ఆధిపత్యం కోసమే జంట హత్యలు | Two Persons Murdered in Allagadda mandal | Sakshi
Sakshi News home page

ఆధిపత్యం కోసమే జంట హత్యలు

Published Thu, May 25 2017 1:28 PM | Last Updated on Sat, Aug 25 2018 5:33 PM

ఆధిపత్యం కోసమే జంట హత్యలు - Sakshi

ఆధిపత్యం కోసమే జంట హత్యలు

► గోవిందపల్లె కేసులో నిందితుల అరెస్టు
►వివరాలు వెల్లడించిన ఆళ్లగడ్డ డీఎస్పీ


ఆళ్లగడ్డ : ఆధిపత్యం కోసమే గోవిందపల్లె గ్రామంలో ఇందూరు ప్రభాకర్‌రెడ్డి, అతని బావమర్ది మేరువ శ్రీనివాసరెడ్డిలను హత్య చేశారని ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వర్‌రెడ్డి తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్లారు.  రాజకీయ ఎదుగులను చూసి ఓర్వలేక ప్రత్యర్ధులు హత్య చేసినట్లు ఆయన తెలిపారు.


ఎదుగుదల చూసి ఓర్వలేక
ఇందూరు ప్రభాకర్‌రెడ్డి గతంలో శిరివెళ్ల మండలాధ్యక్షుడిగా పనిచేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ ఏ చిన్న పనిపడినా ఇతని దగ్గరకు వచ్చేవారు. స్వతహాగా అందరినీ కలుపుకుని పోయే మనస్థత్వం గల ప్రభాకర్‌రెడ్డి.. తనదగ్గరకు వచ్చేవారందరికీ  పార్టీ, వర్గం తేడా లేకుండా  పనులు చేసేవారు. దీంతో గ్రామంలోని ప్రత్యర్థి వర్గాలకు కళ్లుకుట్టేవి. గ్రామం నుంచి మండలం, మండలం నుంచి నియోజవర్గస్థాయి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటుండటంతో ప్రత్యర్థులు జీర్ణించుకోలేక పోయారు. ఇతన్ని మట్టుబెట్టిబెడితే గ్రామంలో తమదే ఆధిపత్యం అవుతుందని భావించారు. ఇందుకు రెండు వర్గాలకు చెందిన ప్రత్యర్థులు ఏకమై అదును కోసం ఎదరు చూస్తూ రెక్కీ నిర్వహిస్తూ ఉండేవారు.

కుటుంబ కలహాలు తోడు
ఇటీవల టీడీపీ నుంచి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డితో పాటు ఇందూరు ప్రభాకర్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీలో చేశారు. ప్రభాకర్‌రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న ఆయన సమీప బంధువు శ్రీధర్‌రెడ్డికి, ప్రభాకర్‌రెడ్డికి కుటుంబ కలహాలు ఉండేవి. ఈ క్రమంలో  శ్రీధర్‌రెడ్డిని మంచి చేసుకుని ప్రత్యర్థులు రెచ్చగొట్టారు. గోవిందపల్లె గ్రామానికి చెందిన బొబ్బ గోపాల్‌రెడ్డి, ఇందూరి శ్రీధర్‌రెడ్డి, గంగ దాసరి రవిచంద్రారెడ్డి, బొబ్బ జ్యోతి కృష్ణ కాంతరెడ్డి, సంగిరెడ్డి నాగేశ్వరరెడ్డిలతోపాటు మరి కొందరు గ్రామస్తులు..సంతజూటూరు గ్రామానికి చెందిన పాలకేటి శ్రీనివాసులు ఉరఫ్‌ చాకలి శ్రీను దగ్గరకు వెళ్లి ప్రభాకర్‌రెడ్డిని చంపాలని రూ. 40 లక్షలకు కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నారు.

హత్యచేశారు ఇలా
ఈ నెల ఆరో తేదీ సాయంత్రం ప్రభాకర్‌రెడ్డి, బావమరిది శ్రీనివాసరెడ్డి, తమ్ముడు ప్రతాపరెడ్డితో కలిసి సాయంత్రం వాకింగ్‌కు వెళ్తున్నట్లు గమనించిన ప్రత్యర్థులు గ్రామ శివారులోని పంట పొలాల్లో దాక్కుని ఉన్నారు. ప్రభాకర్‌రెడ్డి సమీపంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా వేటకొడవళ్లు, పిడిబాకులతో దాడి చేశారు. ప్రతాపరెడ్డి భయంతో పరుగులు తీయగా ప్రభాకర్‌రెడ్డిపై దాడిని శ్రీనివాసరెడ్డి అడ్డుకోబోయారు. ప్రత్యర్థులు.. ప్రభాకర్‌రెడ్డితో పాటు శ్రీనివాసరెడ్డిని దారుణంగా హత్య చేశారు. ప్రత్యక్ష సాక్షి ప్రతాపరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి ఆరుగురు నిందితులుగా గుర్తించి అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. విలేకరుల సమావేశంలో సీఐలు ప్రభాకర్‌రెడ్డి, దస్తగిరిబాబు తదితరులు పాల్గొన్నారు.

 వీడిన హత్యకేసు మిస్టరీ
శిరివెళ్ల: గోవిందపల్లె జంట హత్యల కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. ఆధిపత్యం కోసమే హత్య చేసినట్లు పోలీస్‌ విచారణలో వెల్లడయింది. గ్రామానికి చెందిన ఐదుగురు నిందితులు.. ఓ కిరాయి హంతకున్ని బుధవారం పోలీసులు అరెస్ట్‌ చేశారు. జంట హత్యల కేసును పక్కదోవ పట్టించేందుకు  హతుని జేబులో నక్సలైట్ల పేరిట లేఖ ఉంచారు.

హత్యలకు సంబంధించి సాక్ష్యాలు దొరకకుండా చేయటానికే వారు ఇలా చేసినట్లు తేలింది. ఇదిలా ఉండగా శిరివెళ్ల మండలంలో గతంలో బోయలకుంట్ల గ్రామంలో మూడు హత్యలు జరిగాయి. ఇప్పటికీ ఓ వర్గం వారు గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేదు. పోలీసుల రికార్డులలో అత్యంత సున్నితమయిన గ్రామంగా ఈ ఊరి పేరు ఎక్కింది. తాజాగా గోవిందపల్లె కూడా అదే కోవలోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement