ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు
చాపాడు : కర్నూలు జిల్లా నుంచి బెంగళూరుకు ఎర్రచందనం దుంగలను రెండు కార్లలో అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారివద్ద నుంచి రూ.10లక్షలు విలువ చేసే దుంగలను బుధవారం తెల్లవారుజామున చాపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలను తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం రావడంతో రూరల్ ఇన్‌ఛార్జి సీఐ టీవీ సత్యనారాయణ, ఎస్‌ఐ హేమకుమార్, తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ హాజీవలిలు సిబ్బందితో కలిసి కార్లలో వెళుతున్న స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు డీఎస్పీ పూజితా నీలం విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు చెందిన పి.నరసింహులు, కె.వెంకటరమణ, కె.నరసింహులు, కె.గురుమూర్తి, ఎం.నరసింహులు, పేట్ల రంగేశ్వరనాథ్‌లు రుద్రవరం నుంచి బెంగళూరులోని ముస్తఫాకు ఎర్రచందనం దుంగలను విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారన్నారు. ఈ మేరకు వారు 44 ఎర్రచందనం దుంగలను ఏపీ02ఏక్యూ8550 నెంబరు గల క్వాలీస్, ఏపీ21వి9029 నెంబరు గల తుఫాను కార్లలో మైదుకూరు, చాపాడు ప్రాంతాల మీదుగా తరలిస్తుండగా ముందస్తు సమాచారం అందుకున్న తమ సిబ్బంది దుంగలను తరలిస్తున్న వాహనాలను వెంబడించారన్నారు.
ఈ క్రమంలో చాపాడు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద దుండగులు కార్లను ఆపి పోలీసు సిబ్బందిపై రాళ్లతో దాడి చేయగా, స్మగ్లర్లను చుట్టుముట్టి అరెస్టు చేశారన్నారు. వీరితో పాటు రెండు వాహనాలు, వాటిలో ఉన్న 44 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగల విలువ సుమారు రూ.10లక్షలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఆమె వివరించారు.