మాచర్ల: గుంటూరు జిల్లా మాచర్లలో సోమవారం ఓ రౌడీషీటర్‌ను దుండగులు వెంటాడి నడిరోడ్డుపైనే నరికి చంపారు. రెండు హత్య కేసుల్లో జైలు శిక్ష అనుభవించిన అతను పట్టణంలో ఉన్న భార్య వద్దకు వచ్చి ప్రత్యర్థుల చేతిలో బలయ్యాడు. విషయం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు మూడు గంటల్లోనే నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు హత్యలో పాల్గొన్నట్లు ప్రాథమిక విచారణలో కనుగొన్నారు. గుంటూరు జిల్లా చెరుకుపల్లికి చెందిన రౌడీషీటర్ శెట్టిపల్లి ప్రేమ్‌కుమార్(30) గతంలో రేపల్లె, చెరుకుపల్లి గ్రామాల్లో రెండు హత్య కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తూ అప్పీలుకు వెళ్లి తిరిగివచ్చాడు.
ఆ రెండు సంఘటనల్లో హత్యకు గురైన రేపల్లెకు చెందిన శివ, చెరుకుపల్లికి చెందిన నాగేశ్వరరావు బంధువులు ప్రేమ్‌కుమార్‌పై కక్ష పెట్టుకుని అదును కోసం వేచివున్నారని సమాచారం. ప్రేమ్‌కుమార్ భార్య జ్యోత్స్న మాచర్ల ప్రాంతంలో నివాసముంటూ వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. ప్రేమ్‌కుమార్ సోమవారం మాచర్లలో ఉన్న తన భార్య వద్దకు వచ్చి బుల్లెట్‌పై తిరిగి వెళుతుండగా మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో నలుగురు వ్యక్తులు కారులో ప్రేమ్‌కుమార్‌ను వెంబడించారు. పట్టణంలోని ఎస్‌వీఆర్ బార్ సమీపంలో దాడికి దిగారు. పసిగట్టిన ప్రేమ్‌కుమార్ బుల్లెట్‌ను వదిలివేసి పారిపోతుండగా దుండగులు వెంటపడి తల వెనుక భాగంలో గొడ్డలితో నరికారు. దీంతో ప్రేమ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు.
విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ సాంబశివరావు ఘటనాస్థలానికి వచ్చి వివరాలు సేకరించారు. సంఘటన జరిగిన వెంటనే అన్ని కోణాల్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. తెల్ల అంబాసిడర్ కారులో వచ్చిన నిందితులు హత్య అనంతరం దాంట్లోనే పారిపోయారు. సమాచారం అందుకున్న రెంటచింతల ఎస్‌ఐ కోటేశ్వరరావు వాహనాలు తనిఖీ చేస్తుండటాన్ని గమనించిన నిందితులు కారును వెనక్కు తిప్పారు. ఎస్‌ఐ కారును వెంబడించారు. నిందితులు గోలి గ్రామంలో కారును వదిలేసి పరారయ్యారు. ఎస్‌ఐ వెంటాడి గోలి సమీపంలోని క్వారీలో జూలకంటి సుధాకర్ అనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన ఇద్దరు పరారయ్యారు. మరో నలుగురు అంతకు ముందే సత్రశాలలో దిగి నల్గొండ జిల్లాలోకి వెళ్లిపోయారని పోలీసులు వెల్లడించారు. పోలీసుల అదుపులో ఉన్న సుధాకర్‌ను విచారించగా తన అన్న సురేష్ సూచనలతో ఏడుగురం ఈ హత్య చేసినట్లు వెల్లడించాడు.
నడిరోడ్డుపై రౌడీషీటర్ హత్య
Published Tue, Oct 2 2018 5:24 AM | Last Updated on Fri, Apr 14 2023 5:45 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment