సాక్షి, అమరావతి బ్యూరో, విజయవాడ లీగల్: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం కేసు విచారణకు సంబంధించి రాష్ట్ర పోలీసులు, సిట్ అధికారులు తమకు ఏమాత్రం సహకరించడం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) న్యాయస్థానం దృష్టికి తెచ్చింది. ఈ మేరకు ఎన్‌ఐఏ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ గురువారం విజయవాడ ఎన్‌ఐఏ న్యాయస్థానంలో మెమో దాఖలు చేశారు. వాదనలను విన్న అనంతరం దీనిపై విచారణను న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది. వైఎస్ జగన్‌పై గత ఏడాది అక్టోబరు 25న జరిగిన హత్యాయత్నం తీవ్ర సంచలనం సృష్టించింది. ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే సీఎం చంద్రబాబు, డీజీపీ ఠాకూర్‌లు స్పందిస్తూ కేసును తప్పుదారి పట్టించేలా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఈ కేసు విచారణను స్వతంత్ర దర్యాప్తు సంస్థలతో నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం తెలిసిందే. అనంతరం ఈ కేసుపై విచారణను ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చినట్లు కేంద్ర హోం శాఖ న్యాయస్థానానికి నివేదించింది.
ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చేపట్టిన విచారణకు సంబంధించిన రికార్డులు, మెటీరియల్, వస్తువులను ఎన్‌ఐఏకు అప్పగించాలని విశాఖ పోలీసులను కోర్టు ఆదేశించింది. అయితే విశాఖ పోలీసులు కేసుకు సంబంధించిన రికార్డులను ఇంతవరకు తమకు అప్పగించకుండా సహాయ నిరాకరణ చేయడంపై ఎన్‌ఐఏ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. విశాఖ పోలీసులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ తమకు కేసు రికార్డులు, మెటీరియల్, ఆబ్జెక్ట్స్‌అందించడం లేదని పేర్కొంది.
23లోగా చార్జిషీట్ దాఖలు చేయకుంటే నిందితుడికి బెయిల్!
విశాఖ పోలీసు అధికారులు నిందితుడు శ్రీనివాసరావుకు సహకరిస్తున్నారని, తమ విచారణకు మాత్రం సహకరించడం లేదని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది. ఈ కేసులో 90 రోజుల్లోగా అంటే ఈ నెల 23లోగా తాము చార్జ్‌షీట్ దాఖలు చేయాల్సి ఉందని, లేదంటే నిందితుడు శ్రీనివాసరావు బెయిల్‌పై బయటకు వచ్చే అవకాశం ఉందని ఎన్‌ఐఏ న్యాయస్థానానికి నివేదించింది. ఈ కేసులో తాము ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసి చాలా రోజులైనా రాష్ట్ర పోలీసు అధికారులు విచారణకు ఏ మాత్రం సహకరించడం లేదని తెలిపింది. రికార్డులు లేకుండా చార్జ్‌షీట్ దాఖలు చేయలేమని కోర్టు దృష్టికి తెచ్చింది. కేసుకు సంబంధించిన రికార్డులు, మెటీరియల్, ఆబ్జెక్ట్‌లను తమకు అప్పగించేలా విశాఖ పోలీసులను ఆదేశించాలని ఎన్‌ఐఏ తరఫున ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసు విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు. మరోవైపు వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కస్టడీ శుక్రవారంతో ముగియనున్న నేపథ్యంలో నేడు కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉన్నట్లు తెలిసింది. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని మరో వారం రోజులు పాటు తమ కస్టడీకి అప్పగించాలని ఎన్‌ఐఏ కోరే అవకాశం ఉంది.
కుట్ర కోణం వెలుగులోకి వస్తోందనే...
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసులో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే సూత్రధారులని స్పష్టమవుతోంది. ఈ హత్యాయత్నం కేసులో కుట్ర కోణం వెలుగులోకి వస్తే తమ బండారం బట్టబయలవుతుందని బెంబేలెత్తుతూ రాష్ట్ర పోలీసుల ద్వారా కేసు విచారణను తప్పుదారి పట్టిస్తున్నారు. కోర్టు ఆదేశాలతో ఎన్‌ఐఏ ఈ కేసు విచారణను చేపట్టడంతో సహాయ నిరాకరణ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేస్తూ రాజ్యాంగ సూత్రాలను కాలరాస్తూ రాష్ట్ర ప్రభుత్వం బరితెగించడం విస్మయపరుస్తోంది.
సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకట్ట
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణను కేంద్ర ప్రభుత్వ సంస్థలు చేపడితే తమ కుట్ర బట్టబయలవుతుందని ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలోనే సీబీఐ విచారణకు అనుమతిస్తూ గతంలో ఇచ్చిన అనుమతిని రాష్ట్ర ప్రభుత్వం హఠాత్తుగా ఉపసంహరించుకుంది. ఈమేరకు 2018 నవంబరు 8న ప్రత్యేక జీవో జారీ చేసింది. జగన్‌పై హత్యాయత్నం కేసు విచారణను సీబీఐ చేపట్టకుండా అడ్డుకునేందుకే హడావుడిగా ఈ జీవో ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.
‘ఎన్‌ఐఏ’పై సహాయ నిరాకరణ అస్త్రం
న్యాయస్థానం ఆదేశాలతో జగన్‌పై హత్యాయత్నం కేసును విచారిస్తున్న ఎన్‌ఐఏను సైతం సీఎం చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించడం న్యాయ నిపుణులను విస్మయపరిచింది. ఎన్‌ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ చంద్రబాబు ప్రధాని మోదీకి లేఖ రాయడంపై జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ హత్యాయత్నం సూత్రధారులను రాష్ట్ర ప్రభుత్వం రక్షించేందుకు యత్నిస్తోందన్నది దీనిద్వారా మరింతగా ప్రస్పుటమైంది. రాష్ట్ర పోలీసుల సహాయ నిరాకరణపై ఎన్‌ఐఏ తాజాగా న్యాయస్థానంలో మెమో దాఖలు చేయడం గమనార్హం.
రికార్డులను తారుమారు చేసే అవకాశం?
న్యాయస్థానం ఆదేశించిన తరువాత నిబంధనల ప్రకారం జగన్‌పై హత్యాయత్నం కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను రాష్ట్ర పోలీసులు ఎన్‌ఐఏకు అప్పగించాలి. కానీ విశాఖపట్నం పోలీసులు ఇంతవరకు ఆ పని చేయకపోవడం విస్మయపరుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
బెయిల్‌పై తరలించి మట్టుబెట్టే కుట్ర?
వైఎస్ జగన్‌పై హత్యాయత్నం ఘటన జరిగిన వెంటనే కేసు విచారణ చేపట్టిన విశాఖపట్నం పోలీసులు ఉద్దేశపూర్వకంగానే రెండు నెలలు దాటినప్పటికీ చార్జ్‌షీట్ దాఖలు చేయలేదు. మరోవైపు ఈనెల 9న విచారణ చేపట్టిన ఎన్‌ఐఏకు రికార్డులు అందించకుండా సహాయ నిరాకరణ చేస్తున్నారు. దీంతో ఎన్‌ఐఏ చార్జిషీట్ దాఖలు చేయడంలో జాప్యం జరుగుతోంది. ఈ నెల 23 వరకు ఇలాగే వ్యవహరించి నిందితుడు శ్రీనివాసరావుకు బెయిల్ వచ్చేలా చూడాలన్నది ప్రభుత్వ పెద్దల వ్యూహంగా ఉంది. బెయిల్‌పై శ్రీనివాసరావు బయటకు వస్తే తరువాత ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో అంతు చిక్కకుండా ఉంది. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఇప్పటికే నిందితుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం తెలిసిందే. భద్రత లేని బాహ్య ప్రపంచంలోకి శ్రీనివాసరావును తరలించి మట్టుబెట్టేందుకు కుట్ర పన్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్‌ఐఏ దర్యాప్తుపై హైకోర్టుకు సర్కారు!
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన హత్యాయత్నం ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణకు ఆదేశిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానంలో సవాల్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్‌ఐఏ దర్యాప్తుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు అంతా సిద్ధం చేసింది. ప్రస్తుతం హైకోర్టుకు సంక్రాంతి సెలవులు కావడంతో శుక్రవారం లేదా శనివారం హౌస్‌మోషన్ (న్యాయమూర్తి ఇంటి వద్ద విచారణ జరపడం) రూపంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. హౌస్‌మోషన్ రూపంలో అత్యవసరంగా విచారణ జరిపేందుకు హైకోర్టు నిరాకరిస్తే సోమవారం కోర్టు పునఃప్రారంభమయ్యాక ఈ వ్యవహారంపై వాదనలు వినాలని అభ్యర్థించనుంది. హౌస్‌మోషన్ రూపంలో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తులంతా శనివారం లేదా ఆదివారం అమరావతి చేరుకునే వీలుంది. ఎన్‌ఐఏ తన దర్యాప్తును ఎప్పుడో ప్రారంభించినందున హౌస్‌మోషన్ రూపంలో విచారణ జరిపే అవకాశాలు తక్కువగా ఉన్నాయని భావిస్తున్నారు.
సీఎంతో డీజీపీ ఠాకూర్ భేటీ
ఎన్‌ఐఏ దర్యాప్తుపై సీఎం చంద్రబాబు గురువారం డీజీపీ ఠాకూర్‌తో ప్రత్యేకంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్‌ఐఏ విచారణను వ్యతిరేకిస్తూ కేంద్రానికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోవడంతో కోర్టును ఆశ్రయించి దర్యాప్తును అడ్డుకునే విషయం ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment