ఆరేళ్ల చిన్నారిని చంపిన కుక్కలు
* చిన్నారి మృతదేహంతో ధర్నా నిర్వహించిన గ్రామస్తులు
* రూ. లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
కాకుమాను: వీధి కుక్కల దాడిలో అభంశుభం తెలియని ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన సంఘటన గుంటూరు జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాలు.. కాకుమాను మైనార్టీ కాలనీకి చెందిన షేక్ కరిమూన్ కుమార్తె కౌసరా(6) ఉదయం పది గంటల సమయంలో బహిర్భూమికి వెళ్తుండగా సుమారు 10 కుక్కలు చిన్నారిపై దాడిచేశాయి.
ఇది గమనించిన చుట్టు పక్కల వారు అక్కడికి చేరుకునే సరికి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కోపోద్రిక్తులైన గ్రామస్తులు చిన్నారి మృతదేహంతో బాపట్ల-పెదనందిపాడు ఆర్‌అండ్‌బీ రహదారిపై ధర్నా చేపట్టారు. గ్రామంలో కుక్కలు విచ్చలవిడిగా సంచరిస్తున్నా పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని సర్పంచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే మాదిరి 40 రోజుల క్రితం సరస్వతి అనే చిన్నారిపై కుక్కలు దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితికి చేరుకుంది.
వైద్య ఖర్చుల నిమిత్తం గ్రామంలో పలువురి నుంచి విరాళాలు సేకరించి వైద్యం చేయించడంతో ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడింది. అయినా పంచాయతీ అధికారులు స్పందించలేదని గ్రామస్తులు నాలుగు గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ షేక్‌జానీమూన్ ఘటనా స్థలానికి చేరుకొని వారితో మాట్లాడి ఆందోళన విరమింపజేశా రు. చిన్నారి మృతికి ప్రభుత్వం రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్టు కలెక్టర్ నుంచి సమాచారం అందిందని తహశీల్దార్ తెలిపారు.