒకే ఒక టెండర్‌ను అత్యవసరం అన్న సాకుతో నిబంధనలకు విరుద్ధంగా ఆమోదించేందుకు జరిగిన ప్రయత్నాలు చివరి క్షణంలో బెడిసికొట్టాయి. హైడ్రామా మధ్య ఏలేరు నీటి పంపింగ్ టెండర్ రద్దయింది. ఏలేరులో ప్రసుతం 63 మీటర్ల కంటే తక్కువ నీటి మట్టం ఉంది. డెడ్‌స్టోరేజ్ కంటే దిగువకు పడిపోయినప్పటికీ విశాఖ నగర అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉన్న కొద్దిపాటిని నీటిని పంపింగ్ చేసేందుకు అధికారులు టెండర్లు పిలిచారు. షెడ్యూల్ ప్రకారం రెండు నెలల పాటు నీరు పంపింగ్ చేయాల్సి ఉంటుంది. ప్రసుతం నీరు లేకపోయినప్పటికీ వర్షాలు పడితే చేరే నీటిని ఎప్పటికప్పుడు పంపింగ్ చేసి ఏలేరు కాల్వ ద్వారా విశాఖకు తరలించేందుకు ఆగమేఘాల మీద ఈ టెండర్‌ను పిలిచారు. రూ.4.83 కోట్ల విలువైన ఈ టెండర్ కోసం ఒకే ఒక్క బిడ్ దాఖలైంది. అందులోనూ షెడ్యూల్ రేటు కంటే రెండు మూడు శాతం ఎక్కువ రేటు కోట్ చేసినట్లు తెలిసింది. ఆ రేటు ఎంతన్నది అధికారులు వెల్లడించలేదు. సింగిల్ బిడ్ దాఖలైనప్పుడు దాన్ని రద్దు చేయాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. వాటిని పట్టించుకోకుండా దాఖలైన ఏకైక బిడ్‌ను ఖరారు చేసేయాలని ఇంజినీరింగ్ అధికారులు ఉత్సాహం చూపించారు. గురువారం రాత్రి టెక్నికల్ బిడ్ ఓకే చేసిన సీఈ దుర్గాప్రసాద్ నేతృత్వంలోని కమిటీ సభ్యులు అదే ఊపులో సమయం తక్కువగా ఉందనే సాకుతో ఫైనాన్షియల్ బిడ్‌ను కూడా తెరిచి ఒకే చేయాలని చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి.
కమిషనర్‌కు తెలియజేయకుండానే..
ఈ విషయం తెలిసిన ‘సాక్షి’ సీఈ దుర్గాప్రసాద్‌ను సంప్రదించగా సింగిల్ టెండర్ దాఖలైనంత మాత్రాన రద్దు చేయాల్సిన అవసరం లేదని.. ఈ రాత్రికే ఖరారు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. టెండర్ తెరుస్తున్న విషయాన్ని కనీసం కమిషనర్‌కు కూడా చెప్పకుండా ఖరారు చేసేందుకు కమిటీ రెడీ అయ్యింది. అయితే చివరి నిముషంలో ఈ విషయం తెలుసుకున్న కమిషనర్ ప్రవీణ్‌కుమార్ టెండర్ వివరాలపై ఆరా తీశారు. ఎక్సెస్ టెండర్ దాఖలైనప్పటికీ సమయం తక్కువగా ఉందనే సాకుతో కమిటీ ఆమోదముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నదని కమిషనర్ గుర్తించారు. టెండర్ షెడ్యూల్‌లో నిర్ణయించిన రేటు కంటే కాంట్రాక్టర్ ఎక్కువగా కోట్ చేసినట్టు నిర్థారణకు వచ్చిన ఆయన ఆ టెండర్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఖరారు చేయొద్దని.. దాన్ని రద్దు చేయాలని ఆదేశించారు. మూడురోజుల కాలవ్యవధితో శుక్రవారం మళ్లీ టెండర్లు ఆహ్వానించాలని కూడా ఆదేశించారు. స్పెల్‌బో కంపెనీ జాయింట్ వెంచర్‌గా వేసిన ఈ సింగిల్ టెండర్‌ను ఎలాగైనా ఖరారు చేయాలని ఇంజనీరింగ్ అధికారులు ఉత్సాహం చూపడం చూస్తే.. అధికారులు, సదరు కాంట్రాక్టు సంస్థ కుమ్మక్కయ్యారన్న ఆరోపణలకు ఆస్కారమిస్తోంది. దీనిపై కమిషనర్ ప్రవీణ్‌కుమార్ వివరణ కోరగా అత్యవసర పని కావడంతో సింగిల్ టెండర్ దాఖలైనప్పటికీ ఖరారు చేసే అవకాశం ఉందని.. అయితే ఎక్సెస్ రేటు కోట్ చేస్తే మాత్రం రద్దు చేయాల్సిందేనని ఆయన అన్నారు. ఈ కారణంతోనే టెండర్‌ను రద్దు చేసి రీ టెండర్ పిలిచేందుకు ఆదేశాలు జారీ చేశామని ‘సాక్షి’కి తెలిపారు.