‘నాటి సువర్ణయుగం మళ్లీ రావాలి’
దోర్నాల: అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదని ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం ప్రకాశం జిల్లా దోర్నాలలో ప్రసంగించారు. చంద్రబాబు సీఎం అయ్యాక...రాష్ట్రంలో వరుసగా కరువులొచ్చాయని వైఎస్ జగన్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ముష్టి వేసినట్లు రూ.100 కోట్లు ఇచ్చారని, ఆ నిధులు ఏ మూలకు చాలవని, ఆ నిధులతో ప్రాజెక్ట్ పనులు ఎప్పుడు పూర్తవుతాయని ప్రశ్నించారు.
హెడ్ రెగ్యులేటరీ పనులను ఇప్పటివరకూ ప్రారంభించనే లేదని, రైతులపై కాకుండా చంద్రబాబుకు కాంట్రాక్టర్లపై ప్రేమ ఉందని, డబ్బు...డబ్బు...డబ్బు... తప్ప చంద్రబాబుకు ఏమీ అవసరం లేదని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'మూడేళ్ల పాలన పూర్తయిందని, మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తాయని, అ తర్వాత కచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది. మన ప్రభుత్వం వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం' అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరినవారు రాజీనామా చేయాలని లేదంటే వారిపై అనర్హత వేటు వేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. సీఎంగా గెలవాలంటే ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను లాక్కోవడం కాదని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలని ఆయన పేర్కొన్నారు. ఇక ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ 42 లక్షల ఇళ్లు నిర్మిస్తే...చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. దివంగత నేత వైఎస్‌ఆర్ నాటి సువర్ణయుగం మళ్లీ రావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.
అలాగే వెన్నుపోటు నేతలను బంగాళాఖాతంలో కలపాలని, అందుకోసం అందరూ కలిసికట్టుగా ముందుకు వెళదామని ఆయన కోరారు. అనంతరం వైఎస్‌ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.