కదిరి : కదిరి పట్టణం మీదుగా ఎర్రచందనం అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. స్మగ్లర్లు వైఎస్సార్ జిల్లా చక్రాయపేట, రాజంపేట అటవీ ప్రాంతాల నుంచి దుంగలను సేకరించి.. కదిరి మీదుగా బెంగళూరు, చెన్నై నగరాలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ భాగోతం వెనుక కదిరి ప్రాంతానికి చెందిన వివిధ రాజ కీయ పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులున్నట్లు సమాచారం. కదిరి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఈశ్వరమలై, బట్రేపల్లి అటవీ ప్రాంతాలు ఉన్నాయి. అయితే.. వీటిలో ఎక్కడా ఒక్క ఎర్రచందనం చెట్టు కూడా లేదు.
దీంతో స్మగ్లర్లు వైఎస్సార్ జిల్లా చక్రాయపేట, రాజంపేట అటవీ ప్రాంతాల్లో నరికి తీసుకొచ్చిన ఎర్రచందనం దుంగలను తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి గొరివి కనుమలో నిల్వచేసి.. వీలున్నప్పుడు వాటిని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా కొందరు కూలీలను నియమించుకున్నట్లు తలుపుల మండల వాసులు చెబుతున్నారు. చెట్టు నరకడం దగ్గర నుంచి వాటిని తలుపుల అటవీ ప్రాంతంలో లోడ్ చేయించే వరకు కూలీలదే బాధ్యత. ఇందుకోసం వారికి కిలోకు రూ.80 చొప్పున కూలి ఇస్తున్నట్లు సమాచారం.
ఈ వ్యవహారమంతా కొంతకాలంగా ఓ ఫారెస్ట్ అధికారి కనుసన్నల్లోనే సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. స్మగ్లింగ్‌కు సహకరిస్తున్న దళారులకు కిలోకు రూ.300 చొప్పున ఇస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతినెలా రూ.2 కోట్ల విలువ చేసే ఎర్రచందనం కదిరి మార్గంలో తరలిస్తున్నారని సమాచారం.
ఎర్రచందనానికి ఎందుకింత డిమాండ్?
ఎర్రచందనానికి జపాన్, చైనా దేశాల్లో మంచి గిరాకీ ఉంది. వీటితో సంగీత పరికరాలు, బొమ్మలు, సుగంధ ద్రవ్యాలు, మందులు తయారు చేస్తారు. ఆ దేశాల్లో ప్రతి ఇంట్లో ఎర్రచందనంతో చేసిన వస్తువులు ఉంచుకోవడం ఆచారం. చాలా ఇళ్లలో వాస్తు సంబంధ పరికరాలుగా ఎర్రచందనంతో చేసిన వస్తువులను ఉపయోగించడం ఆనవాయితీ. అందుకే ఎర్రచందనానికి అంత డిమాండ్. మన రాష్ట్రంలో కేవలం చిత్తూరు, వైఎస్సార్ జిల్లా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని అటవీ ప్రాంతాల్లో మాత్రమే ఎర్రచందనం చెట్లు ఉన్నాయి.
వయా కదిరి
Published Wed, May 20 2015 2:37 AM | Last Updated on Mon, May 28 2018 1:08 PM
Advertisement
Advertisement