కాసులిస్తే నో కేస్! | Kasuliste No Case! | Sakshi
Sakshi News home page

కాసులిస్తే నో కేస్!

Published Mon, Dec 29 2014 7:22 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

Kasuliste No Case!

  • పోలీస్ స్టేషన్‌కొస్తే మామూళ్లు ఇవ్వాల్సిందే
  •  ఏ కేసైనా సెటిల్ చేసేస్తారు
  •  చెలరేగిపోతున్న కొందరు ఎస్‌ఐలు, సీఐలు
  •  ప్రక్షాళనకు నడుంకట్టిన ఇన్‌చార్జి సీపీ
  •  నలుగురిపై వేటుతో శ్రీకారం
  • కేసులొస్తే కాసులు రాలాల్సిందే. స్టేషన్‌కు వస్తే మామూళ్లు ఇవ్వాల్సిందే. ఎంత పెద్ద కేసైనా స్టేషన్‌లోనే సెటిల్ చేసేస్తారు. సివిల్ తగాదాల్లో తలదూర్చొద్దని ఉన్నతాధికారులు ఆదేశించినా ఖాతరు చేయరు. ఆక్రమణదారులు, రౌడీ షీటర్లకు కొమ్ముకాస్తున్నారు.. ఇదీ నగర పరిధిలోని స్టేషన్లలో కొందరు ఎస్‌ఐలు, సీఐల తీరు. పోలీసుశాఖకు అప్రతిష్ట తెస్తున్న ఇటువంటి వారిపై చర్యలకు ఇన్‌చార్జి సీపీ అతుల్ సింగ్ ఉపక్రమించారు. ఇప్పటికే నలుగురిపై వేటు వేశారు.  
     
    సాక్షి, విశాఖపట్నం : కొద్ది నెలల క్రితం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారికి, మరో వ్యక్తికి మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. దీంతో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. కొంత కాలానికి ఇద్దరూ రాజీ పడ్డారు. తామిచ్చి న ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటామని, కేసులు కొట్టేయమని స్టేషన్ చుట్టూ తిరి గారు. కానీ అక్కడి అధికారి దానికి అంగీకరించలేదు. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారి నగర డీసీపీని కలిసి జరిగిందంతా చెప్పారు. ఫిర్యాదుదారులే కేసు వద్దంటుంటే కొట్టివేయడానికి ఆ స్టేషన్ అధికారికి ఉన్న ఇబ్బందిపై డీసీపీ ఆరా తీశారు.

    వెంటనే లోక్ అదాలత్ ద్వారా కేసు క్లోజ్ చేయమని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోమని ఆ అధికారిని ఫోన్లో మందలించారు. ఇదే కాదు..ఇటువంటి సంఘటనలు కోకొల్లలు. నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఇలాంటి వ్యవహారంలోనే ఏసీబీకి చిక్కారు. నగర శివార్లలోని పోలీస్ స్టేషన్లయితే కొందరు భూ కబ్జాదారులు, రౌడీ షీటర్ల కనుసన్నల్లోనే నడుస్తున్నాయని బాధితులు చెబుతున్నారు. ఖాళీ స్థలాలు ఆక్రమించి, నకిలీ ధ్రువపత్రాలతో స్థల యజమానులను బెదించే వారికి కొమ్ముకాస్తూ బాధితుల నుంచి సొమ్ములు గుంజుతున్న ఉదంతాలు అక్కడ నిత్యకృత్యమైపోయాయి.
     
    కలిసొస్తున్న స్టేషన్ బెయిల్: సెక్షన్ సీఆర్‌పీసీ 41ఎ ప్రకారం నిందితుల్ని అరెస్ట్ చేయడానికి 48 గంటల ముందు వారికి నోటీసు ఇవ్వాలి. అదే విధంగా 7ఏళ్ల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ల ప్రకారం కేసు నమోదైతే నిందితులకు స్టేషన్‌లోనే బెయిల్ ఇవ్వవచ్చని సుప్రీం కోర్టు చెప్పింది. ప్రజల ప్రాథమిక హక్కును, వారి శ్రేయస్సును కాపాడేందుకు అత్యున్నత న్యాయస్థానం చేసిన సూచనలను తమకు అనుకూలంగా మలుచుకుని పోలీసులు అవినీతికి పాల్పడుతున్నారు. కేసు పెడతామని నిందితుడ్ని బెదిరిస్తూ, సెటిల్ చేసుకోకపోతే బెయిల్‌పై వెళ్లిపోతారని బాధితుల్ని భయపెడుతూ సొమ్ము చేసుకుంటున్నారు.    
     
    నలుగురిపై వేటుతో శ్రీకారం: అవినీతి ఆరోపణలున్న అధికారులపై వేటు వేయాలని ఇన్‌చార్జి సీపీ అతుల్‌సింగ్ నిర్ణయించుకున్నారు. ఆ దిశగా తొలి అడుగు వేశారు. గత నెల 30వ తేదీన రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ ఎస్‌ఐ రమేష్‌బాబును, ఈ నెల 25న లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ రామారావు, కానిస్టేబుల్ లక్ష్మణరావులతో పాటు ఈ నేరంలో భాగస్వామ్యం, విధుల్లో నిర్లక్ష్యం వహించారనే కారణాలతో సీఐ జి.వి.రమణలను ఇన్‌చార్జి సీపీ సస్పెండ్ చేశారు. లంచం తీసుకుంటూ దొరికిపోయిన వారిపై వేటు సహజంగా జరిగే ప్రక్రియే అయినా ఆ దాడిలో పట్టుబడని సీఐను సస్పెండ్ చేయడంతో అవినీతిని ప్రోత్సహించేవారికి దండన తప్పదనే సంకేతాలను ఇచ్చారు.
     
    గత సంఘటనలు
    గతేడాది ప్రథమార్ధంలో పెందుర్తి సీఐ జి.రాజశేఖర్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడగట్టారనే ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. దీంతో ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు.
         
    నవంబర్ 27న రైల్వే రక్షక దళం(ఆర్‌పీఎఫ్) ఇన్‌స్పెక్టర్ భగీరథ్ విశ్వాస్ రూ.5వేలు లంచం డిమాండ్ చేసి ఏసీబీ వలకు చిక్కారు.
         
    నవంబర్ 30న నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ లా అండ్ ఆర్డర్ ఎస్‌ఐ రమేష్‌బాబు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
         
    డిసెంబర్ 25న నాల్గో పట్టణ పోలీస్ స్టేషన్ వాల్తేరు జోన్ ఎస్‌ఐ రామారావు, కానిస్టేబుల్ లక్ష్మణరావు రూ.లక్ష డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖకు దొరికారు. ఇదే కేసులో వీరితో పాటు సీఐ జి.వి.రమణ సస్పెండయ్యారు.
         
    డిసెంబర్ 2న మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎన్.రమేష్‌కుమార్ రూ.5వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికారు.
     
    ఇక రోజూ పర్యవేక్షణ

    పోలీస్ స్టేషన్లలో అవినీతిపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ అవినీతికి పాల్పడుతున్నవారి గురించి ఆరా తీస్తున్నాం. ఇక మీదట డీసీపీ, ఏసీసీలు రోజూ స్టేషన్లతో మీడియో, టెలీ కాన్ఫరెన్స్‌లు జరుపుతారు. స్టేషన్‌కు వచ్చే ప్రజల నుంచి కూడా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటాం. ఎవరి పనితీరు సరిగ్గా లేకపోయినా కఠిన చర్యలు తీసుకుంటాం. అవి నీతి నిరోధానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నాం.      
    - అతుల్‌సింగ్, ఇన్‌చార్జి సీపీ
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement