లాక్కోడానికి అవేమైనా అత్తగారి సొమ్ములా?
Published Tue, Jan 10 2017 2:44 PM | Last Updated on Sat, Jul 28 2018 6:51 PM
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 23 లక్షల మంది పేదలకు 31 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేస్తే, ఇప్పుడు చంద్రబాబు వచ్చి ఆయన అత్తగారి సొమ్ములా దళితుల భూములు లాక్కుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న రైతు భరోసాయాత్రలో భాగంగా మహానంది మండలం గాజులపల్లిలో ఆయన మాట్లాడారు. అధికారిక లెక్కల ప్రకారమే కర్నూలు జిల్లాలో 40 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, అయినా ఎక్స్‌గ్రేషియా మాత్రం కేవలం నలుగురికే ఇచ్చారని మండిపడ్డారు.
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి వచ్చిందేమీ లేదని, మూడేళ్ల నుంచి ఇక్కడ కరువే కరువని జగన్ అన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. వైఎస్ హయాంలోప్రతి రబీ పంటకు శ్రీశైలం నుంచి నీళ్లు అందాయని, ఇప్పుడు ఆగస్టు 16 నుంచి 844 అడుగుల నీటిమట్టం ఉన్నా కూడా రాయలసీమ రైతులకు నీళ్లు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. పంటలకు గిట్టుబాటు ధరలు కూడా దక్కడం లేదన్నారు. కేబినెట్ సమావేశాల్లో కూడా రైతుల సమస్యలపై మాట్లాడకుండా.. భూములు ఎలా లాక్కోవాలనే విషయంపైనే మాట్లాడుతున్నారని అన్నారు.
పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెడితే, చంద్రబాబు ఇప్పుడు దాన్ని కూడా నీరుగార్చారని జగన్ విమర్శించారు. 108, ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఎక్కడున్నాయో కూడా తెలియదని, కాక్లియర్ ఇంప్లాట్ల కోసం మూడేసి సంవత్సరాలు వేచి చూడాల్సి వస్తోందని అన్నారు. పేదలు చదువుకోవాలనే సదుద్దేశంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం పెడితే, చంద్రబాబు దాన్ని కూడా పక్కన పెట్టేశారన్నారు. అబద్ధపు హామీలతో రైతులు, మహిళలు, విద్యార్థులతో సహా ఎవరినీ వదిలిపెట్టకుండా చంద్రబాబు అందరినీ మోసం చేశారన్నారు. వైఎస్ హయాంలో ప్రాజెక్టులన్నీ 90 శాతం పూర్తయ్యాయని, ఇప్పుడు చంద్రబాబు 5 శాతం మాత్రమే పనులు చేసి ఆ ప్రాజెక్టులన్నింటినీ తానే కట్టించినట్లు అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని అన్నారు. ఇలాంటి వ్యక్తిని మనందరం ఒక్కటై బంగాళాఖాతంలో కలిపేద్దామని కర్నూలు వాసులకు ఆయన పిలుపునిచ్చారు.
Advertisement
Advertisement