'ఆ నిధులు కరెంట్ బిల్లులకూ సరిపోవు'
మడకశిర : హంద్రీనీవా ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన నిధులు కనీసం కరెంట్ బిల్లులకు కూడా సరిపోవని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. అనంతపురం జిల్లాలో ఆయన చేపట్టిన రైతు భరోసాయాత్ర ఐదో రోజు కొనసాగుతోంది. మడకశిరలో జరిగిన బహిరంగసభ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్టాటకలో బోయ వర్గంవారు ఎస్టీలుగా ఉన్నారని, కానీ ఏపీలో మాత్రం బీసీలుగా ఉండిపోయారన్నారు. తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత జరిగే తొలి అసెంబ్లీ సమావేశాల్లో బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని తీర్మానం చేస్తామని ఆయన పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విడుదల చేసిన రూ.200 కోట్ల నిధులు కరెంట్ బిల్లులకు కూడా సరిపోవంటూ ఆయన ఎద్దేవా చేశారు.
తాను అధికారంలోకి వస్తే ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తిచేసి ఆయకట్టుకు నీరందిస్తానన్నారు. రైతులు, మహిళలను బాబు దారుణంగా మోసం చేశారని ఆయన మండిపడ్డారు. ఏపీని గుడిసెలు లేని రాష్ట్రంగా చేస్తానన్న బాబు ఒక్క ఇల్లయినా కట్టించి ఇవ్వాలన్నారు. విద్యుత్ ఛార్జీలు దారుణంగా పెంచారని, గతంలో రూ. 200 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు రూ.600 వస్తోందని తెలిపారు. చంద్రబాబు సర్కార్ మెడలు వంచైనా సరే హామీలు సాధించుకుందామని ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.