
అండగా ఉంటా!
- ఆరోరోజు రెండు కుటుంబాలకు వైఎస్ జగన్ భరోసా
- ప్రజల బాగోగులు తెలుసుకుంటూ....సమస్యలు ఆలకిస్తూ సాగిన యాత్ర
- కదిరేపల్లిలో పట్టురైతుల సమస్యలు తెలుసుకున్న జగన్
- జగన్‌తో సమస్యలు విన్నవించిన కూలీలు..ఉద్యోగులు...నిరుద్యోగులు
సాక్షిప్రతినిధి, అనంతపురం: ఎవ్వరూ అధైర్యపడొద్దని...వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ అండగా ఉంటుందని వైఎస్ జగన్ అన్ని వర్గాల ప్రజలకు భరోసా ఇస్తూ రైతు భరోసా యాత్రను కొనసాగిస్తున్నారు. ఆరోరోజు భరోసా యాత్ర మడకశిరలో మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి నివాసం నుంచి మొదలైంది. మడకశిర నుంచి నేరుగా కదిరేపల్లికి చేరుకున్నారు. జగన్‌ను చూసేందుకు సెయింట్‌యాన్స్ పాఠశాల విద్యార్థులంతా రోడ్డుపైకి వచ్చారు. జగన్ రాగానే విద్యార్థులు, సిస్టర్లు జగన్‌కు పుష్పగుచ్చాలు అందించారు.
పిల్లలందరినీ జగన్ ప్రేమ ముద్దాడి దీవించారు. తర్వాత లక్ష్మీనరసప్ప అనే పట్టు రైతు పొలంలోకి వెళ్లారు. జగన్ వస్తున్నారని పలువురు పట్టురైతులు అక్కడికి చేరుకుని సమస్యలను జగన్‌కు వివరించారు. పట్టుగూళ్ల తయారీ, పెట్టుబడి, ప్రభుత్వ తోడ్పాటు, కష్టనష్టాలపై జగన్ ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వంతో పోరడుతామని చెప్పారు. తర్వాత ఉగ్రేపల్లికి చేరుకున్నారు. అక్కడ మహిళలు భారీగా తరలివచ్చారు. అందరినీ జగన్ ఆప్యాయంగా పలకరించారు. వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబుళపతి ఉపాధ్యాయుల సమస్యలపై జగన్‌కు వినతిపత్రం అందజేశారు. తర్వాత బూదిపల్లి, జంబులగుండ మీదుగా మోపురుగుండు చేరుకున్నారు.
ఇక్కడ పింఛన్ రావడం లేదని వృద్ధులు జగన్‌కు వివరించారు. ‘చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్న పింఛన్లు తీసేస్తున్నారు...కొత్త పింఛన్లు ఇవ్వడం లేదు. పోరాడదాం, ధైర్యంగా ఉండండి’ అని జగన్ భరోసా ఇచ్చారు. ఉపాధిపనులు ఉండటం లేదని మహిళా కూలీలు జగన్ దృష్టికి తీసుకొచ్చారు. బతకలేక వలసపోయే పరిస్థితులు ఉన్నాయని వివరించారు. తర్వాత దేవరహట్టి చేరుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న రంగప్ప కుటుంబానికి భరోసా ఇచ్చారు. తర్వాత అక్కడి ఎస్. రాయవరం మీదుగా మందలపల్లికి చేరుకున్నారు. ఇక్కడ జగన్‌ను చూసేందుకు చుట్టపక్కల గ్రామాల నుంచి భారీగా తరలివచ్చారు. యువకులతో కరచాలనం చేశారు. మహిళలనూ దీవించారు.
‘వృద్ధులు రాగానే...బాగున్నావా అవ్వా? పేరేంటి తాతా?’ అని పలకరించారు. అక్కడి నుండి ఎస్‌ఎస్ గుండ్లు చేరుకున్నారు. ఇక్కడి గ్రామస్తులు డప్పువాయిద్యాలతో జగన్‌కు స్వాగతం పలికారు. ఈ గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రైతు గిడ్డీరప్ప కుటుంబానికి జగన్ భరోసా ఇచ్చారు. తర్వాత అక్కడి నుండి నేరుగా గుడిబండ సమీపంలోని ఫాంహౌస్‌కు చేరుకుని రాత్రికి బస చేశారు. కార్యక్రమంలో జిల్లా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ, ఎమ్మెల్యే చాంద్‌బాషా, రాష్ట్రకార్యదర్శి మధుసూదన్‌రెడ్డి, మాజీ మంత్రులు నర్సేగౌడ, షాకీర్, మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామి, కోటి సూర్యప్రకాశ్‌బాబు, వైసీ గోవర్దన్‌రెడ్డి, రవిశేఖరరెడ్డి, శివకుమార్, చవ్వారాజశేఖరరెడ్డి, సంయుక్త కార్యదర్శి నదీమ్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
నేటి భరోసా యాత్ర ఇలా
రైతుభరోసా యాత్ర 7వరోజు వివరాలను వైఎస్సార్‌సీపీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షుడు శంకర్‌నారాయణ సంయుక్తంగా వెల్లడించారు. రొళ్ల మండలంలోని ఉజ్జయినీపురంలో ఆత్మహత్య చేసుకున్న మల్లప్ప కుటుంబానికి భరోసా ఇస్తారు. తర్వాత ఇదే మండలంలో అలుపనపల్లి గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న రామిరెడ్డి కుటుంబానికి భరోసా ఇస్తారు. దీంతో మూడో విడత యాత్ర ముగుస్తుందని వారు తెలిపారు.