సాక్షి, నెల్లూరు : చిన్న రాష్ట్రాలు అభివృద్ధి నిరోధకాలని, ఇందుకు కొత్తగా ఏర్పాటైన చిన్న రాష్ట్రాలే నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ అన్నారు. సమైక్యాంధ్ర కోరుతూ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సద్భావన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మేరిగ మురళీధర్ మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి సాధించి అందమైన రాష్ట్రంగా మారిందన్నారు. పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని ఓట్లు, సీట్లు ప్రాతిపదికన కాంగ్రెస్ అధిష్టానం రెండుగా ముక్కలు చేసి సీమాంధ్రుల ఉసురు పోసుకుందని ధ్వజమెత్తారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ రాజకీయాలకతీతంగా సీమాంధ్రులు రోడ్లుపైకి వచ్చి పోరాడటం హర్షణీయమన్నారు. ప్రజలు ఉద్యమిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. వైఎస్సార్ బతికుంటే ఇలా జరిగేదికాదన్నారు.
హైదరాబాద్ అందరి సొత్తు: కాకాణి
రాష్ట్ర ప్రజలందరూ 50 ఏళ్లపాటు అభివృద్ధి చేస్తేనే హైదరాబాద్ దేశంలోనే పేరొందిన నగరంగా మారిందని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలన్నీ అక్కడే ఉన్నాయన్నారు. రాష్ట్ర ఆదాయంలో 55 శాతానికిపైగా హైదరాబాద్ నుంచే సమకూరుతుందని కాకాణి చెప్పారు. ఒక్కసారిగా రాష్ట్రాన్ని ముక్కలు చేసి హైదరాబాద్ మీది కాదు వెళ్లిపొమ్మంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. కొడుకు రాహుల్‌ను ప్రధానిని చేసుకునేందుకే సోని యా కుట్రపన్ని రాష్ట్ర విభజనకు పూనుకుందని కాకాణి విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ రాష్ట్ర విభజనపై స్పష్టమైన వైఖరిని చెప్పి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ ఒక్కటే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే విజయమ్మ, జగన్ దీక్షలు చేపట్టారన్నారు.
రాజీనామాలు చేయాలి: కోటంరెడ్డి
కాంగ్రెస్, టీడీపీ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేసి సీమాంధ్ర ఉద్యమంలోకి రావాలని నెల్లూరు రూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధరెడ్డి పిలుపునిచ్చారు. అధిష్టానాన్ని నిలదీయలేని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాజీనామాల డ్రామాలు ఆడుతున్నారన్నారు. వారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఢిల్లీకి వెళ్లి ఉద్యమించాలన్నారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం టీడీపీనే అన్నా రు. బాబు లేఖతోనే రాష్ట్రం ముక్కలవుతోందని మండిపడ్డారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని చూసి న్యాయం చేయాలంటూ బాబు చిలుకపలుకులు పలుకుతున్నారని కోటంరెడ్డి విమర్శించారు.
కుట్రతోనే విభజన: అనిల్‌కుమార్
కాంగ్రెస్, టీడీపీల కుట్రలు, కుయుక్తులతోనే రాష్ట్ర విభజన జరిగిందని నెల్లూ రు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త అనిల్‌కుమార్‌యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి క్షీణించిందని సోనియా తెలుసుకొని రాష్ట్రాన్ని ముక్క లు చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌తో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్న బాబు తెలంగాణ విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడంతోనే రాష్ట్రం ముక్కలైందన్నారు. ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అనిల్ స్పష్టం చేశారు.
ఆగే వరకు ఉద్యమం: ఓబుళపతి
రాష్ట్ర విభజన ప్రకటన ఉపసంహరించుకునే వరకు సమైక్య ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ ఓబుళపతి చెప్పారు. విభజన వల్ల సీమాంధ్ర పూర్తిగా నష్టపోతుందన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగు, తాగనీటి కష్టాలు తప్పవన్నారు. రాయలసీమతో పాటు దిగువన ఉన్న నెల్లూరు జిల్లాకు కృష్ణానది నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ మహిళా జిల్లా కన్వీనర్ బండ్లమూడి అనిత, ఉపాధ్యాయనేతలు అశోక్‌కుమార్‌రెడ్డి, నరేంద్రకుమార్, ఉదయ్‌కుమార్, ఎన్.రఘురామిరెడ్డి, కేవీ నారాయణరాజు, డేవిడ్, వాసు, యానాదిరెడ్డి, సుబ్రమణ్యం, చినఅంజయ్య, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, రూప్‌కుమార్‌యాదవ్, జనార్దన్‌రెడ్డి, మందాబాబ్జీ, నరసింహయ్యముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
చిన్న రాష్ట్రాలు అభివృద్ధి నిరోధకాలు
Published Fri, Sep 20 2013 4:05 AM | Last Updated on Tue, May 29 2018 6:35 PM
Advertisement
Advertisement