రౌడీ షీటర్లే భయపడ్డారు
హత్యాయత్నం కుట్రను బయట పెట్టిన రౌడీషీటర్లు
ఏఎస్సై కోణంపై పోలీసుల ఆరా సస్పెన్షన్‌కు రంగం సిద్ధం
విజయవాడ సిటీ : నాలుగు నెలలుగా పథకం అమలుకు ప్రయత్నించారు. రెండుసార్లు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. రెండో ప్రయత్నం అతనిని మరణం అంచుల వరకు తీసుకెళ్లినా అదృష్టం కొద్దీ బయట పడ్డాడు. పదే పదే ప్రణాళిక మార్చినా హతమార్చే అవకాశం రాకపోవడం, పోలీసుల ట్రీట్‌మెంట్ భయం వెన్నాడటంతో నున్న పోలీసు స్టేషన్ ఏఎస్సై ఆంబోతుల రాంబాబు నుంచి సుఫారీ తీసుకున్న రౌడీషీటర్లు హత్యాయత్నం కుట్రను లీక్ చేసి పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. పోలీసు ప్రతిష్ట దిగజారేలా రౌడీషీటర్లతో హత్యకు కుట్ర చేసిన రామారావును సస్పెండ్ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. సొంత అల్లుడినే హతమార్చేందుకు కుట్ర చేసిన కేసులో నున్న పోలీసు స్టేషన్ ఏఎస్సై రామారావు, రౌడీషీటర్లు షేక్ ఖాసిం, షేక్ చాన్‌బాషా, కాంగ్రెస్ నాయకుడు గంజి శౌరిని శనివారం సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అల్లుడుని హతమార్చేందుకు కుట్ర వెనుకున్న నిజాలను పోలీసులు రాబట్టారు.
నాలుగు నెలలుగా
రెండో కుమార్తె శ్రావణి భర్త కన్నం శ్యామ్‌ను హతమార్చేందుకు నాలుగు నెలల కిందటనే ఏఎస్సై రామారావు రౌడీషీటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సంతకాల కోసం పోలీసు స్టేషన్‌కి వచ్చిన సమయంలో పరిచయం అయిన ఖాసిం, చాన్‌బాషాతో తన అల్లుడి వ్యవహారాన్ని చర్చించాడు. ఎలాగైనా మట్టుబెడితే రూ.5 లక్షలు ఇస్తానని చెప్పాడు.
తొలుత రూ.1.50 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చి పని పూర్తయిన తర్వాత మిగిలిన రూ.3.50 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. వీరికి అవసరమైన ఆయుధాలను రామారావు ప్రత్యేకంగా తయారు చేయించి ఇచ్చాడు. పలుమార్లు సత్యనారాయణపురంలోని పోలీసు క్వార్టర్స్‌లో తానుంటున్న ఇంట్లోనే అల్లుడి హత్యపై రామారావు చర్చలు జరిపాడు. అల్లుడికి సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు వీరికి తెలియజేస్తుండేవాడు.
రెండు ప్రయత్నాలు
పథకం అమలులో భాగంగా శ్యామ్‌తో రౌడీషీటర్లు పరిచయం పెంచుకున్నారు. ఆపై ఏదో వంకతో తీసుకెళ్లి మద్యం ఇప్పించడం ప్రారంభించాడు. కొత్తపేటలోని ఓ బార్‌లో హతమార్చేందుకు జనవరిలో ప్రయత్నించారు. వీరి ప్రవర్తనపై అనుమానం రావడంతో శ్యామ్ అక్కడి నుంచి జారుకున్నాడు. పది రోజుల కిందట మరోసారి ఖుద్దూస్‌నగర్‌లోని రైల్వే ట్రాక్ వద్దకు పిలిపించి మద్యం తాగించారు. మరో ఐదు నిమిషాల్లో రానున్న రైలు కింద తోసేసి చంపాలనేది వీరి ప్రయత్నం. అయితే భార్య శ్రావణి ఫోన్ చేయడంతో రౌడీషీటర్లు ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా శ్యామ్ వెళ్లిపోయాడు. రైలు ముందొచ్చినా, ఇంటి నుంచి ఫోన్ రాకపోయినా రెండో ప్రయత్నంలోనే శ్యామ్‌ను హతం చేసేవారు.
అవాక్కు
రౌడీషీటర్లతో కలిసి రామారావు పన్నిన కుట్ర తెలిసి భార్యాభర్తలు అవాక్కయ్యారు. గతంలో ఓ చోరీ కేసులో శ్యామ్ జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉండగా, శ్రావణి పుట్టింట్లోనే ఉంది. ఆ సమయంలో తరుచూ రౌడీషీటర్లతో తండ్రి హత్యకు పథక రచన చేయడం గమనించింది. అయితే ఇలాంటి విషయాలు తనకెందుకులే అంటూ సరిపుచ్చుకుంది. తీరా అప్పట్లో వారు చర్చించింది తన భర్తను హతమార్చేందుకేనని తెలిసి ఆమె కంగుతిన్నట్లు పోలీసులు చెప్పారు.
ప్రత్యేక బృందాలు
పరారీలోని రౌడీషీటర్ నెలటూరి రవి ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు సత్యనారాయణపురం ఇన్‌స్పెక్టర్ ఎం.సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే రవికి సంబంధించి కొంత సమాచారం సేకరించామని, ఒకటి రెండు రోజుల్లోనే పట్టుకొని అరెస్టు చేస్తామని చెప్పారు. నగర బహిష్కరణలో ఉన్నప్పటికీ తరుచూ ఇక్కడికి వచ్చి వెళుతున్నట్టు ఈ కేసు ద్వారా పోలీసులు గుర్తించారు.
స్కెచ్ పక్కానే..!
Published Mon, Feb 22 2016 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM
Advertisement
Advertisement