సాక్షి, కదిరి: గత నెల 29న హత్యకు గురైన భార్గవ్ నాయుడు హత్యకేసును కదిరి పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. తల్లిదండ్రులు లక్ష్మిదేవి, భాస్కర్‌నాయుడులే వారి కొడుకును హత్య చేశారని తేల్చారు. వారిని ఆదివారం కుటాగుళ్ల వద్ద పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టి, అనంతరం కోర్టుకు హాజరు పరిచారు. హత్యకు సంబంధించిన వివరాలను కదిరి డీఎస్పీ శ్రీలక్ష్మి పట్టణ ఇన్‌స్పెక్టర్ కార్యాలయంలో విలేకరులకు వివరించారు.
జల్సాలకు అలవాటు పడి..
‘మృతుడు భార్గవ్ గత కొంత కాలంగా తాగుడు, క్రికెట్ బెట్టింగ్, జూదం వంటి చెడు వ్యసనాలతో పాటు జల్సాలకు అలవాటు పడ్డాడు. ఇందుకోసం సుమారు రూ. 15 లక్షలకు పైగా అప్పులు చేశాడు. అప్పులను తిరిగి చెల్లించలేని పరిస్థితుల్లో తాత పేరు మీద ఉన్న 20 సెంట్ల భూమిని తల్లిదండ్రులకు తెలియకుండా అమ్మేశాడు. ఈ విషయం తెలుసుకున్న భార్గవ్ తల్లిదండ్రులు ఆ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలపై తాము సంతకాలు చేసేది లేదని తేల్చి చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన భార్గవ్ సంతకం చేయకపోతే మీ ఇద్దరినీ చంపడం ఖాయమని బెదిరించి బయటకు వెళ్లిపోయాడు.
చంపేస్తే పోలా..
కొడుకు అన్నంతపని చేస్తాడని భయపడి ఆ తల్లిదండ్రులు ఒక నిర్ణయానికి వచ్చారు. మనం వాడి చేతిలో చచ్చేకన్నా.. వాడినే చంపేస్తా పోలా.. అని నిర్ణయించుకున్నారు. భార్గవ్ గత నెల 29న అర్దరాత్రి సమయంలో బాగా మద్యం సేవించి ఇంటికి తిరిగి వచ్చాడు. తాగిన మైకంలో తల్లిదండ్రులతో మళ్లీ గొడవ పడటంతోపాటు వారిని బాగా కొట్టాడు. తదనంతరం పడక గదిలోకి వెళ్లి నిద్రలోకి జారుకున్నాడు.
నిద్రపోయాడని నిర్దారించుకుని ఆ సమయంలో తల్లి కొడుకు కాళ్లు గట్టిగా పట్టుకోగా తండ్రి గొంతును తాడుతో గట్టిగా బిగించి చంపేశాడు. ఆ తర్వాత శవాన్ని దగ్గరలో ఉన్న వాటర్ ప్లాంట్ దగ్గరకు తీసుకెళ్లి పడేశారు’ అని డీఎస్పీ తెలిపారు. ఈ కేసును సీఐ శ్రీధర్‌తో పాటు పట్టణ ఎస్‌ఐ హేమంత్‌కుమార్‌లు విచారించినట్లు డీఎస్పీ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment