
ఆనందం చూడకుండానే...
చోడవరంటౌన్: జాతీయ స్థాయి చిత్రలేఖనం పోటీల్లో ప్రథమ బహుమతి సాధించాడు కాని ఆ బహుమతి తీసుకునే అదృష్టం ఆ బాలునికి లేకపోయింది. పోటీలకు హాజరైన శివకుమార్ దసరాకు రెండు రోజుల ముందు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ‘ప్రకృతి పచ్చదనం’పై అతడు గీసిన చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చినట్లు ఇప్పుడు పాఠశాలకు సమాచారం వచ్చింది. బహుమతి, ప్రశంసాపత్రం పాఠశాలకు వచ్చాయి.
ఆ బహుమతి చూసిన పాఠశాల హెచ్‌ఎం విశ్వనాథం, ఇతర సిబ్బందికి కళ్లు చెమ్మగిల్లాయి. ఆ బాలుడి తల్లిదండ్రులకు బుధవారం బహుమతి అందచేశారు. ఒక వైపు బహుమతి వచ్చిన ఆనందం, మరో వైపు కుమారుడు లేడనే నిజం ఆ తల్లిదండ్రులను శోక సముద్రంలో ముంచింది. చోడవరం పట్టణానికి చెందిన తామరపల్లి ప్రసాద్ కుమారుడు శివకుమార్ స్థానిక ప్రభుత్వ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతూ గుంటూరులో నిర్వహించిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్నాడు. ఆగస్టులో పోటీల్లో పాల్గొన్న శివకుమార్ దసరాకు రెండు రోజుల ముందు కుటుంబ సభ్యులతో కలిసి యాత్రకు వెళుతూ మృతి చెందాడు.