కానూరులో 30 టన్నుల ఎర్రచందనం స్వాధీనం
ఎర్రచందనం స్మగ్లింగ్ యధేచ్చగా కొనసాగుతోంది. ఎర్రచందనం స్మగ్లర్ల ఆగడాలు రోజురోజుకీ మితిమీరుతున్నాయి. వీరి ఆగడాలను అరికట్టేందుకు పోలీస్ యంత్రాంగం ఎప్పటికప్పుడూ చర్యలు చేపడుతూనేవుంది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో విజయవాడలోని కానూరు న్యూ ఆటోనగర్ గోడౌన్లో సోమవారం దాడులు జరిపారు. అక్కడి గోడౌన్లో అక్రమంగా దాచి ఉంచిన 30 టన్నుల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం విలువ అంతర్జాతీయ మార్కెట్ లో 50 కోట్ల విలువ ఉండవచ్చునని అంచనా.
కాగా, కడప జిల్లా రాయచోటికి చెందిన నరేష్ రెడ్డి అనే వ్యక్తిని తిరుపతిలో పోలీసులు పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా పోలీసులకు ఓ సంచలనమైన విషయాన్ని వెల్లడించాడు. విజయవాడలో దాచిన ఎర్రచందనం డంప్ విషయాన్ని చెప్పాడు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు డంప్ దాచిపెట్టిన కానూరు గోడౌన్పై దాడులు జరిపి విలువైన ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు.