dornala
-
మరో రహదారి నిర్మాణానికి పచ్చజెండా.. కేంద్రమంత్రి ట్వీట్
సాక్షి, అమరావతి: శ్రీశైలం భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలో మరో రహదారి నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ప్రకాశం జిల్లా డోర్నాల నుంచి కుంట జంక్షన్ వరకు ఉన్న రహదారిని రెండు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. గతిశక్తి ప్రాజెక్టులో భాగంగా 30 కి.మీ. ఈ రహదారిని రెండు లైన్లు(విత్ పావ్డ్ సోల్డర్స్)గా అభివృద్ధి చేయనున్నారు. అందుకోసం కేంద్ర రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ రూ.244.83కోట్లతో ప్రణాళికను ఆమోదించింది. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. 📢 Andhra Pradesh 👉 Widening to 2-Lane with paved shoulder of Dornala to Kunta junction section of NH-765 (Pkg-2) at district Prakasam in Andhra Pradesh has been approved on EPC mode with a budget of Rs. 244.83 Cr. #PragatiKaHighway #GatiShakti @ysjagan @kishanreddybjp — Nitin Gadkari (@nitin_gadkari) December 9, 2022 చదవండి: (17 ఏళ్ల నిరీక్షణకు తెర.. ఆ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు) -
గుల్బర్గాకు వెళ్లొచ్చిన కుటుంబం: 38 మందికి పాజిటివ్
ధారూరు: వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలోని దోర్నాల్ తండాలో కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేవలం 300 జనాభా ఉన్న ఆ చిన్న గ్రామం కరోనా పేరు వింటేనే వణికిపోతోంది. తండాకు చెందిన ఓ కుటుంబం రెండు వారాల కిందట కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాలోని ఓ గ్రామంలో నిర్వహించిన విందుకు వెళ్లి వచ్చింది. వారంరోజుల తర్వాత క్రమంగా ఆ కుటుంబంలోని వారందరూ అనారోగ్యం బారిన పడుతూ వచ్చారు. ఈక్రమంలో వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది తండాలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి కరోనా టెస్టులు చేయగా.. విందుకు వెళ్లొచ్చిన వారి కుటుంబంలో 13 మందికి, తండాలోని మరో 25 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణయింది. వీరందరూ ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. వీరిలో మంగళవారం ఉదయం రూప్లానాయక్ (101) మృతి చెందారు. ఈయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో విషయం తెలుసుకున్న తాండూర్లోని మహాసేవ యూత్ వెల్ఫేర్ సభ్యులు సయ్యద్ కమాల్, అక్తర్, సోహెల్, అహ్మద్‌ఉమ్రి, సాకిద్‌మీర్, తౌఫీక్, ఎండీ నజీర్ తండాకు చేరుకుని అంత్యక్రియలను పూర్తిచేశారు. కరోనా పాజిటివ్ రావడంతో ఆత్మహత్య గార్ల: కరోనా బారిన పడడంతో ఆందోళనకు గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని కోట్యానాయక్‌తండాకు చెందిన బానోత్ శంకర్(45)కు ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇంటికి వెళ్లాక భయంతో పురుగుల మందు తాగాడు. శంకర్‌ను వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి, అక్కడి నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శంకర్ మంగళవారం తెల్లవారుజామున మృతి చెందాడు. చదవండి: మాస్కు ధరించలేదని చిన్నారులతో -
కోళ్లు ఎందుకు చనిపోతున్నాయ్..?
సాక్షి, వికారాబాద్: ధారూరుమండల పరిధిలోని దోర్నాల్ గ్రామంలో శనివారం ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పర్యటించారు. వరుసగా గ్రామంలో కోళ్లు మృత్యువాత పడుతున్న విషయం తెలిసిందే. కోళ్ల ఎందుకు చనిపోతున్నాయని ఇన్చార్జి వెటర్నరీ డాక్టర్ హతీరాంను ప్రశ్నించారు. మూడు రకాల నట్టలు కోళ్లకు వ్యాపించడంతో మృతిచెందుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని డాక్టర్ వివరించారు. దానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్టు ఏదని ఎమ్మెల్యే అడుగగా.. ఇంకా అందలేని, సాయంత్రం వరకు రావచ్చని వెటర్నరీ డాక్టర్ తెలియజేశారు. రిపోర్టు రావడానికి నాలుగు రోజుల సమయం సరిపోవడం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. (చదవండి : వికారాబాద్‌లో వింత వ్యాధి కలకలం) మృతిచెందిన కోళ్లను పాతిపెట్టకుండా, బహిరంగ ప్రదేశాల్లో పడేయడంతో కాకులు, కోళ్లు తినడంతో మిగతావి చనిపోతున్నాయని హతీరాం తెలిపారు. వ్యాక్సిన్, పౌడర్ సరఫరా చేయడంతో వ్యాధి అదుపులోకి వచ్చిందన్నారు. గ్రామంలో ఎవరెవరి ఇళ్లలో ఎన్ని కోళ్లు చనిపోయాయో.. వాటి వివరాలు సేకరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. అవసరమైతే పరిహారం కోసం ప్రయత్నం చేద్దామని డాక్టర్ ఆనంద్.. ఇన్చార్జి వెటర్నరీ డాక్టర్ హతీరాంకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయలక్ష్మి, వైస్ ఎంపీపీ విజయకుమార్, జెడ్పీటీసీ సుజాత, సర్పంచ్ పట్లోళ్ల సుజా త, పీఏసీఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, వైస్ చైర్మన్ రాజునాయక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇబ్రహీం, చంద్రారెడ్డి ఫౌండేషన్‌చైర్మన్ హన్మంత్‌రెడ్డి పాల్గొన్నారు. -
హెడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి స్థల పరిశీలన
శ్రీశైలం ప్రాజెక్టు: ప్రకాశం జిల్లా దోర్నాల ప్రాంతంలోని కొత్తపల్లి గ్రామం వద్ద వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణానికి నిపుణుల కమిటీ సభ్యులు..స్థలాన్ని పరిశీలించారు. రిటైర్డ్ ఈఎన్సీ బి ఎస్ ఎన్ రెడ్డి, రిటైర్డు చీఫ్ ఇంజనీర్లు సుబ్బారావు, రౌతు సత్యనారాయణలు ఆ ప్రాంతాన్ని పరిశీలించినట్లు జలవనరుల శాఖ ఎస్ఈ మల్లికార్జునరెడ్డి శనివారం తెలిపారు. నిపుణుల కమిటీ సభ్యులు.. శ్రీశైలం రిజర్వాయర్ వెనుక భాగం నుంచి కృష్ణానదిలో కొల్లంవాగుకు చేరుకుని ఆ ప్రాంతంలో హెడ్‌రెగ్యులేటర్‌ను నిర్మించేందుకు రవాణా మార్గాలను, నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించినట్లు ఆయన చెప్పారు. శ్రీ’శైల జలాశయానికి 21. కి.మీటర్ల నదీ మార్గ పరిధిలో కొల్లంవాగు ప్రదేశం ఉంది. -
‘నాటి సువర్ణయుగం మళ్లీ రావాలి’
-
‘నాటి సువర్ణయుగం మళ్లీ రావాలి’
దోర్నాల: అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక్క ప్రాజెక్ట్ కూడా కట్టలేదని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం ప్రకాశం జిల్లా దోర్నాలలో ప్రసంగించారు. చంద్రబాబు సీఎం అయ్యాక...రాష్ట్రంలో వరుసగా కరువులొచ్చాయని వైఎస్ జగన్ అన్నారు. వెలిగొండ ప్రాజెక్టుకు ముష్టి వేసినట్లు రూ.100 కోట్లు ఇచ్చారని, ఆ నిధులు ఏ మూలకు చాలవని, ఆ నిధులతో ప్రాజెక్ట్ పనులు ఎప్పుడు పూర్తవుతాయని ప్రశ్నించారు. హెడ్ రెగ్యులేటరీ పనులను ఇప్పటివరకూ ప్రారంభించనే లేదని, రైతులపై కాకుండా చంద్రబాబుకు కాంట్రాక్టర్లపై ప్రేమ ఉందని, డబ్బు...డబ్బు...డబ్బు... తప్ప చంద్రబాబుకు ఏమీ అవసరం లేదని వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'మూడేళ్ల పాలన పూర్తయిందని, మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తాయని, అ తర్వాత కచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది. మన ప్రభుత్వం వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం' అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో చేరినవారు రాజీనామా చేయాలని లేదంటే వారిపై అనర్హత వేటు వేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. సీఎంగా గెలవాలంటే ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను లాక్కోవడం కాదని, ప్రజల గుండెల్లో స్థానం సంపాదించాలని ఆయన పేర్కొన్నారు. ఇక ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు రోడ్డున పడేశారని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ 42 లక్షల ఇళ్లు నిర్మిస్తే...చంద్రబాబు ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ నాటి సువర్ణయుగం మళ్లీ రావాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు. అలాగే వెన్నుపోటు నేతలను బంగాళాఖాతంలో కలపాలని, అందుకోసం అందరూ కలిసికట్టుగా ముందుకు వెళదామని ఆయన కోరారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన పార్టీ కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. -
బస్సు- లారీ ఢీ: ఆర్టీసీ డ్రైవర్ దుర్మరణం
ప్రకాశం జిల్లా దోర్నాలకు సమీపంలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా ప్రయాణిస్తోన్న ఆర్టీసీ బస్సు.. ఆగిఉన్న లారీని ఢీకొనడంతో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అయితే ప్రయాణికులు మాత్రం ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడగలిగారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. -
లోయలో పడిన బస్సు; 14 మందికి గాయాలు
ప్రకాశం : ప్రకాశం జిల్లా డోర్నాల మండలం చింతల వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీశైలం ఘాట్ రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దాంతో ఒక బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. శుక్రవారం సాయంత్రం శ్రీశైలం నుంచి విజయవాడకు వెళుతున్న విజయవాడ డిపో డీలక్స్ బస్సును ఘాట్ రోడ్డులో కర్నూలు జిల్లా బనగానపల్లె డిపోకు చెందిన బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో విజయవాడ డిపో బస్సు లోయలో పడిపోయింది. అయితే, కొద్ది లోతులోనే ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో డ్రైవర్ తిరుమలయ్యకు తీవ్ర గాయాలు కాగా, మరో 14 మంది ప్రయాణికులు స్వలంగా గాయపడ్డారు. లోయలో పడిన బస్సులో 40మంది ప్రయాణీకులు ఉన్నట్లు సమాచారం. వీరిలో శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ తహసీల్దార్ బెంజమిన్‌తో పాటు, వినుకొండకు చెందిన ఎన్వీఎస్ శర్మ, పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురంకు చెందిన బ్రహ్మం, విష్ణు, విజయవాడకు చెందిన తాత మనవళ్లు జమలయ్య, అవినాష్, పశ్చిమగోదావరి జిల్లా భీమవరంకు చెందిన వెంకటలక్ష్మి తదితరులు ఉన్నారు. క్షతగాత్రులను 108, ఆర్టీసీ బస్సుల్లో దోర్నాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు
డోర్నాల: ఆంధ్రప్రదేశ్ లో అధికార టీడీపీ కార్యకర్తలు ఆగడాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. అధికారం తమ చేతిలో ఉందన్న అహంకారంతో అడ్డుఅదుపు లేకుండా చెలరేగిపోతున్నారు. ప్రతిపక్ష కార్యకర్తలపై విచక్షణరహితంగా దాడులు చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా డోర్నాల మండలం ఐనముక్కలలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. టీడీపీ కార్యకర్తల దాడిని వైఎస్సార్ సీపీ ఖండించారు. దాడికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.