నకిలీ బంగారు బిస్కెట్‌తో బంగారు గొలుసు అపహరణ
బద్వేలు అర్బన్ : స్థానిక నాలుగు రోడ్ల కూడలి సమీపంలో ఓ మహిళను సినీ ఫక్కీలో మోసం చేశారు.. నకిలీ బంగారు బిస్కెట్ ఎర చూపి ఆమె మెడలోని బంగారు గొలుసును అపహరించారు. మోసపోయినట్లు గుర్తించిన మహిళ పట్టణ పోలీసులను ఆశ్రయించింది. మంగళవారం పట్టణంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించి వివరాలలోకెళితే.. బద్వేలు మండలంలోని అనంతరాజపురం పంచాయతీ గుండంరాజుపల్లె గ్రామానికి చెందిన బుర్రి వీర నారాయణమ్మ తన కుమారునికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆర్టీసీ బస్టాండు సమీపంలోని ఓ చిన్న పిల్లల ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువచ్చింది.
అప్పటికే అక్కడ ఉన్న ఓ 50 ఏళ్ల మహిళ వచ్చి వీరనారాయణమ్మతో ఆసుపత్రులు ఎక్కడ ఉన్నాయని, తదితర విషయాలు మాట్లాడుతూ మెల్లగా పరిచయం పెంచుకుంది. ఇంటికి బయలుదేరేందుకు నాలుగు రోడ్ల కూడలికి వస్తున్న వీరనారాయణమ్మతో సదరు మహిళ కూడా ప్రయాణించి తనకు పది తులాల బంగారు బిస్కెట్ దొరికిందని, దాని విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని, దా నిని ఇద్దరం సమానంగా పంచుకుందామని నమ్మబలికింది. ఇందుకు ఆశపడ్డ వీరనారాయణమ్మ సగం చేయడం ఎలా అంటూ సదరు మహిళను ప్రశ్నించింది.
విలువైన బంగారు బిస్కెట్‌ను బంగారు అంగళ్ల వద్దకు తీసుకెళితే పోలీసులకు తెలుస్తుందని మొత్తం బిస్కెట్ నీవే తీసుకుని.. నీ వద్ద గల బంగారు గొలుసు ఇవ్వాలని వృద్ధురాలు కోరింది. పూర్తిగా ఆమె మాయలో పడ్డ వీరనారాయణమ్మ సుమారు లక్ష రూపాయల విలువ చేసే బంగారు గొలుసును అప్పగించింది. నకిలీ బంగారు బిస్కెట్‌తో ఇంటికి వెళ్లి తన భర్తకు చూపించగా నకిలీదని గుర్తించిన ఆయన పట్టణానికి చేరుకుని బంధువులతో కలిసి చుట్టుపక్కలా గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేది లేక పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
సినీఫక్కీలో మోసం
Published Wed, Apr 1 2015 2:16 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM
Advertisement
Advertisement