ఎర్ర చందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా పోలీసులు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టులో కర్నూలు జిల్లా పోలీసుల పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఎర్ర చందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ కర్నూలు జిల్లా పోలీసులు హైకోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. గంగిరెడ్డికి హైకోర్టు ఈ నెల 15న బెయిల్ మంజూరు చేసిందని, అయితే అతను బహ్రెయిన్‌కు పారిపోయాడని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణా కేసులో ఇతర నిందితులూ దేశం దాటేందుకు అతను సహకరించే ప్రమాదం ఉందని, ఇతనికి అంతర్జాతీయ స్మగర్లతో సంబంధాలు ఉన్నాయని, అందుకుగాను వెంటనే అతని బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టుకు విన్నవించారు. కర్నూలు గ్రామీణ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ వి.శ్రీనివాసరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరామ్ గురువారం విచారించనున్నారు.