గేదెలరాజు హత్య కేసే కాదు.. విచారణా కలకలం రేపుతోంది.. ఆ కేసులో డీఎస్పీ రవిబాబు అరెస్టు.. అతన్ని ఏ1గా చూపించడం తదితర పరిణామాలు ఈ కేసు మిస్టరీ వీడిపోయిందని పోలీసులతో అంతా భావించారు.ఇక ఏ2గా ఉన్న భూపతిరాజు దొరికితే కేసు పూర్తిగా క్లియర్ అయిపోయినట్లేనన్న అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ.. ఊహించని ట్విస్ట్ దర్యాప్తు అధికారులకు సవాల్ విసరుతోంది.భూపతిరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారని మంగళవారం సాయంత్రం మీడియాకు ఉప్పందింది...అంతలోనే విచారణలో ఆయన పోలీసులకు ఎదురుతిరిగాడని తెలుస్తోంది.. గేదెలరాజు హత్యోదంతంతో డీఎస్పీకి సంబంధం ఉందనేలా ఆయనతో చెప్పించాక.. అరెస్టు చూపించాలన్న పోలీసులు ప్రణాళికను భూపతి విచ్ఛిన్నం చేశాడని సమాచారం. ఇప్పటికే ఏ1 డీఎస్పీ రవిబాబు విచారణ జరుగుతున్న తరుణంలో భూపతి వైఖరి రవిబాబుకు అనుకూలంగా ఉండటంతో విచారణాధికారులు అవాక్కయ్యారు..కేసు తేలిపోతుందనుకుంటున్న తరుణంలో చోటుచేసుకున్న ఈ పరిణామంతో ‘డామిట్.. భూపతి అడ్డం తిరిగాడు’.. కేసు మళ్లీ మొదటికొస్తోందని నిట్టూరుస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రౌడీషీటర్ గేదెలరాజు హత్య కేసు విచారణ ఊహించని మలుపులు తిరుగుతోంది. కేసులో ప్రధాన నిందితుడు.. ఏ1 డీఎస్పీ దాసరి రవిబాబు విచారణ సవ్యంగా సాగుతోందనుకుంటున్న దశలో ఏ2, క్షత్రియభేరి పత్రిక యజమాని భూపతిరాజు పోలీసులకు ఊహించని షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఆ హత్య కేసులో భూపతిరాజును ఇప్పటికీ అరెస్టు చూపించలేదు. అయితే రెండు వారాల కిందటి నుంచే అతను పోలీసుల అదుపులో ఉన్నాడనే ప్రచారం విస్తృతంగా సాగింది. టాస్క్ ఫోర్స్ పోలీసుల అదుపులో కొన్నాళ్లు.. ఆ తర్వాత న్యూపోర్టు.. అటు తర్వాత హార్బర్ పోలీస్‌స్టేషన్లలో తమదైన శైలిలో భూపతిని విచారిస్తున్నారన్న వాదనలు కొనసాగాయి.
ఈ వాదనలకు బలం చేకూర్చే విధంగానే భూపతి భార్య, కుటుంబసభ్యులు.. అతని ఆచూకీ విషయంలో ఏమాత్రం ఆందోళన చెందిన దాఖలాలే కనిపించలేదు. ఆ వాదనలకు బలం చేకూర్చే విధంగా పోలీసులు మంగళవారం వ్యూహాత్మకంగా ఓ ప్రచారాన్ని తెరపైకి తీసుకొచ్చారు. భూపతిని మంగళవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో దువ్వాడ బ్రిడ్జి సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు మీడియాకు ఉప్పందించారు. రవిబాబును జుడీషియల్ కస్టడీ నుంచి నాలుగురోజుల పాటు పోలీస్ కస్టడీకి తీసుకున్న నేపథ్యంలో మంగళవారం నాటికి రెండురోజులు పూర్తిఅయ్యింది. ఈ నేపథ్యంలో కేసును ఓ కొలిక్కి తీసుకురావాలని భావించిన పోలీసులు అందులో భాగంగానే భూపతిని తెరపైకి తెస్తున్నట్టు తెలుస్తోంది. నేడో రేపో అధికారికంగా అరెస్టు చూపించే అవకాశాలు ఉన్నాయి.
న్యూపోర్ట్ స్టేషన్‌లో ఆ ఇద్దరి విచారణ?
ఏ1 రవిబాబు, ఏ2 భూపతిరాజులను న్యూపోర్ట్ పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. రవిబాబు వివిధ హోదాల్లో నగరంలోనే పోలీసు అధికారిగా పనిచేసిన పరిస్థితుల్లో అతనికి పరిచయం లేని పోలీసులతోనే విచారణ పర్వం కొనసాగిస్తున్నట్టు సమాచారం. కాగా, విచారణలో భూపతిరాజు పోలీసు అధికారుల వాదనలకు పూర్తిగా విరుద్ధమైన సమాధానాలు ఇస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. డీఎస్పీ రవిబాబు విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని వాదనలు వినవస్తున్న నేపథ్యంలో భూపతిరాజు ఆ హత్య కేసులో డీఎస్పీ ప్రమేయం లేదని చెప్పినట్టు తెలుస్తోంది. గేదెలరాజును హత్య చేసిన తర్వాత భూపతిరాజు.. డీఎస్పీ రవిబాబుకు ఫోన్ చేసి.. మీ ప్రత్యర్థిని చంపేశాం.. అని మాట్లాడినట్టు పోలీసుల వద్దా పక్కా సమాచారం ఉందని అంటున్నారు. ఈ ఫోన్ కాల్ ఆధారంగానే పోలీసులు డీఎస్పీ పాత్రను నిర్థారించి.. ఆ మేరకు దర్యాప్తు చేపట్టారు.
అయితే తాజాగా భూపతిరాజు ‘తాను ఫోన్ చేసిన మాట వాస్తవమేనని,.. కానీ ఆ హత్య డీల్‌తో డీఎస్పీకి సంబంధం లేదని’ చెప్పినట్టు తెలుస్తోంది. మరి అదే నిజమైతే.. ‘మీ ఇద్దరి మధ్య ఆర్ధిక లావాదేవీలు ఎందుకు నడిచాయి.. రవిబాబు కుమారుడి పేరిట పది లక్షల మేర బ్యాంక్ చెక్‌లు నీకెందుకు ఇచ్చారు’ అని పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించగా.. ఈ హత్య కేసుతో ఆ డబ్బుకు ఎటువంటి సంబంధం లేదని, రియల్ ఎస్టేట్ సంబంధాల నేపథ్యంలోనే తమ మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్టు భూపతి చెప్పినట్టు తెలుస్తోంది. గేదెలరాజు తనతో పైకి సన్నిహితంగా ఉంటూనే భూ లావాదేవీల్లో తనకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నేపథ్యంలోనే అతన్ని అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నామని భూపతి చెప్పుకొస్తున్నట్టు సమాచారం. భూపతి ఇలా అడ్డం తిరగడంతో విచారణ ఎలా ముగించాలన్నది పోలీసులకు ఇప్పుడు సవాల్‌గా మారిందని అంటున్నారు.
పద్మలత మృతి కేసు దర్యాప్తు వేగవంతం
ఇప్పటికే పోలీసులకు లొంగిపోయిన ఓ రియల్టర్, భూపతిరాజు కారు డ్రైవర్ కేశవ్‌ను హార్పర్ పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, మాజీ ఎంపీపీ కాకర పద్మలత అనుమానాస్పద మృతి కేసు విచారణను కూడా గాజువాక పోలీసులు వేగవంతం చేశారు. రవిబాబు ప్రోద్బలంతోనే పద్మలతను గేదెల రాజు విషప్రయోగంతో మట్టుబెట్టాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ మేరకు ఆమె చనిపోయే ముందు చికిత్స చేసిన గాజువాకకు చెందిన ఓ వైద్యుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment