కదం తొక్కిన విద్యార్థులు
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో పలు ప్రవేటు పాఠశాలలతోపాటు కళాశాలలు విద్యార్థుల నుంచి చేస్తున్న అధిక ఫీజుల వసూళ్లకు నిరసనగా శుక్రవారం కడపలో వైఎస్‌ఆర్ స్టూడెంట్ యూనియన్ పెద్ద పెత్తున అందోళన చేసింది. వైఎస్‌ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధక్షుడు ఖాజా రహ్మతుల్లా అధ్వర్యంలో 2 వేల మంది విద్యార్థులతో కడప నగరంలో పలు ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించటంతోపాటు కోటిరెడ్డి కూడలిలో మానవహారాన్ని ఏర్పాటు నిరసనను వ్యక్తం చేశారు.
ఈ సంద ర్భంగా విద్యాశాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహ్మతుల్లా మాట్లాడుతూ జిల్లాలో పలు ప్రవేటు పాఠశాలలతోపాటు కళాశాలలు విద్యార్థుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారన్నారు. సంబంధిత విషయాన్ని పలుమార్లు డీఈఓ, ఆర్‌జేడీల దృష్టికి తీసికెళ్లినా స్పందన కరువైయిందన్నారు. డీఈఓ ప్రతాప్‌రెడ్డి ఇటీవల జరిగిన పదవ తరగతి పరీక్షల్లో పలు ప్రవేటు విద్యాసంస్థల నుంచి ముడుపులు తీసుకున్నారని ఆరోపించారు. గతేడాది పదికి పది మార్కులు వచ్చిన విద్యార్థులు జిల్లాలో 70 మంది ఉంటే ఈ ఏడాది ఒక్క రాయచోటిలోనే పదికి పది 70 మందికి వచ్చాయన్నారు. అది ఎలా సాధ్యమైయిందో ఆయనే సమాధానం చెప్పాలన్నారు.
డీఈఓను సస్పెండ్ చేయాలి:
కడపలోని ఓ ప్రైవేటు పాఠశాలకు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు జరుగుతున్నా యాజమాన్యంతో ముడుపులు తీసుకుని దానికి అనుమతి ఇచ్చారన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం నుంచి లక్షల్లో ముడుపులు తీసుకుని పాఠశాలలకు అనుమతులు లేకున్నా పట్టించుకోవటం లేదన్నారు. డీఈఓకు, ఆర్‌ఐఓకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కోటిరెడ్డి సర్కిల్ చూట్టూ ప్రదర్శనలు చేశారు. డీఈఓను సస్పెండ్ చేయాలని గట్టిగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమానికి వైఎస్‌ఆర్ స్టూడెంట్ జిల్లా యూత్ ప్రసిడెంట్ చల్లా రాజశేఖర్, వైఎస్‌ఆర్ యూత్ రాష్ట్ర జనరల్‌సెక్రెటరీ హరీస్‌కుమార్‌యాదవ్‌లు మద్దతును ప్రకటించి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా అధికారులు స్పందించి అధిక వసూళ్ల చేసే పాఠశాలలు, కళాశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లా కార్యదర్శి జశ్వంత్‌రెడ్డితోపాటు నాయకులు మహమ్మద్ అలీ, నిత్య పూజయ్య, యాసిన్, విజయ్, కరీముల్లా, పెంచలయ్య, నాగార్జునరెడ్డి, సునిల్‌రెడ్డి, బాష, శ్రీనివాస్‌తోపాటు పలు కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.