హరోం హరా..
ఊరు.. వాడ.. కొండ.. కోన.. పులకించే పండుగ శివరాత్రి. ఊరూరా ప్రభలు కట్టడం ఈ పండుగ ప్రత్యేకత. పంట ఇంటికి పంటలర వస్తున్న తరుణంలో సంక్రాంతి. ఆ ఆదిదేవుడు దయతో అన్ని పంటలు పూర్తిగా ఇంటికి చేరాక శివరాత్రి. త మను, తమ పంటలను కంటికి రెప్పలా కాపాడిన ఆ భోళాశంకరునికి రైతులు మొక్కులు తీర్చుకుంటారు. వ్యవసాయ వాహనాలు, ఎద్దులు, ఇతరపశువులను శివాలయం చుట్టూ తిప్పుతారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై భ క్తులు ఉత్సాహంగా, ఉల్లాసంగా శివయ్య దర్శనానికి తరలివెళతారు. కొందరు భక్తులు రోజంతా ఉపవాసంతో జాగరం చేయడం ఆనవాయితీ. శివరాత్రి నాడు భక్తులు హరహర మహాదేవ.. శంభోశంకర అంటూ పారవశ్యంతో చేసే శివనామ స్మరణతో చలి శివ..శివా.. అంటూ పారిపోతుందని పెద్దలు చెబుతుంటారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు ప్రముఖ శివాలయాలు సోమవారం నిర్వహించ నున్న శివరాత్రి వేడుకలకు ముస్తాబవుతున్నాయి.
యనమలకుదురులో శివరాత్రి ఏర్పాట్లు
యనమలకుదురు(పెనమలూరు) : నేటి నుంచి ప్రారంభం కానున్న శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయ ప్రధాన ద్వారం నుంచి భక్తులు కొండ పైకి వెళ్లటానికి ప్రత్యేక వాహనాలు కేటాయించారు. ఇతరుల వాహనాలు కొండపైకి అనుమతించరు. మెట్ల మార్గం నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా దీపాలు పెట్టారు. దాదాపు 60 అడుగులు ఎత్తు హనుమంతుడి విగ్రహానికి రంగులు వేశారు. నటరాజస్వామిని తీర్చి దిద్దారు. ఆరు మాసాలుగా చేపట్టిన కొండపై విస్తరణ పూర్తి చేశారు.
శివగిరిపై ఉత్సవాలకు సిద్ధం
మొగల్రాజపురం : కొండపై (శ్రీ వాగ్దేవీ ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం) శివగిరి మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది.40 అడుగుల ఎత్తు త్రిభుజాకారపు డమరుకం కలిగిన శివలింగాన్ని కొండపై ఏర్పాటు చేశారు. సున్నపుబట్టీల సెంటర్‌లోని అమ్మ కల్యాణ మండపం నుంచి శివగిరికి దారి ఉంది. సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహాశివరాత్రి ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని శివగిరిక్షేత్ర స్థాపకుడు మల్లికార్జునశర్మ తెలిపారు.
బలివేలో ఏర్పాట్లు సిద్ధం..
నూజివీడు : ముసునూరు మండలంలోని బలివే గ్రామంలో రామలింగేశ్వరస్వామి (భలే రామస్వామి) ఆలయం మహాశివరాత్రికి ముస్తాబవుతోంది. ఆలయం లో రామలింగేశ్వరస్వామి పశ్చిమ అభిముఖంగా దర్శనమిస్తారు. ఏటా మహాశివరాత్రి నాడు ఇక్కడ స్వామి కల్యాణ మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు.
ఉత్తరవాహినీ ముక్త్యాల..
జగ్గయ్యపేట: మండలంలోని ముక్త్యాలలో భవానీ ముక్తేశ్వర స్వామి ఆలయం శివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ఏటా ఉత్తరవాహినిలో స్నానం ఆచరించి స్వామిని దర్శించుకునేందుకు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. లక్షల సంఖ్యలో భక్తులు స్వామి కల్యాణాన్ని తిలకిస్తారు. అధికారులు స్నానఘాట్‌లను శుభ్రం చేయించారు. గ్రామ సమీపంలోని పంచముఖ అమృత లింగేశ్వరస్వామి (కోటి లింగాలు) మహాశివరాత్రికి ముస్తాబైంది. కోటిలింగాలను ఇక్కడ ప్రతిష్టించేందుకు 108 ఉప ఆలయాలు ఏర్పాటు చేశారు.
రామేశ్వరుని ఆలయం ముస్తాబు
తోట్లవల్లూరు : శివరాత్రి సందర్భంగా మండలంలోని ఐలూరులో గంగా పార్వతీ సమేత రామేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణానదిలో సుమారు లక్ష మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. నదిలో నీరు లేకపోవటంతో బోర్లు వేయించి జల్లు స్నానాలు ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు నదిలో స్నానాలు ఆచరించిన అనంతరం పితృదేవతలకు పిండప్రదానాలు చేస్తారు. అనంతరం రామేశ్వరస్వామి, రఘునాయకస్వామిని దర్శించుకుంటారు. భక్తుల రాకకు పంచాయతీ, దేవాదాయశాఖ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు.
సకల పాప హరణం.. సంగమేశ్వరుడి దర్శనం..
కూడలి(నందిగామ రూరల్): శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు గుర్తొచ్చేది కూడలి తిరునాళ్ల. ఏటా శివరాత్రికి నందిగామ మండలంలోని దాములూరు కూడలిలో సంగమేశ్వరస్వామికి విశేష పూజలు నిర్వహిస్తారు. వైరా, కట్టెలేరు సంగమ ప్రాంతంలో స్వామి వెలిశారు. కృష్ణా, గుంటూరు, ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి భక్తులు హాజరవుతారు. ఈ ఏడాది వైరా, కట్టెలేరు ఎండిపోయాయి. దేవాదాయ, ధర్మాదాయ శాఖాధికారులు ప్రత్యామ్నాయంగా పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేందుకు కుంటలు ఏర్పాటుచేశారు. కూడలి తిరునాళ్ల ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులు తిరునాళ్ల కొనసాగుతుంది.