మంగళగిరి ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అక్కాచెల్లెళ్లు షాకిరా, ఫాతిమా
మంగళగిరి(తాడేపల్లిరూరల్): గుంటూరు జిల్లా వెలగ పూడిలోని రాష్ట్ర సచివాలయం ప్రధాన గేటు వద్ద మంగళ వారం అక్కాచెల్లెళ్లు షాకిరా, ఫాతిమా ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం సృష్టించింది. సీఎంకు గోడు వెళ్లబోసుకునేందుకు కర్నూలు జిల్లా నుంచి రాగా, భద్రతా సిబ్బంది లోపలికి అనుమతించకపోవడంతో మనస్తాపానికి గురై పురుగు మందు తాగి బలవన్మరణానికి సిద్ధమయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బాధితులను అంబులెన్స్‌లో మంగళగిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
అక్కాచెల్లెళ్లతోపాటు వచ్చిన తల్లి మొహిద్దీన్‌షా.. విషయం తెలిసి విలపిస్తూ కుమార్తెల వద్దకు వెళ్లింది. కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలంలో మహబూబ్ పీరా అనే వ్యక్తి వ్యవసాయ కార్యాలయంలో వీఏవోగా పనిచేస్తూ 20 ఏళ్ల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. దీంతో తమ మూడో కుమార్తె ఫాతిమాకు తండ్రి ఉద్యోగాన్ని కారుణ్య నియామకం కింద ఇవ్వాలని పీరా భార్య మొహిద్దీన్‌షా అధికారులను కోరుతోంది. పెద్ద కుమార్తె బేగం భర్త చనిపోయాడని, రెండో కుమార్తె షాకిరాకు పెళ్లి చేసినా భర్త వదిలేశాడని.. దీంతో వారిద్దరూ తన వద్దే ఉంటున్నారని చెప్పారు.
సాయం కోసం దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని కలిస్తే ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చారని, ఆయన కూతురైన మంత్రి అఖిలప్రియను, ప్రస్తుత ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డిని కలిశామని, ఉద్యోగం ఇప్పిస్తామని చెబుతున్నారు కానీ, ఇప్పించడం లేదని పేర్కొంది. ముఖ్యమంత్రిని కలవడానికి ఇప్పటికే పదిసార్లు వెలగపూడి సచివాలయానికి వచ్చామని, తమ గోడు ఎవరూ వినిపించు కోవడం లేదని కన్నీటి పర్యంతమైంది. తాజాగా పదకొండోసారి కూడా పోలీసులు అడ్డగించారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment