ప్రీమియం భారమైతే.. పరిష్కారం?
హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలు మరోసారి ప్రీమియం బాదుడు షురూ చేశాయి. ‘కర్ణుడి చావుకి కోటి కారణాలన్నట్టు’.. బీమా సంస్థలు కూడా ప్రీమియం పెంచడానికి ఎన్నో కారణాలు చూపిస్తుంటాయి. లోకల్ సర్కిల్స్ సంస్థ ఇటీవలే నిర్వహించిన ఒక సర్వేలో.. గడిచిన ఏడాది కాలంలో తమ వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం 25 శాతం పెరిగినట్టు 52 శాతం మంది చెప్పారు. హెల్త్ ఇన్సూరెన్స్ నూతన పాలసీల ప్రీమియం సైతం ఈ ఏడాది మొదటి మూడు నెలలల్లోనే 5.54 శాతం మేర పెరిగినట్టు బీమా పంపిణీ ప్లాట్‌ఫామ్ ‘పాలసీఎక్స్’ చెబుతోంది. రెక్కలు తొడిగిన పక్షి మాదిరిగా ఇలా ప్రీమియం గణనీయంగా పెరుగుతూ పోతుంటే కొత్తగా పాలసీ తీసుకునే వారికే కాదు, అప్పటికే పాలసీ తీసుకున్న వారిపైనా అదనపు భారం పడుతుంది. మరి ఈ పరిస్థితుల్లో ప్రీమియం భారం కొంత తగ్గించుకునే మార్గాలేంటన్నది చూద్దాం. ప్రీమియం ఎందుకు పెరుగుతోంది..హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియం గణనీయంగా పెరిగిపోవడానికి వైద్య ద్రవ్యోల్బణం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ద్రవ్యోల్బణం నిత్యావసరాలకు (వినియోగ ధరల, టోకు ధరల ఆధారిత) సంబంధించినది. ఇది 5–6 శాతం మధ్య ఉంటోంది. కానీ, వైద్య రంగంలో ద్రవ్యోల్బణం ఇంతకు రెట్టింపు 14–15 శాతంగా ఉంటోంది. చికిత్సల వ్యయాలు ఈ స్థాయిలో ఏటా పెరిగిపోతుండడంతో, బీమా సంస్థలకు పెద్ద మొత్తంలో క్లెయిమ్‌లు వస్తున్నాయి. దీంతో వాటిపై చెల్లింపుల భారం పడుతోంది. ‘‘వైద్య రంగంలో ఎప్పటికప్పుడు అధునాతన టెక్నాలజీలు, చికిత్సలు అందుబాటులోకి వస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ వసతులు మెరుగుపడడం, ప్రాణాలను కాపాడే అధునాతన చికిత్సలు అందుబాటులోకి రావడం.. ఇవన్నీ వ్యయాలు పెరగడానికి దారితీస్తున్నాయి’’ అని రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ సీఈవో రాకేశ్ జైన్ తెలిపారు. ఔషధాలు, ఇంప్లాంట్లు, ఇతరత్రా వ్యయాలు పెరగడం వల్లే ఆస్పత్రుల చికిత్సల ధరలు పెరిగేందుకు కారణమవుతున్నట్టు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అండర్ రైటింగ్, క్లెయిమ్స్ హెడ్ మనీష్ దొదేజా సైతం పేర్కొన్నారు. జీవనశైలి, ఇతర వ్యాధుల రిస్క్ పెరగడం కూడా అధిక క్లెయిమ్‌లకు దారితీస్తున్నట్టు చెప్పారు. ‘‘మనదేశం ప్రపంచ మధుమేహం రాజధానిగా మారుతోంది. అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కేన్సర్ రిస్క్ సైతం పెరుగుతోంది’’అని ఇన్సూరెన్స్ సమాధాన్ సంస్థ సహ వ్యవస్థాపకురాలు శిల్పా అరోరా తెలిపారు. కరోనా సమయంలో, ఆ తర్వాత కూడా ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగింది. దీంతో బీమా సంస్థలకు పరిహారం కోరుతూ వచ్చే క్లెయిమ్‌లు గణనీయంగా పెరిగాయి. ఈ భారాన్ని దింపుకునేందుకు బీమా సంస్థలు విడతలవారీగా పాలసీదారులకు ప్రీమియం వాత పెడుతున్నట్టు విశ్లేషకులు చెబతున్నారు. కరోనా తర్వాత ఆరోగ్య బీమా ప్రీమియం సవరణ ఇప్పడే మొదటిసారి కాదు. లోగడ ఒకటి రెండు సార్లు కూడా అవి సవరించాయి.అందరికీ కవరేజ్ లేకపోవడమూ కారణమే...ఇక మనదేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ అందరికీ లేకపోవడం కూడా ప్రీమియం అధికంగా ఉండడానికి మరొక కారణమంటున్నారు నిపుణులు. ఎక్కువ మంది హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే బీమా సంస్థలు వ్యయాలను మరింత మంది పాలసీదారులతో పంచుకోవడానికి వీలు ఏర్పడుతుంది. దీంతో విడిగా ఒక్కొక్కరిపై పడే ప్రీమియం భారం తగ్గుతుంది. ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ సైతం మరో పిడుగులాంటిదే. ఉదాహరణకు రూ.10వేల వార్షిక ప్రీమియంపై రూ.1,800 జీఎస్టీని కేంద్రం వసూలు చేస్తోంది. బీమా సంస్థలు వయసుల వారీగా ప్రీమియం పెంచుతుంటాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి 35 ఏళ్లు నిండి 36వ సంవత్సరంలోకి ప్రవేశించినప్పుడు ప్రీమియం పెరిగిపోతుంది. అలాగే 45 ఏళ్లు నిండి 46లోకి ప్రవేశించినప్పుడు కూడా ప్రీమియం టారిఫ్‌లను బీమా సంస్థలు సవరిస్తుంటాయి. ఎందుకంటే వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్య సమస్యలు అధికమవుతుంటాయి. దీంతో చికిత్సల క్లెయిమ్‌ల రిస్క్ పెరిగిపోతుంటుంది. దీన్ని ఎదుర్కొనేందుకు బీమా సంస్థల ముందున్న ఏకైక పరిష్కారం ప్రీమియం బాదుడే. ఇక బీమా పాలసీ తీసుకున్న వారు కూడా పెద్ద పట్టణాల్లోని ప్రముఖ హాస్పిటల్స్‌లో చికిత్సలు తీసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. పేరొందిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో సాధారణంగానే వైద్య చికిత్సల చార్జీలు ఎక్కుగా ఉంటాయి. దీంతో బీమా సంస్థలకు పెద్ద మొత్తంలో క్లెయిమ్ బిల్లులు వస్తున్నాయి. ఇది కూడా ప్రీమియం పెరిగేందుకు కారణమవుతోంది. ఇటీవలే బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐర్‌డీఏఐ) ముందస్తు వ్యాధులకు వెయిటింగ్ పీరియడ్‌ను నాలుగేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించింది. మారటోరియం పీరియడ్‌ను ఎనిమిదేళ్ల నుంచి ఐదేళ్లకు తగ్గించింది. దీనివల్ల కూడా క్లెయిమ్‌లు పెరుగుతాయన్న అంచనాతో బీమా సంస్థలు ప్రీమియంను సవరిస్తున్నాయి. వచ్చే 12 నెలల కాలంలోనూ ప్రీమియంలు పెరుగుతాయన్న విశ్లేషణలు ఉన్నాయి. అసలు హెల్త్ ప్లాన్ అవసరమా?హెల్త్ ప్లాన్ లేకపోతే ఆర్థికంగా కుటుంబం గుల్ల కాక తప్పదు. ప్రీమియం భారంగా మారిందని హెల్త్ ప్లాన్ ప్రీమియం కట్టడం మానేయవద్దు. ఎందుకంటే జీవనశైలి వ్యాధులు పెరిగిపోయాయి. అదే సమయంలో అత్యాధునిక చికిత్సా విధానాలతో వ్యయాలు కూడా పెరిగాయి. హెల్త్ ప్లాన్ తీసుకోకపోతే.. అనుకోకుండా ఏదైనా అనారోగ్యం బారిన పడినప్పుడు లేదా రోడ్డు ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తే, రుణాలతో గట్టెక్కాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. దీనివల్ల ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకని ఆరోగ్య బీమా రక్షణ ఉండేలా చూసుకోవడం తప్పనిసరి.– లోకల్ సర్కిల్స్ సర్వే వివరాలివి...→ 21 % మంది గడిచిన ఏడాదిలో తమ పాలసీ ప్రీమియం 50 శాతం కంటే ఎక్కువే పెరిగినట్టు చెప్పారు. 31 % మంది 25–50 % మధ్య ప్రీమియం గతేడాదితో పోలిస్తే పెరిగినట్టు తెలిపారు. → 15 శాతం మంది తమ ప్రీమియంలో ఎలాంటి మార్పు లేదన్నారు. వీరిలో ఎక్కువ మంది గ్రూప్ హెల్త్ ప్లాన్‌లో ఉన్నవారే.→ మొత్తం 11,000 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. భారం ఎలా తగ్గించుకోవాలి? పోరి్టంగ్: ఆరోగ్య బీమా ఒకసారి కొనుగోలు చేసి మర్చిపోయే వస్తువు కాదు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మీ పాలసీలోని సదుపాయాలు ఉన్నాయా? అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి. సహేతుక ప్రీమియంపై మరింత మెరుగైన ఫీచర్లను వేరొక బీమా సంస్థ ఆఫర్ చేస్తుంటే, అందులోకి మారిపోవడం మంచి నిర్ణయమే అవుతుంది. హెల్త్ ఇన్సూరెన్స్‌ను ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి పోర్ట్ పెట్టుకోవచ్చు. కేవలం ప్రీమియం కొంత తక్కువగా ఉందని చెప్పి పోరి్టంగ్ ఆప్షన్‌ను పరిశీలించడం సరైనది కాదు. ప్రీమియంలో చెప్పుకోతగ్గ వ్యత్యాసానికి తోడు, కొత్త సంస్థ ప్లాన్‌లో సదుపాయాలు మెరుగ్గా ఉన్నప్పుడే పోరి్టంగ్ను పరిశీలించొచ్చు. పోరి్టంగ్తో వేరొక బీమా సంస్థకు మారిపోయిన తర్వాత.. అక్కడ కూడా పాలసీ రెన్యువల్ (పునరుద్ధరణ) సమయంలో ప్రీమియం పెంచరని చెప్పలేం. అన్ని బీమా సంస్థలూ తమ క్లెయిమ్, ప్రీమియం నిష్పత్తి ఆధారంగానే ప్రీమియం పెంపు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. కనుక ప్రీమియం పెంచినప్పుడల్లా దాన్ని తగ్గించుకునేందుకు కంపెనీని మారడం సరైన నిర్ణయం అనిపించుకోదు. ఒకేసారి మూడేళ్లు: ప్రీమియంను ఒకేసారి మూడేళ్లకు చెల్లించే ఆప్షన్ కూడా ఉంది. ఇలా ఒకేసారి మూడేళ్లకు ప్రీమియం చెల్లిస్తే 10–15 శాతం ప్రీమియంలో తగ్గింపు లభిస్తుంది. దీనివల్ల మూడేళ్ల పాటు ప్రీమియం పెంపు భారాన్ని తప్పించుకోవచ్చు. వయసువారీ శ్లాబు మారే ముందు మూడేళ్ల ప్రీమియం ఒకేసారి చెల్లించడం వల్ల.. అక్కడి నుంచి మూడేళ్ల పాటు పెంపు లేకుండా చూసుకోవచ్చు. సూపర్‌టాపప్: ప్రస్తుత పాలసీలో ఎంత కవరేజీ ఉందన్నది ఒక్కసారి గమనించండి. ఒకవేళ రూ.10 లక్షల కవరేజీ ఉంటే, దాన్ని రూ.5 లక్షలకు తగ్గించుకుని, రూ.5 లక్షల డిడక్టబుల్‌తో రూ.20–50 లక్షలకు సూపర్ టాపప్ ప్లాన్ తీసుకోవడం మరో మార్గం. దీనివల్ల బేస్ ప్లాన్ ప్రీమియం తగ్గుతుంది. సూపర్ టాపప్ చౌకగా వస్తుంది. దీనివల్ల మొత్తం మీద ప్రీమియంలో 10–15 శాతం తగ్గుతుంది. ఫ్లోటర్ ప్లాన్: అవివాహితులు ఇండివిడ్యువల్ ప్లాన్ తీసుకుని ఉంటే.. వివాహం తర్వాత జీవిత భాగస్వామితో కలసి కొత్త ప్లాన్‌కు వెళ్లొద్దు. అప్పటికే ఉన్న ప్లాన్‌ను ఫ్లోటర్‌గా మార్చుకుని, జీవిత భాగస్వామిని చేర్చుకోవాలి. దీనివల్ల జీవిత భాగస్వామి ఒక్కరికే వెయిటింగ్ పీరియడ్ తదితర నిబంధనలు వర్తిస్తాయి. కొంత ప్రీమియం కూడా తగ్గుతుంది. గ్రూప్ ప్లాన్: ప్రీమియం భారంగా పరిణమిస్తే.. అప్పుడు పనిచేస్తున్న సంస్థ నుంచి గ్రూప్ ప్లాన్ తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. లేదంటే దాదాపు అన్ని ప్రైవేటు బ్యాంక్‌లు గ్రూప్ హెల్త్‌ప్లాన్లను తమ కస్టమర్లకు తక్కువ ప్రీమియానికే ఆఫర్ చేస్తున్నాయి. వీటిని పరిశీలించొచ్చు. యాక్టివ్ హెల్త్ ప్లాన్: కొన్ని బీమా సంస్థలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించే వారికి ప్రీమియంలో రాయితీ ఇస్తున్నాయి. రోజువారీ వ్యాయామం, నడక తదితర సాధనాలు చేయడం వల్ల అనారోగ్యం రిస్క్ తగ్గుతుందని తెలుసు. దీనివల్ల బీమా సంస్థలకు క్లెయిమ్‌ల రిస్క్ తగ్గుతుంది. పాలసీదారులను ఆరోగ్య సంరక్షణ దిశగా ప్రోత్సహించి, తమ క్లెయిమ్‌లను తగ్గించుకునేందుకు బీమా సంస్థలు ఇలాంటి ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. వీటిల్లో 50 శాతం వరకు ప్రీమియం ఆదా చేసుకోవచ్చు. కోపే: బీమా ప్రీమియం కట్టలేనంత భారంగా మారిపోతే.. అప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ రద్దు కావడం కంటే.. కో పే ఆప్షన్‌కు వెళ్లొచ్చు. ఉదాహరణకు 20 % కో పే ఎంపిక చేసుకుంటే.. ప్రీమియంలోనూ అంతే మేర డిస్కౌంట్ వస్తుంది. హాస్పిటల్లో చేరి చికిత్స తీసుకున్నప్పుడు వచ్చే బిల్లులో 80 శాతాన్నే బీమా సంస్థ చెల్లిస్తుంది. 20 శాతాన్ని పాలసీదారు సొంతంగా భరించాల్సి వస్తుంది. నో క్లెయిమ్ బోనస్: దాదాపు అన్ని బీమా సంస్థలు నో క్లెయిమ్ బోనస్‌ను ఆఫర్ చేస్తున్నాయి. అంటే ఒక పాలసీ సంవత్సరంలో ఎలాంటి క్లెయిమ్ లేకపోతే, మరుసటి సంవత్సరం రెన్యువల్ అనంతరం 10–100 శాతం వరకు ఏటా కవరేజీని పెంచుతుంటాయి. ఇలా గరిష్టంగా 100–200 శాతం వరకు కవరేజీ పెరుగుతుంది. ఉదాహరణకు రూ.10 లక్షల హెల్త్ ప్లాన్‌పై 50 శాతం నో క్లెయిమ్ బోనస్ ఆఫర్ ఉందనుకుంటే.. ఒక ఏడాదిలో క్లెయిమ్ లేకపోతే మరుసటి సంవత్సరం కవరేజీ రూ.15 లక్షలకు పెరుగుతుంది. రెండో ఏడాది కూడా క్లెయిమ్ లేకపోతే రూ.20 లక్షలకు పెరుగుతుంది. మూడో ఏడాది క్లెయిమ్ వస్తే, అప్పుడు పెరిగిన రూ.10 లక్షల నుంచి 50 శాతం అంటే రూ.5 లక్షలను తగ్గిస్తాయి. కానీ కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే సుప్రీమ్ ప్లాన్‌లో సమకూరిన నో క్లెయిమ్ బోనస్‌ను క్లెయిమ్ చేసుకున్నా డిడక్షన్ అమలు చేయడం లేదు. అంటే నో క్లెయిమ్ బోనస్ కూడా కవరేజీగానే మిగిలిపోతుంది. కనుక బేస్ కవర్ రూ.5 లక్షలు తీసుకోవడం ద్వారా ఈ ప్లాన్‌లో మెరుగైన కవరేజీని పొందొచ్చు. దీనివల్ల ప్రీమియం కూడా తగ్గుతుంది. పెద్దలు ఉంటే వారిని ప్రత్యేక ప్లాన్ కింద వేరు చేయాలి.