Rowdy sheeter murder
-
చంపేస్తానన్నాడు.. చివరికి వాళ్లే చంపేశారు
సాక్షి, హిమాయత్‌నగర్( హైదరాబాద్): చంపేస్తానంటూ పలుమార్లు హెచ్చరించిన రౌడీషీటరే.. ప్రత్యర్థుల చేతిలో హతమయ్యాడని, ఈ నెల 17న మలక్‌పేట వహీద్నగర్కు చెందిన రౌడీషీటర్ సయ్యద్ ముస్తఖుద్దీన్ (35)ను హత్య చేసిన అయిదుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ చెప్పారు. ఈస్ట్‌జోన్ జాయింట్ కమిషనర్ రమేష్‌రెడ్డి, అడిషనల్ డీసీపీ మురళీధర్, టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ జి.చక్రవర్తిలతో కలిసి సోమవారం ఆయన కార్యాలయంలో వెల్లడించా రు. చంపుతానంటే.. చంపేశారు సీపీ చెప్పిన వివరాల ప్రకారం.. సయ్యద్ ముస్తఖుద్దీన్కు ఓల్డ్ మలక్‌పేటకు చెందిన రౌడీషీటర్లు, డెయిరీఫాం వ్యాపారి మహమూద్ బిన్ అల్వీ అలియాస్ మహమూద్ జబ్రీ, బైన్స్వాల మహమూద్, ఇతని తమ్ముడు ఆయూబ్ బిన్ అల్వీల మధ్య పాత కక్షలు ఉన్నాయి. మహమూద్ బిన్ అల్వీని చంపేస్తానంటూ సయ్యద్ ముస్తఖుద్దీన్ గతంలో పలుమార్లు బెదిరింపులకు దిగాడు. దీంతో మహమూ ద్ బిన్ అల్వీ తన తమ్ముడు ఆయుబ్ బిన్అల్వీకి విషయం చెప్పాడు. పూల్‌బాగ్ చాంద్రాయణగుట్టకు చెందిన మహ్మ ద్ హైదర్ అలీ ఖద్రీ, ఓల్డ్ మలక్‌పేటకు చెందిన మహ్మద్ జుబేర్, రామంతాపూర్‌నకు చెందిన వలీ అహ్మద్‌ల సాయం తీసుకున్నారు. ఈ నెల 17న అర్ధరాత్రి ఓల్డ్ మలక్‌పేటలోని అబూ బకర్ మసీదు వద్దకు వచ్చిన సయ్యద్ ముస్తఖుద్దీన్పై కత్తులతో దాడి చేశారు. ముస్తఖుద్దీన్ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న చాదర్‌ఘాట్ పోలీసులు విచారణ చేపట్టారు. అఫ్జల్‌గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో నిందితులను అరెస్టు చేశారు. వీరు సెల్‌ఫోన్ స్నాచింగ్‌లకు సైతం పాల్పడినట్లు సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు నగరంలో అవాంఛనీయ ఘటనలకు పాల్పడి.. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జనవరి 1 నుంచి ఈ నెల 15 వరకు మొత్తం 21 మంది రౌడీషీటర్లను అరెస్ట్ చేశామన్నారు. మరో 31మందిపై పీడీ యాక్ట్ పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఎవరైనా రౌడీయిజం చెలాయించాలని చూస్తే ప్రజలు 94906 16555కు వాట్సప్‌లో ఫిర్యాదు చేయాలని సీపీ సూచించారు. జంట నగరాల్లో ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా 272 మంది చిన్నారులను రెస్క్యూ చేశామన్నారు. బోనాలు, బక్రీద్ వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలన్నారు. ఇటీవల సెల్ఫోన్లు పోగొట్టుకున్న 30 మందికి తిరిగి వాటిని అందజేశామని చెప్పారు. ఎస్సార్‌నగర్, కార్ఖానా, ఆసీఫ్‌నగర్ పోలీసు స్టేషన్లను 15 రోజుల్లో ప్రారంభించనున్నట్లు సీపీ తెలిపారు. -
గ్యాంగ్‌వార్: ‘హత్యలన్నీ సీరియల్‌గా జరిగాయి’
సాక్షి, చిత్తూరు: తిరుపతి గ్యాంగ్‌వార్ ఘటనలో ఏడుగురు నిందితులను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. రెండు రోజుల క్రితం దినేష్ అనే రౌడీ షీటర్‌ను కొందరు దుండగులు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగిందని పోలీసులు చెప్తున్నారు. దినేష్ హత్యకు నిందితులు ఉపయోగించిన మూడు కత్తులను స్వాదీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసు వివరాలను తిరుపతి అర్బన్ ఎస్పీ రమేశ్ రెడ్డి మీడియాకు తెలిపారు. రెండేళ్ల క్రితం భార్గవ్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడని తెలిపారు. భార్గవ్ హత్యకు బెల్ట్ మురళి కారణమని ప్రత్యర్థులు అతన్ని చంపేశారని వెల్లడించారు. ఇప్పుడు అతని వర్గీయులు దినేష్‌ను హతమార్చారని చెప్పారు. ఈ హత్యలన్నీ సీరియల్‌గా జరిగాయని ఎస్పీ వివరించారు. నగరంలోని ఐఎస్ మహల్ వద్ద రౌడీ షీటర్ దినేష్ (35) హత్యకు గురయ్యాడు. ట్యాక్సీ నడుపుతూ జీవన సాగిస్తున్న దినేష్ పనిముగించుకుని ఆదివారం రాత్రి ఇంటికి తిరిగి వెళుతుండగా ఐఎస్ మహల్ సమీపంలోని హారిక బార్ వద్ద కాపుగాసిన ప్రత్యర్థులు కత్తులతో పొడిచి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన దినేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. (చదవండి: పాత కక్షలు: రౌడీ షీటర్ దారుణ హత్య) -
నడిరోడ్డుపై రౌడీషీటర్ హత్య
మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్లలో సోమవారం ఓ రౌడీషీటర్‌ను దుండగులు వెంటాడి నడిరోడ్డుపైనే నరికి చంపారు. రెండు హత్య కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన అతను పట్టణంలో ఉన్న భార్య వద్దకు వచ్చి ప్రత్యర్థుల చేతిలో బలయ్యాడు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మూడు గంటల్లోనే నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు హత్యలో పాల్గొన్నట్లు ప్రాథమిక విచారణలో కనుగొన్నారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లికి చెందిన రౌడీషీటర్ శెట్టిపల్లి ప్రేమ్‌కుమార్(30) గతంలో రేపల్లె, చెరుకుపల్లి గ్రామాల్లో రెండు హత్య కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తూ అప్పీలుకు వెళ్లి తిరిగివచ్చాడు. ఆ రెండు సంఘటనల్లో హత్యకు గురైన రేపల్లెకు చెందిన శివ, చెరుకుపల్లికి చెందిన నాగేశ్వరరావు బంధువులు ప్రేమ్‌కుమార్‌పై కక్ష పెట్టుకుని అదును కోసం వేచివున్నారని సమాచారం. ప్రేమ్‌కుమార్ భార్య జ్యోత్స్న మాచర్ల ప్రాంతంలో నివాసముంటూ వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. ప్రేమ్‌కుమార్ సోమవారం మాచర్లలో ఉన్న తన భార్య వద్దకు వచ్చి బుల్లెట్‌పై తిరిగి వెళుతుండగా మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు కారులో ప్రేమ్‌కుమార్‌ను వెంబడించారు. పట్టణంలోని ఎస్వీఆర్ బార్ సమీపంలో దాడికి దిగారు. పసిగట్టిన ప్రేమ్‌కుమార్ బుల్లెట్‌ను వదిలివేసి పారిపోతుండగా దుండగులు వెంటపడి తల వెనుక భాగంలో గొడ్డలితో నరికారు. దీంతో ప్రేమ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ సాంబశివరావు ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. సంఘటన జరిగిన వెంటనే అన్ని కోణాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. తెల్ల అంబాసిడర్ కారులో వచ్చిన నిందితులు హత్య అనంతరం దాంట్లోనే పారిపోయారు. సమాచారం అందుకున్న రెంటచింతల ఎస్ఐ కోటేశ్వరరావు వాహనాలు తనిఖీ చేస్తుండటాన్ని గమనించిన నిందితులు కారును వెనక్కు తిప్పారు. ఎస్ఐ కారును వెంబడించారు. నిందితులు గోలి గ్రామంలో కారును వదిలేసి పరారయ్యారు. ఎస్ఐ వెంటాడి గోలి సమీపంలోని క్వారీలో జూలకంటి సుధాకర్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరు పరారయ్యారు. మరో నలుగురు అంతకు ముందే సత్రశాలలో దిగి నల్గొండ జిల్లాలోకి వెళ్లిపోయారని పోలీసులు వెల్లడించారు. పోలీసుల అదుపులో ఉన్న సుధాకర్‌ను విచారించగా తన అన్న సురేష్ సూచనలతో ఏడుగురం ఈ హత్య చేసినట్లు వెల్లడించాడు. -
‘ఆధిపత్యం కోసమే రౌడీ షీటర్ ఖాసిం హత్య’
సాక్షి, విశాఖపట్నం : ఆధిపత్య పోరే రౌడీ షీటర్ ఖాసిం హత్యకు కారణమని కమిషనర్ మహేష్‌చంద్ర లడ్డా పేర్కొన్నారు. ఆగస్టు రెండో తేదీన జరిగిన ఈ హత్య కేసును ఛేదించిన సీపీ మహేష్‌చంద్ర లడ్డా మీడియాతో మాట్లాడారు.. ఆధిపత్యం కోసమే రౌడీ షీటర్ ఖాసింను హత్య చేశారని, ఈ హత్యకు ముందు అతని అనుచరుడు బతిన మురళిని హతమార్చేందుకు రెక్కీ నిర్వహించారని. అయితే అతడు రాకపోయే సరికి మళ్లీ డైమండ్ పార్క్ సాయిరామ్ పార్లర్ వద్ద రెక్కీ నిర్వహించారని, వాహనాలతో వెంబడించి ఖాసింను హతమార్చారని ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ ఘటనలో నిందితులైన మెరుగు చిట్టి బాబు అలియాస్ చిట్టి మాము, అంబటి అంబటి మధుసూదన్ రావు అలియాస్ ఋషికొండ మధు, గుడ్ల వినోద్ కుమార్ రెడ్డి అలియాస్ రామాటాకీస్ వినోద్, శీలం సతీష్, సయ్యద్ రెహాన్ అలియాస్ మున్నా, చొప్పా హేమంత కుమార్, గతడ శ్రీనివాసులు ఉన్నారు. మరికొంతమంది పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరి నుంచి ఒక పిస్టల్, రెండు రౌండ్ల బుల్లెట్లు, ఆటో, ఆరు పదునైన కత్తులు, ఒక స్టీల్ రాడ్, కారంపోడి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. -
బెజవాడలో రౌడీషీటర్ హత్య
విజయవాడ/తెనాలిరూరల్: విజయవాడ టీడీపీలో వర్గ విభేదాలు హత్యా రాజకీయాలకు దారితీశాయి. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అనుచరుడు, పేరుమోసిన రౌడీషీటర్ వేమూరి సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బును ప్రత్యర్థులు బుధవారం పట్టపగలు నడిరోడ్డుపై నరికి చంపారు. అతనికి టీడీపీ విజయవాడ తెలుగు యువత అధ్యక్షుడు కాట్రగడ్డ శ్రీనుతోనూ, తెనాలిలో పాత ప్రత్యర్థులతోనూ దీర్ఘకాలంగా విభేదాలున్నాయి. పక్కా పథకంతోనే.. అయ్యప్ప మాలధారణలో ఉన్న రౌడీషీటర్ సుబ్బు టూవీలర్‌పై విజయవాడ మాచవరం డౌన్‌కు బుధవారం ఉదయం 11 గంటలకు చేరుకున్నాడు. అక్కడ ఉన్న బెంచిపై కూర్చుని మాట్లాడుతుండగా.. మూడు బైక్‌లపై ఆరుగురు దూసుకొచ్చారు. వారిలో ముగ్గురు అయ్యప్ప మాలధారణలో ఉన్నారు. తనపై దాడిని ఊహించిన సుబ్బు పరుగులు తీశాడు. ఆరుగురూ సుబ్బును వెంటాడి కత్తులు, గొడ్డళ్లతో దాడి చేశారు. వందమీటర్ల దూరంలో కింద పడిపోయిన సుబ్బును విచక్షణా రహితంగా కత్తులు, గొడ్డళ్లతో నరికేశారు. దాదాపు 16 చోట్ల నరికేశారు.ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుళ్లు గుర్తించి వెంటాడి నిందితులను అదుపులోకి సుకున్నారు. టీడీపీలో తీవ్ర విభేదాలు విజయవాడ చేరిన సుబ్బు టీడీపీ నగర తెలుగు యువత అధ్యక్షుడు కాట్రాగడ్డ శ్రీను పంచన చేరి సెటిల్మెంట్లు చేయసాగాడు. కాట్రగడ్డ శ్రీనుతో విభేదాలు వచ్చి 2014 ఎన్నికల ముందు బోండా ఉమా మహేశ్వరరావుకు దగ్గరయ్యాడు. ఈ నేపథ్యంలోనే కాట్రగడ్డ శ్రీనుతో తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. గత అక్టోబర్‌లో అక్రమంగా తుపాకుల కొనుగోలుతో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సుబ్రహ్మణ్యం ఇటీవల బెయిల్‌పై వచ్చాడు. తమను టార్గెట్ చేసి తుపాకులు కొనుగోలు చేశాడనే అనుమానంతోనే కాట్రగడ్డ శ్రీను వర్గీయులే సుబ్బును హతమార్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. -
పాత కక్షలతోనే రౌడీషీటర్ హత్య!
సాక్షి గుంటూరు: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన గుంటూరు రౌడీషీటర్ బసవల వాసు హత్య కేసును గుంటూరు అర్బన్ పోలీసులు 24 గంటల వ్యవధిలోనే ఛేదించారు. హత్యకు పాల్పడిన ఆరుగురు నిందితులను సోమవారం రాత్రి అరెస్టు చేశారు. గుంటూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం రాత్రి విలేకర్ల సమావేశంలో అర్బన్ ఎస్పీ విజయారావు వివరాలు వెల్లడించారు. ఓ గొడవలో గుంటూరులోని సంగడిగుంటకు చెందిన చక్రకోటి సాయి, బాలాజీ నగర్‌కు చెందిన సింగంశెట్టి సతీష్‌లపై గతంలో వాసు దాడికి పాల్పడ్డాడు. దీన్ని మనసులో ఉంచుకున్న సతీష్ తన మిత్రుడైన రౌడీషీటర్ కావటి రాజేష్‌తో పాటు ఎస్.కె.ఆదాం, ఎస్.కె.సులేమాన్, గట్టుపల్లి శివరామకృష్ణలతో కలిసి ఆదివారం రాత్రి వాసును దారుణంగా హత్య చేసి పారిపోయారు. -
ఆ హత్యకు బ్యాంకాక్‌లోనే స్కెచ్...
-
పీఎస్‌లో ఆర్టీసీ విజిలెన్స్ డీఎస్పీ లొంగుబాటు
-
నడిరోడ్డుపై రాడ్‌తో కొట్టి చంపారు..
పహాడీషరీఫ్: పట్టపగలు.. నడిరోడ్డుపై దుండగులు ఓ రౌడీ షీటర్‌ను హతమార్చారు. ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. వెనుక నుంచి వచ్చి జాకీ రాడ్‌తో తలపై కొట్టి చంపేశారు. ఈ ఘటన చూసి ఆ మార్గంలో వెళ్లే వాహనదారులు, స్థానికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ వీవీ చలపతి, స్థానికుల కథనం ప్రకారం....బార్కాస్‌కు చెందిన అమర్ అమ్‌షాన్(41)పై పహాడీషరీఫ్, చాంద్రాయణగుట్ట పోలీస్స్టేన్న్లలో రౌడీషీట్ ఉంది. ఇతను బాలాపూర్ ఎంఐఎం ఎంపీటీసీ అలీ అమ్షాన్కు సోదరుడు. సోమవారం సాయంత్రం 5 గంటలకు అమర్ అమ్‌షాన్ ద్విచక్రవాహనంపై న్యూబాబానగర్ బస్తీ నుంచి ప్రధాన రహదారి ఎక్కి పహాడీషరీఫ్ వైపు మళ్లాడు. వెనుక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు అతడిని అడ్డగించి.. తలపై జాకీరాడ్‌తో బలంగా కొట్టారు. దీంతో తల పగిలి మెదడు బయటపడటంతో అలీ అమ్‌షాన్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు దర్యాప్తులో ఉంది. కాగా, బార్కాస్‌కు చెందిన ఉమర్ బహమాద్ అనే యువకుడు సోమవారం రాత్రి పహాడీషరీఫ్ పోలీస్షే్టషన్లో లొంగిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ హత్యకు భూ వివాదాలే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. మృతుడికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. -
స్కెచ్ పక్కానే..!
రౌడీ షీటర్లే భయపడ్డారు హత్యాయత్నం కుట్రను బయట పెట్టిన రౌడీషీటర్లు ఏఎస్సై కోణంపై పోలీసుల ఆరా సస్పెన్షన్‌కు రంగం సిద్ధం విజయవాడ సిటీ : నాలుగు నెలలుగా పథకం అమలుకు ప్రయత్నించారు. రెండుసార్లు చేసిన ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. రెండో ప్రయత్నం అతనిని మరణం అంచుల వరకు తీసుకెళ్లినా అదృష్టం కొద్దీ బయట పడ్డాడు. పదే పదే ప్రణాళిక మార్చినా హతమార్చే అవకాశం రాకపోవడం, పోలీసుల ట్రీట్మెంట్ భయం వెన్నాడటంతో నున్న పోలీసు స్టేషన్ ఏఎస్సై ఆంబోతుల రాంబాబు నుంచి సుఫారీ తీసుకున్న రౌడీషీటర్లు హత్యాయత్నం కుట్రను లీక్ చేసి పోలీసులకు చిక్కినట్టు తెలిసింది. పోలీసు ప్రతిష్ట దిగజారేలా రౌడీషీటర్లతో హత్యకు కుట్ర చేసిన రామారావును సస్పెండ్ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. సొంత అల్లుడినే హతమార్చేందుకు కుట్ర చేసిన కేసులో నున్న పోలీసు స్టేషన్ ఏఎస్సై రామారావు, రౌడీషీటర్లు షేక్ ఖాసిం, షేక్ చాన్‌బాషా, కాంగ్రెస్ నాయకుడు గంజి శౌరిని శనివారం సత్యనారాయణపురం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అల్లుడుని హతమార్చేందుకు కుట్ర వెనుకున్న నిజాలను పోలీసులు రాబట్టారు. నాలుగు నెలలుగా రెండో కుమార్తె శ్రావణి భర్త కన్నం శ్యామ్‌ను హతమార్చేందుకు నాలుగు నెలల కిందటనే ఏఎస్సై రామారావు రౌడీషీటర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. సంతకాల కోసం పోలీసు స్టేషన్‌కి వచ్చిన సమయంలో పరిచయం అయిన ఖాసిం, చాన్బాషాతో తన అల్లుడి వ్యవహారాన్ని చర్చించాడు. ఎలాగైనా మట్టుబెడితే రూ.5 లక్షలు ఇస్తానని చెప్పాడు. తొలుత రూ.1.50 లక్షలు అడ్వాన్సుగా ఇచ్చి పని పూర్తయిన తర్వాత మిగిలిన రూ.3.50 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. వీరికి అవసరమైన ఆయుధాలను రామారావు ప్రత్యేకంగా తయారు చేయించి ఇచ్చాడు. పలుమార్లు సత్యనారాయణపురంలోని పోలీసు క్వార్టర్స్‌లో తానుంటున్న ఇంట్లోనే అల్లుడి హత్యపై రామారావు చర్చలు జరిపాడు. అల్లుడికి సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు వీరికి తెలియజేస్తుండేవాడు. రెండు ప్రయత్నాలు పథకం అమలులో భాగంగా శ్యామ్‌తో రౌడీషీటర్లు పరిచయం పెంచుకున్నారు. ఆపై ఏదో వంకతో తీసుకెళ్లి మద్యం ఇప్పించడం ప్రారంభించాడు. కొత్తపేటలోని ఓ బార్లో హతమార్చేందుకు జనవరిలో ప్రయత్నించారు. వీరి ప్రవర్తనపై అనుమానం రావడంతో శ్యామ్ అక్కడి నుంచి జారుకున్నాడు. పది రోజుల కిందట మరోసారి ఖుద్దూస్‌నగర్‌లోని రైల్వే ట్రాక్ వద్దకు పిలిపించి మద్యం తాగించారు. మరో ఐదు నిమిషాల్లో రానున్న రైలు కింద తోసేసి చంపాలనేది వీరి ప్రయత్నం. అయితే భార్య శ్రావణి ఫోన్ చేయడంతో రౌడీషీటర్లు ఎంతగా వారిస్తున్నా వినిపించుకోకుండా శ్యామ్ వెళ్లిపోయాడు. రైలు ముందొచ్చినా, ఇంటి నుంచి ఫోన్ రాకపోయినా రెండో ప్రయత్నంలోనే శ్యామ్‌ను హతం చేసేవారు. అవాక్కు రౌడీషీటర్లతో కలిసి రామారావు పన్నిన కుట్ర తెలిసి భార్యాభర్తలు అవాక్కయ్యారు. గతంలో ఓ చోరీ కేసులో శ్యామ్ జ్యుడిషియల్ రిమాండ్‌లో ఉండగా, శ్రావణి పుట్టింట్లోనే ఉంది. ఆ సమయంలో తరుచూ రౌడీషీటర్లతో తండ్రి హత్యకు పథక రచన చేయడం గమనించింది. అయితే ఇలాంటి విషయాలు తనకెందుకులే అంటూ సరిపుచ్చుకుంది. తీరా అప్పట్లో వారు చర్చించింది తన భర్తను హతమార్చేందుకేనని తెలిసి ఆమె కంగుతిన్నట్లు పోలీసులు చెప్పారు. ప్రత్యేక బృందాలు పరారీలోని రౌడీషీటర్ నెలటూరి రవి ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు సత్యనారాయణపురం ఇన్స్పెక్టర్ ఎం.సత్యనారాయణ తెలిపారు. ఇప్పటికే రవికి సంబంధించి కొంత సమాచారం సేకరించామని, ఒకటి రెండు రోజుల్లోనే పట్టుకొని అరెస్టు చేస్తామని చెప్పారు. నగర బహిష్కరణలో ఉన్నప్పటికీ తరుచూ ఇక్కడికి వచ్చి వెళుతున్నట్టు ఈ కేసు ద్వారా పోలీసులు గుర్తించారు. -
మారేడ్‌పల్లిలో మళ్లీ అలజడి
అరెస్టుకు భయపడి రౌడీషీటర్ ఆత్మహత్యాయత్నం ఠాణాపై దాడి ఘటనలో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్: పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటనలో సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టులను వేగవంతం చేశారు. దాడికి పాల్పడినవారిలో ఇప్పటికే 48 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం తెల్లవారు జామున మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌పై దాడికి కారకులైన రౌడీషీటర్ దశరథ్, ఎమ్మార్పీఎస్ నేత సాయితో పాటు మరికొందరిని పోలీసులు పట్టుకున్నారు. రాత్రి 2 గంటలకు లాలాగూడలోని ఓ ఇంట్లో ఆశ్రయం పొందుతున్న రౌడీషీటర్ దశరథ్ను అదుపులోకి తీసుకుంటుండగా క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది.. దశరథ్ను సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటనలో దశరథ్ పరోక్షంగా సహకరించారని పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దశరథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. గతంలోనూ ఆత్మహత్యాయత్నం మారేడ్‌పల్లికి చెందిన దశరథ్పై 1989 లోనే పోలీసులు రౌడీషీట్ తెరిచారు. తర్వాత అతడిలో మార్పు రావడంతో 2001లో రౌడీషీట్ నుంచి అతడి పేరును తొలగించారు. కొన్నాళ్ల తర్వాత దశరథ్ ఓ హత్య కేసులో నిందితుడిగా తేలడంతో మళ్లీ రౌడీషీట్ తెరిచారు. అయితే అప్పటి నుండి తనపై రౌడీషీట్‌ను తొలగించాలని దశరథ్ ప్రయత్నిస్తున్నాడు. పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడు. మరోసారి బలవన్మరణానికి అనుమతివ్వాలంటూ హెచ్ఆర్సీని ఆశ్రయించి సంచలనం సృష్టించాడు. కాగా, పోలీసు స్టేషన్‌పై దాడి కేసులో పోలీసులు అమాయకులను సైతం అరెస్టు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని, తక్షణమే అమాయకులను విడుదల చేయాల్సిందిగా ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం నగర కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలసి విన్నవించారు. సీపీని కలిసిన వారిలో టీడీపీ నేతలు టీఎన్ శ్రీనివాస్, డీఆర్ శ్రీనివాస్, కొండయ్య చౌదరి తదితరులున్నారు. -
అక్కడ నిప్పు... ఇక్కడ గాయం
బిక్కుబిక్కుమంటున్న బస్తీ వాసులు పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటనలో 35 మంది అరెస్ట్ పరారీలో మరికొందరు కుట్రతో సంబంధం లేని వ్యక్తులపైనా కేసులు కన్నీటి పర్యంతమవుతున్న నిందితుల కుటుంబ సభ్యులు ఆవేశమో... ఆగ్రహమో... రగిల్చిన మంటలు... ఇప్పుడు కొన్ని గుండెలను దహించేస్తున్నాయి. క డుపులను కాల్చేస్తున్నాయి. అమాయక జనం కళ్లలో కన్నీటి వర్షానికి కారణమవుతున్నాయి. మంటలకు కారణం ఒకరైతే... ఇప్పుడు గాయపడుతున్నది మరొకరు. ఆగ్రహం ఒకరిదైతే...ఆవేదన మరొకరిది. భర్త, పిల్లలు దూర మై ఇల్లాలు... కన్నబిడ్డను పోలీసులు తీసుకెళ్తుంటే... నిస్సహాయంగా నిలబడిన తల్లి.. ఆధారమైన తమ్ముడు అరెస్టయితే... ఆకలితో అలమటిస్తున్న అక్క...ఇలా ప్రతి ఇల్లూ ఇప్పుడు ఓ శోక సంద్రం. ఇదీ మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటన ఫలితం. మారేడుపల్లి: ఒకరిద్దరు నేరస్తులు, రౌడీషీటర్ల కుట్ర వల్ల ఇప్పుడు మహత్మాగాంధీ నగర్, వాల్మీకి నగర్, దుర్గయ్య గార్డెన్ బస్తీలు శిక్ష అనుభవిస్తున్నాయి. ఏ క్షణంలో ఏ ఇంటిపై పోలీసులు దాడి చేస్తారో... ఎవరిని అరెస్టు చే సి తీసుకెళ్తారోనని భయంతో బిక్కుబిక్కుమంటున్నాయి. అంతా రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు. ఏ రోజుకు ఆ రోజు పని చే స్తే తప్ప పూట గడవదు. అలాంటి ఇళ్లలో సంపాదించే వ్యక్తులు అరె స్టవడంతో పిల్లలు, పెద్దలు, మహిళలు వీధిన పడ్డారు. ఇదీ మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి పరిణామం. భయం భయంగా... బన్నప్ప మృతితో పోలీస్ స్టేషన్‌పై దాడికి కుట్రకు పాల్పడింది కొందరైతే... ఫలితాన్ని మాత్రం అందరూ అనుభవించాల్సి వస్తోంది. మొత్తం 101 మంది దాడికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వారిలో 35 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో 66 మంది అరెస్టుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కేసులు ఎదుర్కొంటున్న వారిలో కొందరు పరారీలో ఉన్నారు. దీంతో పోలీసులు ఎప్పుడొస్తారో? ఎవరిని అరెస్టు చేస్తారోనన్న ఆందోళనతో స్థానికులు బితుకుబితుకుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. దాడి రోజు అసలేం జరుగుతోందో తెలియని పరిస్థితుల్లో మద్యం మత్తులో కొందరు ఉన్నారు. గుంపుతో వెళ్లిన వారు మరికొందరు. ‘దాడిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్లతో పాటు ఏమాత్రం సంబంధం లేని వారిని సైతం అరెస్టు చేస్తున్నారంటూ’ బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఒకే ఇంట్లో ముగ్గురు, నలుగురు మగవాళ్లు అరెస్టయ్యారు. వారంతా పనిచేసి సంపాదిస్తే తప్ప ఆ కుటుంబాలకు పూట గడవదు. ఎప్పుడొస్తారో తెలియని తమ వారి కోసం బాధిత కుటుంబాలు దీనంగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబ సభ్యులు ‘సాక్షి’తో తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఇంట్లో నలుగురినీ అరెస్టు చేశారు : లాల్ బీ స్టేషన్‌పై గొడవతో ఏమాత్రం సంబంధం లేకున్నా నా భర్తతో పాటు ముగ్గురు కుమారులనూ అరెస్టు చేశారు. బస్తీలో మటన్ షాపును నిర్వహిస్తూ బతుకుతున్నాం. బోనాల సందర్భంగా మాంసం విక్రయిస్తుండగా... బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌కు వెళ్తుంటే మావాళ్లూ వెళ్లారు. అప్పటికే స్టేషన్ వద్ద గొడవ సద్దుమణిగిందని మావాళ్లు చెప్పారు. అయినా పోలీసులు షాబోద్దీన్, రఫీక్, మహ్మద్ మౌలానా, చాంద్‌లను అరెస్టు చేసి జైలుకు పంపారు. మూడు రోజులగా మటన్‌షాపు మూసేసి రోడ్డున పడ్డాం. నా భర్త, కొడుకులు ఎప్పుడొస్తారో తెలియడం లేదు. వాళ్లకు సంబంధం లేదు : గంగ, చందు సోదరి దాడితో సంబంధం లేకున్నా పోలీసులు అక్రమంగా మా ఇంట్లో ఉన్న ముగ్గురు మగవారినీ అరెస్టు చేశారు. మా తమ్ముడు చందు ఆటో ద్వారా సంపాదించే ఆదాయంపైనే మా కుటుంబం ఆధారపడి ఉంది. మా అక్క కొడుకులు నవీన్, రవితేజ మా ఇంట్లో ఉండి చదువుకుంటున్నారు. నవీన్‌ను పోలీసులు అరెస్టు చేస్తుంటే అడ్డు పడినందుకు చందును అరెస్టు చేశారు. నాలుగు రోజులుగా సంపాదన లేక ఇల్లు గడవడం కష్టంగా మారింది. చందుకు 20 రోజుల క్రితమే బాబు పుట్టాడు. చంటి పిల్లాడితో మా మరదలు పడే వేదన మమ్మల్ని మరింత కలచివేస్తోంది. చూడ్డానికి వెళ్లాం : లక్ష్మి, అజయ్ సోదరి బన్నప్ప చనిపోయాడని తెలియడంతో పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్లాం. అప్పటికే స్టేషన్‌పై దాడికి పాల్పడ్డారు. మరుసటి రోజు మాకు సంబంధం ఉందంటూ పోలీసులు మా బాబును తీసుకు వెళ్లారు. చిత్రహింసలకు గురి చేశారు. తప్పు చేసిన వారిని శిక్షించండి. అమాయకులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేయొద్దు. చిన్న పిల్లోడినీ అరెస్టు చేశారు : మల్లమ్మ, చంద్రశేఖర్ తల్లి పోలీసు స్టేషన్ దగ్గర గొడవని తెలిసి అప్పటిదాకా ఇంట్లోనే ఉన్న నా కొడుకు చంద్రశేఖర్ అక్కడికి వెళ్లాడు. గొడవలో మా కొడుకు పాల్గొనకపోయినా అరెస్టు చేశారు. 18 ఏళ్లు కూడా నిండని నా కొడుకును అన్యాయంగా ఇరికించారు. పోలీసులే చట్టాలను ఉల్లంఘిస్తే ఎలా?: జస్టిస్ చంద్రకుమార్ ఈ కేసు వెనుక కొన్ని శక్తులు ఉన్నాయనే మాట బలంగా వినిపిస్తోంది.సమగ్ర విచారణ లేకుండానే పోలీసులు అమాయకులను అరెస్టు చేస్తున్నారు. చనిపోయిన బన్నప్న తల్లిని, తమ్ముడిని సైతం కొట్టిన గుర్తులు ఉన్నాయి. అర్ధరాత్రి పూట అరెస్టులకు పాల్పడుతున్నారు. వాళ్లేమైనా దేశద్రోహులా? పగటి పూట స్టేషన్‌కు రప్పించవచ్చు. విచారణ చేయవచ్చు. చట్టవ్యతిరేకంగా అరెస్టులకు పాల్పడి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. పోలీసులే చట్టాలను ఉల్లంఘించడం మంచిది కాదు. ఫ్రెండ్లీ పోలీస్‌కు విరుద్ధం : ఎస్.జీవన్‌కుమార్, అధ్యక్షులు, మానవ హక్కుల వేదిక మారేడుపల్లి పోలీస్ స్టేషన్‌పై దాడికి పాల్పడిన వారిలో పాతనేరస్తులు, రౌడీషీటర్లు ఉండవచ్చు. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోండి. కుట్రలతో సంబంధం లేని వారు కూడా అరెస్టవుతున్నారు. దీనివల్ల వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. పోలీసులు సంయమనంతో వ్యవహరించాలి. వారం రోజులుగా నగరంలో 5 చిత్రహింసల కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ‘స్నేహపూర్వకమైన పోలీసులు’అనే భావనకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఇది సరికాదు. ఫోన్ కాల్స్‌పైనా ఆరా దాడిలో పాల్గొన్న బన్నప్ప కుటుంబ సభ్యులతో పాటు పాత నేరస్తుల కదలికలపై పోలీసులు తీవ్రంగా ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక నిందితులు దాడి ఘటనకు ముందు, ఆ తర్వాత జరిపిన ఫోన్ సంభాషణల సమాచారాన్ని సేకరిస్తున్నట్లు తెలిసింది. ఏ-4 నిందితుడిగా ఉన్న దశరథ్ దాడి సమయంలో టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో నేత ఒకరితో ఫోన్లో సంభాషించినట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు... మరికొందరు నిందితుల ఫోన్ కాల్స్ విషయంలోనూ ఆరా తీస్తున్నట్లు తెలిసింది. -
సీతారాం.. c/o సెటిల్మెంట్
ఏసీపీపై సస్పెన్షన్ వేటు భూ వివాదాలలో భారీగా వసూళ్లు పదుల సంఖ్యలో బాధితులు సీఐగానూ ఇదే తీరుతో సస్పెండ్ డీజీపీ విచారణలో వెలుగు చూసిన నిజాలు సిటీబ్యూరో: చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలోని ఆర్కేపురం సర్వే నెంబర్ 9/1లో రెండెకరాల స్థలంపై ‘విమలానంద, వైశ్యా హౌసింగ్ కో-ఆపరేటివ్ సొసైటీ’ సభ్యులకు... రౌడీషీటర్ ఘోరెమియాకు మధ్య భూ వివాదం నెలకొంది. ఘోరెమియాతో కుమ్మక్కైన ఏసీపీ సీతారాం సొసైటీ సభ్యుల ఖాళీ ప్లాట్లను తన బంధువు పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని... సభ్యులను బెదిరించారు. ఎల్బీనగర్ పోలీసు స్టేషన్ పరిధిలో హకోర్టు న్యాయవాది కనకయ్య కుమార్తెకు 2000 గజాల స్థలం ఉంది. ఇటీవలే జీహెచ్ఎంసీ అనుమతులు తీసుకుని నిర్మాణం ప్రారంభించగా... ఘోరెమియా అడ్డం వచ్చాడు. బాధితురాలు ఏసీపీని ఆశ్రయించగా... రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకపోవడంతో ఆ స్థలంలోని ప్రహరీని కూలదోయించాడు. చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో శేఖర్‌కు 200 గజాల ఖాళీ స్థలం ఉంది. ఇటీవలే నిర్మాణం ప్రారంభించగా... లంచం ఇవ్వలేదనే కక్షతో పోలీసులను పంపించి పనులను ఆపించాడు. ఇలా ఒకటీ... రెండూ కాదు. పదుల సంఖ్యలో భూ వివాదాలలో తలదూర్చిన ఏసీపీ సీతారాంపై బాధితులు ఉన్నతాధికారులకు సుమారు 50కిపైగా ఫిర్యాదులు చేశారు. దీంతో డీజీపీ అనురాగ్ శర్మ స్పందిస్తూ మంగళవారం ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. బాధితుల్లో టెలికాం, వాటర్‌వర్క్స్, జీహెచ్ఎంసీ, హైకోర్టు ఉద్యోగులతో పాటు మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి కుమారుడు, టీఆర్ఎస్ నేత సాగర్‌రెడ్డి, శైలజలు ఉన్నారు. బాధితుల సంఖ్య సుమారు 173 వరకు ఉంటుందని అంచనా. పూర్తి వివరాల్లోకి వెళితే... 1991లో ఎస్ఐగా పొందిన పి.సీతారాం మెదక్ జిల్లాలో మొదట్లో విధులు నిర్వహించారు. ఇన్స్పెక్టర్గా పదోన్నతి వచ్చిన తరువాత సైబరాబాద్‌లో కుషాయిగూడ, ఇబ్రహీంపట్నంలలో ఎస్హెచ్ఓగా విధులు నిర్వహించారు. గత ఏడాది ఫిబ్రవరిలో డీఎస్పీగా పదోన్నతి పొంది... ఎల్బీనగర్ ఏసీపీగా విధుల్లో చేరారు. గతంలో ఈ ప్రాంతంలో ఉన్న భూ వివాదాలపై అతని కన్ను పడింది. ఇరువర్గాల వారిని పిలిపించుకుని బలవంతపు సెటిల్మెంట్లు చేసేవారు. కొన్ని కేసులలో తన బంధువు పేరుపై కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించారు. ఎవరు ఎక్కువ డబ్బు ఇస్తే అటు వైపు మొగ్గు చూసి సహకరించేవారు. పదుల సంఖ్యలో బలవంతపు సెటిల్మెంట్లకు పాల్పడి రూ.కోట్లు సంపాదించాడని బాధితుల ఆరోపణ. అతని వేధింపులు భరించలేని బాధితులు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, డీ జీపీ అనురాగ్‌శర్మకు దఫదఫాలుగా ఫిర్యాదులు చేశారు. దీంతో అతనిపై విచారణకు ఆదేశించారు. ఎల్బీ నగర్ డీసీపీ తస్వీర్ ఎక్బాల్ ఇటీవల విచారణ నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. ఈ విచారణలో సీతారాం అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు లభ్యమైనట్టు తేల్చారు. దీంతో ఉన్నతాధికారులు ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు.ప్రస్తుతం వివాదాస్పద 9/1 సర్వే నెంబర్ భూమిలో ఘోరెమియా, అతని 50 మంది అనుచరులు తిష్ట వేశారు. ఎస్ఓపీని తుంగలో తొక్కి... సైబరాబాద్‌లో పెరిగిపోతున్న భూ వివాదాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు ఏడాది క్రితం పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ కాపీలను అన్ని స్టేషన్లకు పంపించారు. ఎస్ఓపీ నిబంధనలు, విధానాన్ని పక్కన పెట్టిన ఏసీపీ సీతారాం తనదైన స్టైల్లో సెటిల్మెంట్లకు తెరలేపారు. గతంలోనూ... ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సమయంలోనే సీతారాం అక్రమాలకు తెరలేపారు. భూ వివాదాలలో జోక్యం చేసుకుని బలవంతపు సెటిల్మెంట్లకు పాల్పడ్డారు. అప్పటి పోలీసు కమిషనర్ ప్రభాకరరెడ్డికి బాధితులు ఫిర్యాదు చేయడంతో విచారణలో సీతారాం అక్రమాలు వెలుగు చూశాయి. దీంతో అత ణ్ణి సస్పెండ్ చేశారు. సస్పెన్షన్ల డివిజన్ ... ఎల్బీనగర్ ఏసీపీలుగా బాధ్యతలు నిర్వహించిన అధికారుల్లో వరుసగా నలుగురు వివిధ ఆరోపణలపై సస్పెన్షన్‌కు గురికావడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ కేసులో నిందితుల నుంచి లంచం తీసుకుంటూ హర్షవ ర్ధన్‌రెడ్డి అనే ఏసీపీ గతంలో సస్పెండయ్యారు. ఆ తరువాత వచ్చిన లక్ష్మీకాంత్ షిండేపై ఇదే రీతిలో సస్పెన్షన్ వేటు పడింది. రెండేళ్ల క్రితం ఇక్కడ ఏసీపీగా పని చేసిన వెంకట్‌రెడ్డి కేవలం ఐదు నెలలు మాత్రమే విధులు నిర్వహించారు. ఈము కోళ్ల మాంసాన్ని సీజ్ చేసిన ఘటనలో సస్పెండయ్యారు. తాజాగా సీతారాం సస్పెండ్ కావడంతో దీనిపై సస్పెన్షన్ల డివిజన్‌గా ముద్ర పడింది. అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులకు ఇక్కడ పోస్టింగ్ ఇవ్వడంతో ఇలాంటి ఉదంతాలుపునరావృతమవుతున్నాయి. ఏ నేరమూ చేయలేదు నేను ఎవరి భూమినీ కబ్జా చేయలేదు. ప్లాట్ యజమానులను బెదిరించలేదు. 9/1 సర్వే నెంబర్ భూమి సుప్రీం కోర్టులో విచారణలో ఉంది. చట్ట ప్రకారమే నడుచుకున్నా. కొంతమంది నాపై కక్ష కట్టి ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారు. తప్పుడు ఫిర్యాదులు చేశారు. ఎవరి వద్దనూ ఒక్క పైసా లంచం తీసుకోలేదు. మా బంధువు పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాననే ఆరోపణలు అవాస్తవం. - ఏసీపీ సీతారాం -
కాసులిస్తే నో కేస్!
పోలీస్ స్టేషన్‌కొస్తే మామూళ్లు ఇవ్వాల్సిందే ఏ కేసైనా సెటిల్ చేసేస్తారు చెలరేగిపోతున్న కొందరు ఎస్ఐలు, సీఐలు ప్రక్షాళనకు నడుంకట్టిన ఇన్చార్జి సీపీ నలుగురిపై వేటుతో శ్రీకారం కేసులొస్తే కాసులు రాలాల్సిందే. స్టేషన్‌కు వస్తే మామూళ్లు ఇవ్వాల్సిందే. ఎంత పెద్ద కేసైనా స్టేషన్లోనే సెటిల్ చేసేస్తారు. సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దని ఉన్నతాధికారులు ఆదేశించినా ఖాతరు చేయరు. ఆక్రమణదారులు, రౌడీ షీటర్లకు కొమ్ముకాస్తున్నారు.. ఇదీ నగర పరిధిలోని స్టేషన్లలో కొందరు ఎస్ఐలు, సీఐల తీరు. పోలీసుశాఖకు అప్రతిష్ట తెస్తున్న ఇటువంటి వారిపై చర్యలకు ఇన్చార్జి సీపీ అతుల్ సింగ్ ఉపక్రమించారు. ఇప్పటికే నలుగురిపై వేటు వేశారు. సాక్షి, విశాఖపట్నం : కొద్ది నెలల క్రితం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి, మరో వ్యక్తికి మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. కొంత కాలానికి ఇద్దరూ రాజీ పడ్డారు. తామిచ్చి న ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటామని, కేసులు కొట్టేయమని స్టేషన్ చుట్టూ తిరి గారు. కానీ అక్కడి అధికారి దానికి అంగీకరించలేదు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి నగర డీసీపీని కలిసి జరిగిందంతా చెప్పారు. ఫిర్యాదుదారులే కేసు వద్దంటుంటే కొట్టివేయడానికి ఆ స్టేషన్ అధికారికి ఉన్న ఇబ్బందిపై డీసీపీ ఆరా తీశారు. వెంటనే లోక్ అదాలత్ ద్వారా కేసు క్లోజ్ చేయమని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోమని ఆ అధికారిని ఫోన్లో మందలించారు. ఇదే కాదు..ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఇలాంటి వ్యవహారంలోనే ఏసీబీకి చిక్కారు. నగర శివార్లలోని పోలీస్ స్టేషన్లయితే కొందరు భూ కబ్జాదారులు, రౌడీ షీటర్ల కనుసన్నల్లోనే నడుస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. ఖాళీ స్థలాలు ఆక్రమించి, నకిలీ ధ్రువపత్రాలతో స్థల యజమానులను బెదించే వారికి కొమ్ముకాస్తూ బాధితుల నుంచి సొమ్ములు గుంజుతున్న ఉదంతాలు అక్కడ నిత్యకృత్యమైపోయాయి. కలిసొస్తున్న స్టేషన్ బెయిల్: సెక్షన్ సీఆర్పీసీ 41ఎ ప్రకారం నిందితుల్ని అరెస్ట్ చేయడానికి 48 గంటల ముందు వారికి నోటీసు ఇవ్వాలి. అదే విధంగా 7ఏళ్ల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ల ప్రకారం కేసు నమోదైతే నిందితులకు స్టేషన్లోనే బెయిల్ ఇవ్వవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. ప్రజల ప్రాథమిక హక్కును, వారి శ్రేయస్సును కాపాడేందుకు అత్యున్నత న్యాయస్థానం చేసిన సూచనలను తమకు అనుకూలంగా మలుచుకుని పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారు. కేసు పెడతామని నిందితుడ్ని బెదిరిస్తూ, సెటిల్ చేసుకోకపోతే బెయిల్‌పై వెళ్లిపోతారని బాధితుల్ని భయపెడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. నలుగురిపై వేటుతో శ్రీకారం: అవినీతి ఆరోపణలున్న అధికారులపై వేటు వేయాలని ఇన్చార్జి సీపీ అతుల్‌సింగ్ నిర్ణయించుకున్నారు. ఆ దిశగా తొలి అడుగు వేశారు. గత నెల 30వ తేదీన రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్ఐ రమేష్‌బాబును, ఈ నెల 25న లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామారావు, కానిస్టేబుల్ లక్ష్మణరావులతో పాటు ఈ నేరంలో భాగస్వామ్యం, విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలతో సీఐ జి.వి.రమణలను ఇన్చార్జి సీపీ సస్పెండ్ చేశారు. లంచం తీసుకుంటూ దొరికిపోయిన వారిపై వేటు సహజంగా జరిగే ప్రక్రియే అయినా ఆ దాడిలో పట్టుబడని సీఐను సస్పెండ్ చేయడంతో అవినీతిని ప్రోత్సహించేవారికి దండన తప్పదనే సంకేతాలను ఇచ్చారు. గత సంఘటనలు గతేడాది ప్రథమార్ధంలో పెందుర్తి సీఐ జి.రాజశేఖర్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దీంతో ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. నవంబర్ 27న రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్) ఇన్స్పెక్టర్ భగీరథ్ విశ్వాస్ రూ.5వేలు లంచం డిమాండ్ చేసి ఏసీబీ వలకు చిక్కారు. నవంబర్ 30న నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ ఎస్ఐ రమేష్‌బాబు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. డిసెంబర్ 25న నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ వాల్తేరు జోన్ ఎస్ఐ రామారావు, కానిస్టేబుల్ లక్ష్మణరావు రూ.లక్ష డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖకు దొరికారు. ఇదే కేసులో వీరితో పాటు సీఐ జి.వి.రమణ సస్పెండయ్యారు. డిసెంబర్ 2న మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్.రమేష్‌కుమార్ రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు. ఇక రోజూ పర్యవేక్షణ పోలీస్ స్టేషన్లలో అవినీతిపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అవినీతికి పాల్పడుతున్నవారి గురించి ఆరా తీస్తున్నాం. ఇక మీదట డీసీపీ, ఏసీసీలు రోజూ స్టేషన్లతో మీడియో, టెలీ కాన్ఫరెన్స్‌లు జరుపుతారు. స్టేషన్‌కు వచ్చే ప్రజల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. ఎవరి పనితీరు సరిగ్గా లేకపోయినా కఠిన చర్యలు తీసుకుంటాం. అవి నీతి నిరోధానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం. - అతుల్‌సింగ్, ఇన్చార్జి సీపీ -
రౌడీషీటర్ హత్య
పంతాలు, పట్టింపులు, ఆత్మరక్షణ ధోరణిలోనే నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ప్రధాన నిందితుడు నిందితులందరిపై రౌడీషీట్లు మదనపల్లెక్రైం: పంతాలు, పట్టింపులు, ఆత్మరక్షణ ధోరణిలోనే రౌడీషీటర్ చలపతిని ఆరుగురు యువకులు హత్య చేశారని మదనపల్లె డీఎస్పీ కే.రాఘవరెడ్డి తెలిపారు. ఐదుగురు నిందితులను మంగళవారం స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్ చూపారు. డీఎస్పీ కే.రాఘవరెడ్డి, సీఐ సీఎం.గంగయ్య కథనం మేరకు.. చంద్రాకాలనీకి చెందిన పూల చలపతి, నీరుగట్టువారిపల్లెకు చెందిన ధనేశ్వర్‌రెడ్డి కొంతమంది నేత కార్మికులను పోగేసుకుని గ్యాంగులుగా తిరిగేవారు. మద్యం దుకాణాల వద్ద పలుమార్లు ఘర్షణలు పడ్డారు. నీరుగట్టువారిపల్లెకు చెందిన రామిశెట్టికిషోర్(23), జంగాలపల్లెకు చెందిన సురవరపు అమర్నాథ్ అలియాస్ అమర(25), కాట్లాటపల్లెకు చెందిన గంగాధర్(19), పెద్దమండ్యం మండలం నక్కలవారికోటకు చెందిన మల్లికార్జున(24), బి.కొత్తకోట మండలం కొత్తపల్లెకు చెందిన సురేంద్రరెడ్డి అలియాస్ మెస్ సూరి(25) నీరుగట్టువారిపల్లె పరిసర ప్రాంతాల్లో రూములు అద్దెకు తీసుకుని మగ్గాలు నేసుకుంటూ ధనేశ్వర్‌రెడ్డితో తిరిగేవారు. ధనేశ్వర్‌రెడ్డికి, హతుడు పూల చలపతికి గతంలో గొడవలు ఉన్నాయి. రెండు హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న పూల చలపతి రెండుసార్లు కిషోర్, అమర, గంగాధర్, మల్లికార్జున, మెస్ సూరిలను కొట్టాడు. ధనేశ్వర్‌రెడ్డితో తిరగడం మానేసి తనతోనే తిరగాలని వార్నింగ్ ఇచ్చాడు. అయినా అందరూ ధనేశ్వర్రెడ్డితోనే ఉండడంతో వినాయకచవితి లోపు మీరందరూ ఊరు వదిలి వెళ్లిపోవాలని, లేదంటే నా చేతుల్లో అయిపోయినట్లేనని చలపతి వారిని బెదిరించాడు. దీంతో ధనేశ్వర్‌రెడ్డితో కలిసి ఐదుగురు పథకం పన్నారు. పూల చలపతిని వదిలేస్తే మనమే ఇబ్బందుల్లో పడతామని మాట్లాడుకు న్నారు. ఈ క్రమంలో ధనేశ్వర్‌రెడ్డితో గొడవపడినట్లు మెస్ సూరి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసి చలపతిని నమ్మించాడు. ధనేశ్వర్‌రెడ్డితో విడిపోయానని, ఇక నీతోనే ఉంటానని చలపతి జతచేరాడు. వారం రోజులుగా చలపతితోనే తిరుగుతూ అతని ప్రతి కదలికనూ ధనేశ్వర్‌రెడ్డికి చేరవేశాడు. ఈ క్రమంలో ఈనెల 16వ తేదీ రాత్రి చలపతి రింగ్ రోడ్డులోని మద్యం దుకాణానికి వచ్చి ఒంటరిగా వెళుతున్నాడని ధనేశ్వర్‌రెడ్డికి మెస్ సూరి ఫోన్‌చేసి చెప్పడంతో పథకం ప్రకారం అందరూ ఒక్కటయ్యారు. రెండు ద్విచక్ర వాహనాల్లో చలపతిని వెంబడించి కళ్లలో కారం కొట్టి వేటకొడవళ్లతో నరికి హతమార్చారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. సర్కారు తోపు వద్ద నిందితులు ఉండడంతో పట్టుకుని విచారించారు. తమను చంపేస్తాడేమోనన్న భయంతో తామే అతన్ని హతమార్చినట్లు ఒప్పుకున్నారు. సూత్రధారి ధనేశ్వర్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. కిషోర్, అమర, మెస్ సూరి, గంగాధర్, మల్లికార్జునను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లు, కత్తి, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసును ఛేదించిన ఎస్ఐలు శ్రీనివాస్, హనుమంతప్ప, కానిస్టేబుళ్లు రాజేష్, రాకేష్, శ్రీకాంత్‌ను డీఎస్పీ అభినందించారు. -
రౌడీషీటర్‌ను చితకబాది చంపిన మహిళలు
కరీంనగర్: మహిళలు ఆదిపరాశక్తులైపోయారు. తరచూ తమని వేధిస్తున్న ఓ రౌడీషీటర్ని చితక బాది చంపేశారు. కోనారావుపేట మండలం శివగాలపల్లి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. రౌడీ షీటర్ శంకర్‌కు తరచూ మహిళలను వేధించడం అలవాటైపోయింది. ఆ వేధింపులకు తట్టుకోలేక మహిళలందరూ ఒక్కటయ్యారు. శంకర్‌పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రౌడీషీటర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
పాతబస్తీలో రౌడీషీటర్ దారుణ హత్య
హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో ఓ రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. నూర్కా బజార్లో డబిర్‌పురా రౌడీ షీటర్ కరీం ఖాన్‌ను ప్రత్యర్థులు పాశవికంగా హతమార్చారు. పాత కక్షల వల్లే కరీంను హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కరీంఖాన్ హత్య కేసులో షాకిర్ తమ్ముళ్లు అన్వర్, ఇంతియాజ్ హస్తం ఉన్నట్లుగా మృతుని సోదరుడు ఇమ్రార్ ఖాన్ చెబుతున్నాడు. షాకిర్ గతంలో పలు నేరాల్లో నిందితుడుగా ఉన్నాడని పోలీసులు అంటున్నారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.