రౌడీషీటర్ హత్య
పంతాలు, పట్టింపులు, ఆత్మరక్షణ ధోరణిలోనే
నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
పరారీలో ప్రధాన నిందితుడు
నిందితులందరిపై రౌడీషీట్లు
మదనపల్లెక్రైం: పంతాలు, పట్టింపులు, ఆత్మరక్షణ ధోరణిలోనే రౌడీషీటర్ చలపతిని ఆరుగురు యువకులు హత్య చేశారని మదనపల్లె డీఎస్పీ కే.రాఘవరెడ్డి తెలిపారు. ఐదుగురు నిందితులను మంగళవారం స్థానిక రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్ చూపారు. డీఎస్పీ కే.రాఘవరెడ్డి, సీఐ సీఎం.గంగయ్య కథనం మేరకు.. చంద్రాకాలనీకి చెందిన పూల చలపతి, నీరుగట్టువారిపల్లెకు చెందిన ధనేశ్వర్‌రెడ్డి కొంతమంది నేత కార్మికులను పోగేసుకుని గ్యాంగులుగా తిరిగేవారు. మద్యం దుకాణాల వద్ద పలుమార్లు ఘర్షణలు పడ్డారు. నీరుగట్టువారిపల్లెకు చెందిన రామిశెట్టికిషోర్(23), జంగాలపల్లెకు చెందిన సురవరపు అమర్‌నాథ్ అలియాస్ అమర(25), కాట్లాటపల్లెకు చెందిన గంగాధర్(19), పెద్దమండ్యం మండలం నక్కలవారికోటకు చెందిన మల్లికార్జున(24), బి.కొత్తకోట మండలం కొత్తపల్లెకు చెందిన సురేంద్రరెడ్డి అలియాస్ మెస్ సూరి(25) నీరుగట్టువారిపల్లె పరిసర ప్రాంతాల్లో రూములు అద్దెకు తీసుకుని మగ్గాలు నేసుకుంటూ ధనేశ్వర్‌రెడ్డితో తిరిగేవారు. ధనేశ్వర్‌రెడ్డికి, హతుడు పూల చలపతికి గతంలో గొడవలు ఉన్నాయి. రెండు హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న పూల చలపతి రెండుసార్లు కిషోర్, అమర, గంగాధర్, మల్లికార్జున, మెస్ సూరిలను కొట్టాడు. ధనేశ్వర్‌రెడ్డితో తిరగడం మానేసి తనతోనే తిరగాలని వార్నింగ్ ఇచ్చాడు.
అయినా అందరూ ధనేశ్వర్‌రెడ్డితోనే ఉండడంతో వినాయకచవితి లోపు మీరందరూ ఊరు వదిలి వెళ్లిపోవాలని, లేదంటే నా చేతుల్లో అయిపోయినట్లేనని చలపతి వారిని బెదిరించాడు. దీంతో ధనేశ్వర్‌రెడ్డితో కలిసి ఐదుగురు పథకం పన్నారు. పూల చలపతిని వదిలేస్తే మనమే ఇబ్బందుల్లో పడతామని మాట్లాడుకు న్నారు. ఈ క్రమంలో ధనేశ్వర్‌రెడ్డితో గొడవపడినట్లు మెస్ సూరి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి చలపతిని నమ్మించాడు. ధనేశ్వర్‌రెడ్డితో విడిపోయానని, ఇక నీతోనే ఉంటానని చలపతి జతచేరాడు. వారం రోజులుగా చలపతితోనే తిరుగుతూ అతని ప్రతి కదలికనూ ధనేశ్వర్‌రెడ్డికి చేరవేశాడు. ఈ క్రమంలో ఈనెల 16వ తేదీ రాత్రి చలపతి రింగ్ రోడ్డులోని మద్యం దుకాణానికి వచ్చి ఒంటరిగా వెళుతున్నాడని ధనేశ్వర్‌రెడ్డికి మెస్ సూరి ఫోన్‌చేసి చెప్పడంతో పథకం ప్రకారం అందరూ ఒక్కటయ్యారు. రెండు ద్విచక్ర వాహనాల్లో చలపతిని వెంబడించి కళ్లలో కారం కొట్టి వేటకొడవళ్లతో నరికి హతమార్చారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెల్‌ఫోన్ నంబర్ల ఆధారంగా నిందితులను గుర్తించారు. సర్కారు తోపు వద్ద నిందితులు ఉండడంతో పట్టుకుని విచారించారు. తమను చంపేస్తాడేమోనన్న భయంతో తామే అతన్ని హతమార్చినట్లు ఒప్పుకున్నారు.
సూత్రధారి ధనేశ్వర్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. కిషోర్, అమర, మెస్ సూరి, గంగాధర్, మల్లికార్జునను పోలీసులు అరెస్ట్ చేసి, రిమాండుకు తరలించారు. వారి నుంచి హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లు, కత్తి, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసును ఛేదించిన ఎస్‌ఐలు శ్రీనివాస్, హనుమంతప్ప, కానిస్టేబుళ్లు రాజేష్, రాకేష్, శ్రీకాంత్‌ను డీఎస్పీ అభినందించారు.