REd scandal smuggling
-
ఆరుగురు స్మగ్లర్లు అరెస్టు
చాపాడు : కర్నూలు జిల్లా నుంచి బెంగళూరుకు ఎర్రచందనం దుంగలను రెండు కార్లలో అక్రమంగా రవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసి వారివద్ద నుంచి రూ.10లక్షలు విలువ చేసే దుంగలను బుధవారం తెల్లవారుజామున చాపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దుంగలను తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం రావడంతో రూరల్ ఇన్‌ఛార్జి సీఐ టీవీ సత్యనారాయణ, ఎస్ఐ హేమకుమార్, తిరుపతి టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ హాజీవలిలు సిబ్బందితో కలిసి కార్లలో వెళుతున్న స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం మధ్యాహ్నం ప్రొద్దుటూరు డీఎస్పీ పూజితా నీలం విలేకరులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు చెందిన పి.నరసింహులు, కె.వెంకటరమణ, కె.నరసింహులు, కె.గురుమూర్తి, ఎం.నరసింహులు, పేట్ల రంగేశ్వరనాథ్లు రుద్రవరం నుంచి బెంగళూరులోని ముస్తఫాకు ఎర్రచందనం దుంగలను విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్నారన్నారు. ఈ మేరకు వారు 44 ఎర్రచందనం దుంగలను ఏపీ02ఏక్యూ8550 నెంబరు గల క్వాలీస్, ఏపీ21వి9029 నెంబరు గల తుఫాను కార్లలో మైదుకూరు, చాపాడు ప్రాంతాల మీదుగా తరలిస్తుండగా ముందస్తు సమాచారం అందుకున్న తమ సిబ్బంది దుంగలను తరలిస్తున్న వాహనాలను వెంబడించారన్నారు. ఈ క్రమంలో చాపాడు సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద దుండగులు కార్లను ఆపి పోలీసు సిబ్బందిపై రాళ్లతో దాడి చేయగా, స్మగ్లర్లను చుట్టుముట్టి అరెస్టు చేశారన్నారు. వీరితో పాటు రెండు వాహనాలు, వాటిలో ఉన్న 44 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. దుంగల విలువ సుమారు రూ.10లక్షలు ఉంటుందన్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచినట్లు ఆమె వివరించారు. -
ఎర్రచందనం స్మగ్లర్ మణివణ్ణన్ అరెస్ట్
-
మణివణ్ణన్ను అరెస్ట్ చేశాం..
కడప: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో అంతర్జాతీయ స్మగ్లర్, చెన్నైకు చెందిన మణివణ్ణన్ అలియాస్ మణిని వైఎస్సార్ జిల్లా రైల్వే కోడూరు పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఢిల్లీలో మణిని అరెస్ట్ చేసి రైల్వేకోడూరుకు తీసుకొచ్చినట్టు జిల్లా ఎస్పీ నవీన్‌గులాటి మంగళవారం కడపలో విలేకరుల సమావేశంలో తెలిపారు. చైనా, నేపాల్, మయన్మార్ తదితర దేశాలకు చెందిన స్మగ్లర్లతో సంబంధాలు కలిగిన మణి స్థానిక స్మగ్లర్లతో కలసి నగదు లావాదేవీలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రైల్వే కోడూరు ఎర్రచందనం అక్రమ రవాణా కేసు (72/15)లో ఇతడు నిందితుడిగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఇదే కేసులో లోగడ అరెస్ట్ చేసిన మరో నిందితుడి ఫోన్ కాల్స్ ఆధారంగా మణిని అరెస్ట్ చేశారు. -
ఎర్రచందనం స్మగ్లర్ మణివణ్ణన్ అరెస్ట్
కడప : మరో ఎర్ర చందనం బడా స్మగ్లర్‌ను కడప పోలీసులు అరెస్ట్ చేశారు. స్మగ్లర్ మణివణ్ణన్ను పోలీసులు ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. హర్యానాలో పట్టుబడ్డ అంతర్జాతీయ స్మగ్లర్ స్మగ్లర్ ముఖేష్ బదానియా ఇచ్చిన సమాచారం మేరకు మణివణ్ణన్ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. మణి అణ్ణన్కు అంతర్జాతీయ స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయి. కాగా ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారం చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శేషాచలం అడవుల్లో తమిళనాడుకు చెందిన ఎర్ర కూలీల ఎన్కౌంటర్ మొదలు చర్చ మరింత తీవ్రమైంది. జిల్లా ఎస్పీ నవీన్ గులాఠి టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి ఎర్రచందన అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారి స్థావరాలను పెకిలిస్తుండటంతో స్మగ్లర్లలో దడ మొదలైంది. హర్యానాకు చెందిన సోంబేర్ సింగ్, కరంబీర్‌లతోపాటు హైదరాబాద్‌కు చెందిన సంజయ్, వినోద్‌ల కోసం కూడా అన్వేషణ సాగుతోంది. ఈ నేపథ్యంలో రహస్య స్థావరాలకు వెళ్లి దాక్కున్న స్మగ్లర్ల గురించి నిఘా బృందం ఆరా తీస్తోంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో మరి కొందరు దాక్కున్నారనే సమాచారం మేరకు వారిని పట్టుకొనేందుకు పోలీసులు వ్యూహ రచన చేశారు. ఈ సందర్భంగా మణివఅణ్ణన్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం అతడిని కడపకు తరలించారు. అతడిని నేడు కోర్టులో హాజరు పరచనున్నారు. -
ఎర్రచందనం అక్రమరవాణాను కట్టడి చేయాలి
డీజీపీ వెంకటరాముడు నెల్లూరు(క్రైమ్) : జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో కట్టడిచేయాలని డీజీపీ జాస్తి వెంకటరాముడు పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక ఉమేష్‌చంద్రా మెమోరియల్ కాన్ఫరెన్స్హాల్లో జిల్లా పోలీసు అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. తొలుత ఆయన సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రచందనం అక్రమ రవాణాను అడవిలోనే అరికట్టాలన్నారు. ఇందుకు గాను కూంబింగ్ దళాలను వెంటనే రంగంలోకి దించాలన్నారు. ఎర్రచందనం నిల్వలున్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించడంతో పాటు గస్తీని ముమ్మరం చేయాలన్నారు. స్మగ్లింగ్, అక్రమ రవాణాకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించవద్దని, వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అవసరమైతే పీడీ యాక్ట్ సైతం నమోదు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలతో పోల్చిచూస్తే నెల్లూరు జిల్లా ప్రశాంతమైనదన్నారు. శాంతిభద్రతల విషయంలో అవరోధాలు పెద్దగా ఉండవన్నారు. సిబ్బంది అందరూ బాధ్యతయుతగా విధులు నిర్వహించి మెరుగైన శాంతిభద్రతలను ప్రజలకు అందించాలని పిలుపునిచ్చారు. అనంతరం ఎస్పీ డాక్టర్ గజరావుభూపాల్ జిల్లాలో పోలీసు అధికారులు తీసుకుంటున్న చర్యలను పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో గుంటూర్ రేంజ్ ఐజీ ఎన్.సంజయ్, ఏఎస్పీ రెడ్డి గంగాధర్, డీఎస్పీలు, సీఐలు పాల్గొన్నారు. -
వేట ఇక ముమ్మరం
►ఎర్రచందనంతో దండలు, బొమ్మలు తయారు చేస్తున్న వారిపై పోలీసుల ద ృష్టి ►హర్యానా, హైదరాబాద్‌కు చెందిన స్మగ్లర్ల గుర్తింపు ►పీడీ యాక్ట్‌ను సవ్యంగా ఉపయోగిస్తే స్మగ్లింగ్‌కు కొంత అడ్డుకట్ట ►అధికారులకు తెలిసే వ్యాపారం చేశానంటున్న బదాని ►బదానిని విచారిస్తే మరిన్ని వివరాలు ఖాయం సాక్షి, కడప : ఎర్రచందనం అక్రమ రవాణా వ్యవహారం చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారింది. శేషాచలం అడవుల్లో తమిళనాడుకు చెందిన ఎర్ర కూలీల ఎన్కౌంటర్ మొదలు చర్చ మరింత తీవ్రమైంది. జిల్లా ఎస్పీ నవీన్ గులాఠి టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి ఎర్రచందన అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారి స్థావరాలను పెకిలిస్తుండటంతో స్మగ్లర్లలో దడ మొదలైంది. వారం క్రితం బి.మఠం మండలానికి చెందిన విజయనరసింహారెడ్డి అనే స్మగ్లర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించడంతో అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. అతడు ఇచ్చిన సమాచారం మేరకే హైదరాబాద్‌కు చెందిన అజయ్‌ని అదుపులోకి తీసుకొని కూపీ లాగుతున్నారు. అజయ్ సహాయంతోనే అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేశ్ బదానిని హర్యానాలో పట్టుకున్నట్లు తెలుస్తోంది. హర్యానాకు చెందిన సోంబేర్ సింగ్, కరంబీర్‌లతోపాటు హైదరాబాద్‌కు చెందిన సంజయ్, వినోద్‌ల కోసం కూడా అన్వేషణ సాగుతోంది. ఈ నేపథ్యంలో రహస్య స్థావరాలకు వెళ్లి దాక్కున్న స్మగ్లర్ల గురించి నిఘాృబందం ఆరా తీస్తోంది. ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో మరి కొందరు దాక్కున్నారనే సమాచారం మేరకు వారిని పట్టుకొనేందుకు వ్యూహ రచన చేసినట్లు సమాచారం. వణుకు పుట్టిస్తున్న బదాని వ్యవహారం హర్యానాలో పట్టుబడ్డ అంతర్జాతీయ స్మగ్లర్ ముఖేష్ బదానిని వారం పాటు కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. అతన్ని పూర్తి స్థాయిలో విచారిస్తే పలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎర్రచందనం అక్రమ రవాణాతో తనకు సంబంధంలేదని, ఫారెస్ట్ అధికారులతో మాట్లాడిన తర్వాతే రుద్రాక్షలు, ఇతర దండల కోసం అధికారికంగానే ఎర్రచందనం కొనుగోలు చేశానని బదాని చెబుతున్నాడు. ఈ మాటలు అధికారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. కాగా, ఎర్రచందనంతో రుద్రాక్షలు, బొమ్మలు, దండలు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తున్న వారిపై వైఎస్ఆర్, చిత్తూరు జిల్లా పోలీసులు దృష్టి సారించారు. ఢిల్లీ ప్రాంతంలో ఎక్కువగా ఉన్న ఈ స్మగ్లర్ల కోసం ప్రత్యేకృబందాలను పంపే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. రెండేళ్లల్లో 10 మందిపై పీడీ యాక్టు ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపడమే లక్ష్యంగా పోలీసులు స్మగ్లర్లపై పీడీ (ప్రివెంటివ్ డిటెన్షన్) యాక్టు అమలు చేస్తున్నారు. ఈ యాక్టు అమలు చేయడం ద్వారా ఏడాది పాటు బెయిల్ వచ్చే అవకాశం ఉండదు. ఎర్రచందనం రవాణాను అదుపు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో గడిచిన రెండేళ్లలో 10 మందిపై పీడీ యాక్టు నమోదైంది. తాజాగా బొడ్డే వెంకటరమణపై పీడీ యాక్టు అమలు చేయడానికి రంగం సిద్ధం చేశారు. మరికొంత మంది స్మగ్లర్లపై కూడా పీడీ యాక్టు తెరిచేందుకు సన్నద్ధమవుతున్నారు. -
వయా కదిరి
కదిరి : కదిరి పట్టణం మీదుగా ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. స్మగ్లర్లు వైఎస్సార్ జిల్లా చక్రాయపేట, రాజంపేట అటవీ ప్రాంతాల నుంచి దుంగలను సేకరించి.. కదిరి మీదుగా బెంగళూరు, చెన్నై నగరాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ భాగోతం వెనుక కదిరి ప్రాంతానికి చెందిన వివిధ రాజ కీయ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులున్నట్లు సమాచారం. కదిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఈశ్వరమలై, బట్రేపల్లి అటవీ ప్రాంతాలు ఉన్నాయి. అయితే.. వీటిలో ఎక్కడా ఒక్క ఎర్రచందనం చెట్టు కూడా లేదు. దీంతో స్మగ్లర్లు వైఎస్సార్ జిల్లా చక్రాయపేట, రాజంపేట అటవీ ప్రాంతాల్లో నరికి తీసుకొచ్చిన ఎర్రచందనం దుంగలను తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి గొరివి కనుమలో నిల్వచేసి.. వీలున్నప్పుడు వాటిని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కొందరు కూలీలను నియమించుకున్నట్లు తలుపుల మండల వాసులు చెబుతున్నారు. చెట్టు నరకడం దగ్గర నుంచి వాటిని తలుపుల అటవీ ప్రాంతంలో లోడ్ చేయించే వరకు కూలీలదే బాధ్యత. ఇందుకోసం వారికి కిలోకు రూ.80 చొప్పున కూలి ఇస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా కొంతకాలంగా ఓ ఫారెస్ట్ అధికారి కనుసన్నల్లోనే సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. స్మగ్లింగ్‌కు సహకరిస్తున్న దళారులకు కిలోకు రూ.300 చొప్పున ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతినెలా రూ.2 కోట్ల విలువ చేసే ఎర్రచందనం కదిరి మార్గంలో తరలిస్తున్నారని సమాచారం. ఎర్రచందనానికి ఎందుకింత డిమాండ్? ఎర్రచందనానికి జపాన్, చైనా దేశాల్లో మంచి గిరాకీ ఉంది. వీటితో సంగీత పరికరాలు, బొమ్మలు, సుగంధ ద్రవ్యాలు, మందులు తయారు చేస్తారు. ఆ దేశాల్లో ప్రతి ఇంట్లో ఎర్రచందనంతో చేసిన వస్తువులు ఉంచుకోవడం ఆచారం. చాలా ఇళ్లలో వాస్తు సంబంధ పరికరాలుగా ఎర్రచందనంతో చేసిన వస్తువులను ఉపయోగించడం ఆనవాయితీ. అందుకే ఎర్రచందనానికి అంత డిమాండ్. మన రాష్ట్రంలో కేవలం చిత్తూరు, వైఎస్సార్ జిల్లా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో మాత్రమే ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. -
ఎర్రచందనం మినీ లారీ పట్టివేత
రూ. కోటి విలువైన 51 దుంగలు స్వాధీనం ఫ్లయింగ్‌స్క్వాడ్, టాస్క్‌ఫోర్స్ ప్రత్యేక బృందం దాడులు కడప అర్బన్ : జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, టాస్క్‌ఫోర్స్ బృందాలు సంయుక్తంగా ప్రత్యేక చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా కడప ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ నాగరాజు ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున మిట్టపల్లె జోగులపల్లె సమీపంలో మినీ లారీలోకి ఎర్రచందనం దుంగలను లోడింగ్ చేస్తుండగా అటవీశాఖ అధికారులు తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. అటవీశాఖ అధికారుల రాకను గమనించిన కూలీలు పరారయ్యారు. మినీ లారీ (కేఏ01 బి 2337)లో మొదట 51 ఎర్రచందనం దుంగలు వేసి, తర్వాత 50 పచ్చిమిరపకాయల మూటలు వేశారు. 20 మంది కూలీలు పరారైనట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ఓ నాగరాజు మాట్లాడుతూ దుంగల విలువ సుమారు రూ. కోటి ఉంటుందన్నారు. అలాగే వాహనం విలువ రూ. 5 లక్షలు ఉంటుందన్నారు. ఈ దాడిలో ఎఫ్ఆర్ఓలు మహమ్మద్ హ యాత్, శ్రీరాములు, ఎఫ్‌ఎస్‌ఓలు ఓబులేశు, చెన్నరాయుడు తదితరులు పాల్గొన్నారన్నారు. అనంతరం లారీని, ఎర్రచందనం దుంగలను కడప డీఎఫ్ఓ మహమ్మద్ దివాన్ మైదిన్ పరిశీలించారు. -
భక్తుల ముసుగులో పాగా
♦ శేషాచలంలో భారీగా పెరిగిన చొరబాట్లు.. రెండువేల మంది తిష్ట ♦ ఉచిత భోజనం తింటూ.. సముదాయాల్లో బసచేస్తూ..అదనుచూసి అడవిలోకి సాక్షి, తిరుమల : శేషాచలంలో లభించే ఎర్రచందనం అక్రమ రవాణా చేసేందుకు స్మగ్లర్లు, కూలీలు శ్రీవారి భక్తుల అవతారం ఎత్తుతున్నారు. తిరుమలలో ఉచిత భోజనం చేస్తూ, వసతి సముదాయాల్లో బసచేస్తూ, అదను చూసి అడవిలో చొరబడి విలువైన సంపదను కొల్లకొడుతున్నారు. అడ్డువచ్చిన అటవీ శాఖాధికారులను హతమార్చుతున్నారు. భక్తుల ముసుగులో స్మగ్లర్లు, కూలీలు వలస చిత్తూరు, వైఎస్ఆర్ కడప జిల్లాలోని శేషాచల అడవులను ఆనుకుని ఉన్న గ్రామాల నుంచి వెళ్లే మార్గాలపై అటవీ శాఖ అధికారులతో పాటు టాస్క్ఫోర్సు సిబ్బంది ఎక్కువ నిఘా పెట్టారు. ఆ ప్రాంతాల్లో వెళ్లేవారిని కట్టడి చేయటంతో స్మగ్లరు, కూలీలు తిరుమలను కేంద్రంగా ఎంచుకున్నారు. ప్రధానంగా తమిళనాడులోని తిరువన్నామలై, సేలం, కృష్ణగిరి, ధర్మపురి, వేలూరు, కర్ణాటకలోని సరిహద్దు గ్రామాల నుంచి కూలీలు భక్తుల రూపంలో తిరుమల చేరుకుంటున్నారు. పెరిగిన జుత్తు, మాసిన గడ్డం, చేతి లో లగేజీలతో తిరుమలకు వస్తున్నారు. ఇక్కడి ఉచి తవసతి సముదాయాల్లో తలదాచుకుంటున్నారు. ఉచిత నిత్యాన్న భోజన సముదాయంలో ఆకలి తీర్చుకుంటారు. ఎవరికీ అనుమానం రాకుండా రోజుల తరబడి తిష్టవేస్తారు. వాతావరణం అనుకూలించాక అడవుల్లోకి చొరబడుతున్నారు. శేషాచలంలో రెండువేల మంది స్మగ్లర్లు, కూలీల తిష్ట చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లాల పరిధిలో సుమారు 5.5 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో శ్రీవేంకటేశ్వర అభయారణ్యం (తిరుమల శేషాచల అటవీ ప్రాంతం) ఉంది. ఇక్కడ అరుదైన జంతు, జీవజాలంతో పాటు విలువైన ఎర్రచందనం, శ్రీగంధం ఎక్కువగా ఉన్నాయి. వీటికి అంతర్జాతీయ స్థాయిలో గిరాకీ ఉంది. విలువైన అటవీ సంపదను కొల్లగొట్టేందుకు దుండగులు బృందాలుగా ఏర్పడి అక్రమ రవాణా చేస్తున్నారు. భక్తుల రూపంలో తిరుమలకు చేరుకుని తిరుమల శ్రీవారి ఆలయానికి ఉత్తర దిశలోని గోగర్భం డ్యాము మీదుగా కాకులకొండ, పారువేట మండపం, పాపవినాశనం మార్గాల నుంచి మామండూరు వరకు ప్రయాణం సాగిస్తారు. మరికొందరు శిలాతోరణం, ధర్మగిరి వేద పాఠశాల, శ్రీవారి పాదాల మీదుగా రంగంపేట, భాకరాపేట, ఎర్రవారిపాళెం, తలకోన వరకు అడవి సందపను తలించేందుకు వెళతారు. మరికొందరు అలిపిరి మార్గం నుంచి గాలిగోపురం మీదుగా నడచివస్తూ మార్గమధ్యంలో అవ్వాచ్చారి కోన లోయ నుంచి శేషతీర్థం, సీతమ్మతీర్థం మార్గాల్లోని ఎర్రచందనం కలపను సేకరిస్తారు. అక్కడి నుంచి మామండూరు, బాలపల్లి నుంచి ఎర్రచందనాన్ని తరలిస్తారు. మహిళా కూలీలు కూడా.. ఎర్రచందనం అక్రమ రవాణాలోకి మహిళా కూలీలు కూడా ప్రవేశించడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తిరుమలలో ఎనిమిది మంది కూలీలు పట్టుబడ్డారు. ఇందులో ఏకంగా నలుగురు మహిళా కూలీలు ఉండటం గమనార్హం. -
43 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, నలుగురు అరెస్ట్
కడప(వైఎస్సార్ జిల్లా): జిల్లాలో ఎర్రచందనం అక్రమరవాణా యధేచ్చగా కొనసాగుతోంది. స్మగ్లర్ల ఆట కట్టించడానికి పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడతూనే ఉంది. అయినా స్మగ్లర్లు ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతూనే ఉన్నారు. తాజాగా వైఎస్ఆర్ జిల్లాలోని బద్వేల్ పరిధి ఒట్టిమడుగు అటవీప్రాంతంలో నలుగురు స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనంలో అక్రమంగా తరలిస్తున్న 43 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం దుంగలను తరలించిన వాహనాన్ని పోలీసులు సీజ్ చేశారు. -
8మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ యధేచ్చగా కొనసాగుతోంది. స్మగ్లర్ల ఆట కట్టించడానికి పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనే ఉంది. ఈ చర్యలో భాగంగా కడప జిల్లాలోని బద్వేల్ సమీపంలోని నెల్లూరు రోడ్డులో మంగళవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను,పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి అక్రమంగా తరలిస్తున్న14 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. -
కానూరులో 30 టన్నుల ఎర్రచందనం స్వాధీనం
ఎర్రచందనం స్మగ్లింగ్ యధేచ్చగా కొనసాగుతోంది. ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. వీరి ఆగడాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనేవుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విజయవాడలోని కానూరు న్యూ ఆటోనగర్ గోడౌన్లో సోమవారం దాడులు జరిపారు. అక్కడి గోడౌన్లో అక్రమంగా దాచి ఉంచిన 30 టన్నుల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ అంతర్జాతీయ మార్కెట్ లో 50 కోట్ల విలువ ఉండవచ్చునని అంచనా. కాగా, కడప జిల్లా రాయచోటికి చెందిన నరేష్ రెడ్డి అనే వ్యక్తిని తిరుపతిలో పోలీసులు పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా పోలీసులకు ఓ సంచలనమైన విషయాన్ని వెల్లడించాడు. విజయవాడలో దాచిన ఎర్రచందనం డంప్ విషయాన్ని చెప్పాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు డంప్ దాచిపెట్టిన కానూరు గోడౌన్‌పై దాడులు జరిపి విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
గంగిరెడ్డిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు
సాక్షి, హైదరాబాద్: ఎర్రచందనం అక్రమ రవాణాలో వాంటెడ్‌గా ఆరోపణలు ఎదుర్కొంటున్న కొల్లం గంగిరెడ్డిపై ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేసింది. 2003లో అలిపిరి వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరిగిన దాడి కేసులోనూ ఇతడిపై ఆరోపణలున్నాయి. ఎర్రచందనం అక్రమ రవాణాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడనే ఆరోపణలకు సంబంధించి గంగిరెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ అయిన గంగిరెడ్డి ఈ ఏడాది మే 15న బెయిల్ పొందాడు. ఆ తర్వాత నకిలీ పాస్‌పోర్ట్‌తో అదే నెల 21న బహెరైన్ పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. -
నలుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
వారిలో ముగ్గురు టీడీపీ నేతలు రాత్రికి రాత్రే రాజమండ్రి జైలుకు చిత్తూరు, న్యూస్‌లైన్: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నలుగురు బడా స్మగ్లర్లను చిత్తూరు పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. వారిని రాత్రికి రాత్రే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చిత్తూరు జిల్లాకు చెందిన భాస్కర్ నాయుడు, విజయానందబాబు, వైఎస్సార్ జిల్లాకు చెందిన మహేష్ నాయుడు, మదిపట్ల రెడ్డినారాయణలను అరెస్టుచేసి వీరిపై పీడీ యాక్టు నమోదు చేశారు. వీరిలో భాస్కర్ నాయుడు, మహేష్ నాయుడు, మదిపట్ల రెడ్డినారాయణ తెలుగు దేశం పార్టీకి చెందిన వారు. డీఎస్పీ కమాలాకర్‌రెడ్డి, ట్రైనీ ఎస్పీ అన్బురాజు ఈ విషయాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వారి కథనం మేరకు... ఎర్రచందనం స్మగ్లింగ్‌లో చిత్తూరు జిల్లా కేవీ పల్లె మండలం నూతన కాల్వకు చెందిన భాస్కర్ నాయుడుపై 20కి పైగా కేసులున్నాయి. చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన విజయానందబాబు అలియాస్ బాబురెడ్డిపై 20కి పైగా కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా సుండుపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన మహేష్‌నాయుడు, సంబేపల్లె మండలం బాటావాండ్లపల్లెకు చెందిన మదిపట్ల రెడ్డినారాయణలపై పలు పోలీస్ స్టేషన్లలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులు నమోదై ఉన్నాయి. కాగా తిరుపతిలోని శేషాచలం అడవుల్లో అటవీశాఖ అధికారులను కొట్టి చంపిన కేసుల్లో సైతం వీరి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు కేసులు నమోదు చేశారు. -
శేషాచల అడవుల్లో పోలీసుల కూంబింగ్
తిరుపతి: తిరుమల శేషాచల అడవుల్లో ఆదివారం కూంబింగ్ నిర్వహించారు. అర్ధరాత్రి ఆమండూరు వద్ద ఎర్రచందనం కూలీలపై ఆకస్మిక దాడి చేశారు. ఈ ఘటనలో 54 మంది ఎర్రచందనం కూలీలను అరెస్ట్ చేశారు. వీరంతా తమిళనాడుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ కూలీలను పోలీసులు అదుపులోకి తీసుకున్న అనంతరం చంద్రగిరి పీఎస్ తరలించారు. గత నెల చివర్లో శేషాచల అడవుల్లో ఎర్రచందనం దొంగలు, ఎస్టీఎఫ్ దళాల మధ్య జరిగిన భీకర పోరులో ముగ్గురు దొంగలు మృతిచెందగా, నలుగురు పోలీసులు గాయపడిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో వంద మంది కూలీలు ఒక్కసారిగా రాళ్లు, విల్లంబులతో దాడిచేశారు. -
శేషాచలంలో భీకరపోరు
ముగ్గురు ఎర్రచందనం దొంగల మృతి సాక్షి, తిరుమల: తిరుమల శేషాచలం అడవుల్లో బుధవారం అర్ధరాత్రి ఎర్రచందనం దొంగలు, ఎస్టీఎఫ్ దళాల మధ్య జరిగిన భీకర పోరులో ముగ్గురు దొంగలు మృతిచెందగా, నలుగురు పోలీసులు గాయపడ్డారు. మృతులు తమిళనాడులోని తిరువన్నామలైకు చెందిన కూలీలు అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం మేరకు.. తిరుమల ఆలయానికి పడమర దిశలో పది కిలోమీటర్ల దూరంలో తలకోన ఛామలారేంజ్‌లో బుధవారం ఉదయం నుంచి ఎస్టీఎఫ్ దళాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. రాత్రి 10 గంటల ప్రాంతంలో సుమారు వంద మంది కూలీలు ఒక్కసారిగా వారిపై రాళ్లు, విల్లంబులతో దాడిచేశారు. అప్రమత్తమైన పోలీసులు రెండు గంటలపాటు సుమారు నలభై రౌండ్ల దాకా ఎదురుకాల్పులు జరిపారు. అయితే, గురువారం ఉదయం ఆ ప్రాంతాన్ని పరిశీలించగా మూడు ఎర్రచందనం దొంగల మృతదేహాలు కనిపించాయి. అలాగే, స్మగ్లర్లు వాడిన గొడ్డళ్లు, కత్తులు, దాడి చేసేందుకు సిద్ధం చేసిన విల్లబులు, రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. స్మగ్లర్లను ఏరిపారేస్తామని ఎస్పీ ఈ సందర్భంగా చెప్పారు. -
గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయండి
హైకోర్టులో కర్నూలు జిల్లా పోలీసుల పిటిషన్ సాక్షి, హైదరాబాద్: ఎర్ర చందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా పోలీసులు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. గంగిరెడ్డికి హైకోర్టు ఈ నెల 15న బెయిల్ మంజూరు చేసిందని, అయితే అతను బహ్రెయిన్‌కు పారిపోయాడని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో ఇతర నిందితులూ దేశం దాటేందుకు అతను సహకరించే ప్రమాదం ఉందని, ఇతనికి అంతర్జాతీయ స్మగర్లతో సంబంధాలు ఉన్నాయని, అందుకుగాను వెంటనే అతని బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టుకు విన్నవించారు. కర్నూలు గ్రామీణ పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం విచారించనున్నారు.