YSR Teachers Federation
-
‘సమాజాన్ని ప్రభావితం చేసేది ఉపాధ్యాయులే’
సాక్షి, ప్రకాశం : సమాజాన్ని ప్రభావితం చేసేది ఉపాధ్యాయులేనని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆదివారం వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ఎండగడుతూ.. మన ప్రభుత్వం వస్తే ఏం మేలు జరుగుతుందో ప్రజలకు వివరించాలని తెలిపారు. పార్టీ గెలుపునకు ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో పార్టీ మరింత మద్దతును కూడగట్టాలని సూచించారు. -
పదోన్నతులు త్వరగా కేటాయించాలి
డీఈఓకు వైఎస్సార్‌టీఎఫ్ వినతి ఒంగోలు: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీచేయాలని వైఎస్సార్‌టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.జాలిరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తిచేశారు. పదోన్నతులు కల్పించే సమయంలో అక్టోబరు 2016 మాసాంతానికి ఖాళీ అయ్యే స్థానాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. పదోన్నతుల కారణంగా ఖాళీ అయ్యే సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను డీఈవో పూల్‌లో ఉన్న సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఇవ్వాలని పేర్కొన్నారు. గత ఏడాది విలీనం జరిగిన పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్‌టీచర్లు ఇన్ఫర్మేషన్ డేటాలలో జాయినింగ్ తేదీని రకరకాలుగా నమోదుచేశారన్నారు. జిల్లా మొత్తం ఒకే తేదీ ఉండేలా చర్యలు చేపట్టకపోతే రాబోవు బదిలీల్లో ఇబ్బందులు పడే పరిస్థితి ఉందని విజ్ఞప్తిచేశారు. డీఈవోను కలిసిన వారిలో జిల్లా గౌరవ అధ్యక్షులు డీసీహెచ్.మాలకొండయ్య, ఉపాధ్యక్షుడు శ్రీనివాసరావు, బొజ్జా సురేష్‌లు ఉన్నారు. -
పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీపై కన్ను
► పోటాపోటీగా అభ్యర్థుల ప్రచారం ► పదో తరగతి స్పాట్ కేంద్రంగా రాజకీయాలు ► బిజీబిజీగా ఉపాధ్యాయ సంఘాల నేతలు కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): పదో తరగతి స్పాట్ కేంద్రంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులు రాజకీయానికి తెరతీశారు. 2017 మార్చిలో జరిగే పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఈ నెల 9 నుంచి ప్రారంభమైన పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ కేంద్రంలో పేపర్లు దిద్దే ఉపాధ్యాయులను సమస్యల పేరుతో పలకరిస్తున్నారు. పనిలో పనిగా తమకు ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటికే కత్తినరసింహారెడ్డి(ఎస్టీయూ), రామస్వామి(ఆర్జేయూపీ), ఎమ్మెల్సీ గేయానంద్(యూటీఎఫ్), మాజీ ఎమ్మెల్సీ(ఎస్టీయూ) పోచంరెడ్డి సుబ్బారెడ్డి స్పాట్ కేంద్రంలో ఉపాధ్యాయులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఏడాదంతే ప్రచారమే.. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ఉపాధ్యాయులకు ఓటు హక్కు ఉంటుంది. మూడు జిల్లాలు కావడంతో అభ్యర్థులు ఏడాది ముందు నుంచే ప్రచారం మొదలు పెడతారు. ఒక్కో జిల్లాలో సుమారు 15 వేల ఓట్లుంటాయి. ప్రతి ఒక్కరినీ కలుసుకునేందుకు ఆ మేరకు సమయం కావాల్సి ఉండడంతో ఇప్పటి నుంచే ప్రచారం చేస్తున్నారు. ప్రకటించిన అభ్యర్థులు.. పీఆర్టీయూ: పశ్చిమ రాయలసీమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా ఉన్న బచ్చల పుల్లయ్య ఎస్టీయూ: సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి ఆర్జేయూపీ: 2011లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిన రామస్వామి యూటీఎఫ్: ప్రస్తుతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉన్న గేయానంద్ వైఎస్సార్‌టీఎఫ్: సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి అభ్యర్థిత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎస్టీయూ(రెబల్): గత ఎన్నికల్లో ఓడిపోయిన పోచంరెడ్డి సుబ్బారెడ్డి -
ఉపాధ్యాయుల నూతన సంవత్సర వేడుకలు
ఒంగోలు వన్‌టౌన్ : జిల్లాలో వివిధ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో గురువారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి నాయకత్వంలో సంఘ నాయకులు, ఉపాధ్యాయులు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎంపీ వైవీతో కేక్ కట్ చేయించారు. అనంతరం జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు జి.వెంకటేశ్వరరెడ్డి, జి.చంద్రశేఖర్, పి.శేషిరెడ్డి, సీహెచ్ భాస్కరరెడ్డి, పులి అంజిరెడ్డి, శిగా మోహన్‌రావు, రామకృష్ణారెడ్డి, శ్రీనివాసరావు, జె.శ్రీనివాస్, రామచంద్రారెడ్డి, సుబ్బారెడ్డి, నాయబ్స్రూల్ పాల్గొన్నారు. బీఈడీ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. బీఈడీ టీచర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ ఆవిష్కరించారు. అసోసియేషన్ నాయకులు జెడ్పీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఇతర అధికారులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో సంఘ రాష్ట్ర నాయకులు జీఎస్ఆర్ సాయి, ఎన్.శరత్‌బాబు, జిల్లా నాయకులు పి.రమణకుమార్, కె.రవికాంత్, దశరథరామిరెడ్డి, ఎల్.నారాయణరెడ్డి, ప్రసాద్, బి.కోటేశ్వరరావు, కాలేషావలి పాల్గొన్నారు. ఆపస్ ఆధ్వర్యంలో.. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) గోడపత్రికను జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ ఆవిష్కరించారు. ఆపస్ టేబుల్ క్యాలెండర్‌ను బీజేపీ రాష్ట్ర నాయకులు బత్తిన నరసింహారావు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆపస్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.సీతారామయ్య, కె.మల్లికార్జునరావు, రాష్ట్ర కోశాధికారి సీహెచ్ శ్రావణ్, కార్యదర్శి ఎ.బలరామకృష్ణ, జిల్లా బాధ్యులు ఎస్.హనుమంతురావు, కె.శేషారావు, జి.ప్రతాప్, దిలీప్‌చక్రవర్తి, చంద్రశేఖర్, వీఎన్ఆర్ మూర్తి పాల్గొన్నారు. పండిత పరిషత్ ఆధ్వర్యంలో.. రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లాశాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. పండిత పరిషత్ నాయకులు జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్‌ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. డీఈఓను కలిసిన వారిలో పండిత పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పి.మహబూబ్‌ఖాన్, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమేష్‌బాబు,వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఖయూంబాషా, కోశాధికారి రఘుబాబు, వీరేంద్ర, నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. ఎస్టీయూ ఆధ్వర్యంలో.. రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) నూతన సంవత్సరం 2015 డైరీ, క్యాలెండర్లను కలెక్టర్ విజయకుమార్ ఆవిష్కరించారు. 2014 సంవత్సరంలో విడుదలైన జీవోల పుస్తకాన్ని జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చల్లా శ్రీనివాసులు, కె.ఎర్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వెంగళరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసాద్, రాష్ట్ర కౌన్సిలర్లు ఎన్వీ ప్రసాద్, అజయ్‌కుమార్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జగన్మోహన్, సతీష్, సురేష్, బాలగురవయ్య, తిరుపతిస్వామి, సుబ్బారావు పాల్గొన్నారు. ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో.. ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు. ఆ సంఘ ఉపాధ్యాయులు కలెక్టర్ జిఎస్ఆర్కెఆర్ విజయకుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్, సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి బి.శ్రీనివాసరావు, జిల్లా ఖజానా శాఖ ఉపసంచాలకులు కె.లక్ష్మీకుమారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీవీ సుబ్బారావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.శ్రీనివాసులు, కె.శ్యాంసుందరరావు, ఎం.రాఘవరావు, పీపీ రంగారెడ్డి, ఎ.అమ్మయ్య, ఏవీ సుబ్బారావు, పి.ఆంజనేయులు, ఐ.హనుమంతురావు, పి.వెంకటేశ్వర్లు, ఎన్.వీరయ్య పాల్గొన్నారు. ఏపీజీటీఏ ఆధ్వర్యంలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో 2015 నూతన సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.మాల్యాద్రిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జి.సంజీవి, జిల్లా అధ్యక్షుడు బీవీ సుబ్బారావు, ప్రధానకార్యదర్శి జీవీ నారాయణ, జిల్లా ఉపాధ్యక్షులు జేవీ సుబ్బయ్య, ఓంకారయ్య పాల్గొన్నారు. -
అసమర్థ పాలన
కర్నూలు విద్య: రాష్ట్రంలో అసమర్థ పాలన కారణంగానే విద్యా శాఖ సమస్యలేవీ పరిష్కారానికి నోచుకోవడం లేదని ఏపీ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఓబులపతి అన్నారు. రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లోని విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా శనివారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ముఖ్య అతిథిగా హాజరైన ఓబులపతి మాట్లాడుతూ గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉద్యోగుల పట్ల ప్రదర్శించిన నిర్లక్ష్యంతో పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. సీఎంతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులకు ఆదాయమే తప్ప.. విద్యాశాఖ అభివృద్ధిపై ఏమాత్రం పట్టదన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి విద్యాశాఖతోనే ముడిపడి ఉంటుందనే విషయం బాబు గుర్తుంచుకోవాలన్నారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో గద్దెనెక్కిన ఆయన.. విపక్షాలపై చిందులేస్తూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఏడు నెలలు గడుస్తున్నా మేనిఫెస్టోలోని ఒక్క హామీ కూడా అమలుకు నోచుకోలేదన్నారు. ఉపాధ్యాయ సమస్యలపై జాక్టో, ఫ్యాక్టో, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టినా ప్రభుత్వంలో చలనం కరువైందన్నారు. ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇచ్చామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. ఏ హాస్పిటల్‌కు వెళ్లినా తమకెలాంటి ఆదేశాలు లేవని చెబుతున్నారన్నారు. ఈ కారణంగా రాష్ట్రంలోని వేలాది మంది ఉద్యోగులు చికిత్సల కోసం లక్షలాది రూపాయలు అప్పులు చేయాల్సి వస్తోందన్నారు. ఏకీకృత సర్వీసు రూల్స్ అమలులో కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేయలేకపోతోందన్నారు. పాఠశాలల పనివేళలను కోఠారి కమిషన్, విద్యావేత్తలు, మేధావులు నిర్ణయించినవి కాదని.. ప్రభుత్వం ఎలాంటి క్షేత్ర స్థాయి పర్యటనలు చేపట్టకనే మార్పు చేసి ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులను మానసికంగా వేధిస్తోందన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం పని వేళలు మార్చామంటున్న ప్రభుత్వం.. ఆ చట్టం ప్రకారం స్కూళ్లలో ఎందుకు వసతులు కల్పించడం లేదో సమాధానం చెప్పాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఉపాధ్యాయ సంఘాల డిమాండ్లన్నీ పరిష్కారమయ్యేవని, అందుకే పాఠశాల విద్యా చరిత్రలో ఎప్పుడు లేనంతగా అద్భుతమైన ఫలితాలు సాధ్యమయ్యాయన్నారు. 60 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీని తక్షణమే ప్రకటించి జులై 1, 2013 నుంచి అమలు చేయాలని డిమాండ్ చేశారు. రూ.398 వేతనంతో పని చేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలన్నారు. ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, డైట్ లెక్చరర్స్, జేఎల్ పోస్టులను అడ్హాక్ ప్రమోషన్స్‌తో భర్తీ చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 60 శాతం స్కూళ్లకు రవాణా సౌకర్యం సక్రమంగా లేదని, ఈ కారణంగా విద్యార్థులు 3 నుంచి 4 కిలోమీటర్లు నడవాల్సి వస్తోందన్నారు. దీంతో సరైన సమయానికి పాఠశాలకు చేరుకోలేక రోజూ రెండు మూడు పీరియడ్లు కోల్పోతున్నారన్నారు. హైస్కూళ్లలో భాషోపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టులను అప్‌గ్రేడ్ చేయాలని ఏపీ వైఎస్సార్ టీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వరప్రసాద్‌రెడ్డి, రమేష్‌లు డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా సోషల్ స్కూల్ అసిస్టెంట్ రెండోపోస్టును మంజూరు చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా, కౌన్సెలింగ్ విధానానికి విఘాతం కలిగించేలా ఉన్న అక్రమ బదిలీలను నిలిపివేయాలన్నారు. ఐటీడీ ఆశ్రమ పాఠశాలల్లోని ఖాళీలను హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్లను జీఓ ఎంఎస్‌నం.3 ప్రకారం ప్రమోషన్లు కల్పించి, 2014 డీఎస్సీలో సీఆర్పీలకు వెయిటేజ్ మార్కులు ఇవ్వాలన్నారు. రేషనలైజేషన్, బదిలీలు విద్యా సంవత్సరం మధ్యలో కాకుండా వేసవి సెలవుల్లో చేపట్టాలన్నారు. ధర్నాలో ఏపీవైఎస్సార్‌టీఎఫ్ జిల్లా వ్యవస్థాపక అధ్యక్షుడు తులసిరెడ్డి, వ్యవస్థాపక కార్యదర్శి సుబ్రమణ్యంరెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ సుదర్శన్‌రెడ్డి, ట్రెజరర్ రాజశేఖర్ రెడ్డి, మహిళ విభాగం అధ్యక్షురాలు కిరణ్మయి తదితరులు పాల్గొన్నారు. -
ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించకుంటే పోరే
ఒంగోలు టౌన్ : రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 60శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించకుంటే ప్రభుత్వంపై రాజీలేని పోరాటం సాగిస్తామని వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి వెంకటరెడ్డి హెచ్చరించారు. వైఎసాసర్ టీఎఫ్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలయ్యే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ, డైట్ లెక్చరర్లు, జూనియర్ లెక్చరర్ల పోస్టులను అడ్‌హక్ పదోన్నతులతో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ టీఎఫ్జిల్లా అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం ఉపాధ్యాయులతో చేసుకున్న ఒప్పందం మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుపయోగంగా ఉన్న హెల్త్ కార్డులను అన్ని కార్పొరేట్ ఆస్పత్రులు అనుమతించే విధంగా యాజమాన్యాలతో చర్చించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎయిడెడ్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. 398 రూపాయల ప్రత్యేక వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలన్నారు. జిల్లా కోశాధికారి వరిమడుగు వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ మునిసిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు కేవీ నారాయణ మాట్లాడుతూ జిల్లాలో పదోన్నతుల షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలన్నారు. గౌరవ సలహాదారు ఎన్.శామ్యూల్ మోజస్ మాట్లాడుతూ ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ఏపీటీఎఫ్ నాయకుడు పి.సుబ్బారావు, బీటీఏ నాయకుడు పి.జాలరామయ్యలు ధర్నా శిబిరాన్ని సందర్శించి మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్లు డి.శాంతారావు, మాలకొండారెడ్డి, మహిళా కార్యదర్శి మార్తమ్మ, ఉపాధ్యక్షుడు పి.నాగేశ్వరరావు, బి.సురేష్, పి.వెంకటప్పారెడ్డి, కేవీ రమణారెడ్డి, పులి అంజిరెడ్డి, కార్యదర్శులు వి.రామకృష్ణారెడ్డి, వై.తిరుపతిరెడ్డి, డివిజనల్ కార్యదర్శి బీసాబత్తిన శ్రీనివాసరావుతో పాటు అన్ని మండలాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి నూర్బాషాఖాశింను కలిసి వినతిపత్రం సమర్పించారు. -
'ఉపాధ్యాయ సమస్యలపై ప్రభుత్వం దిగి రావాలి'
అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దిగిరావాలంటూ వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఓబులపతి డిమాండ్ చేశారు. శనివారం విలేకర్లతో మాట్లాడిన ఆయన.. ఉపాధ్యాయలకు 60 శాతం ఫిట్మోంట్తో పీఆర్సీని అమలుచేయాల్సిందిగా ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. ఇందుకు నిరసనగా ఈ నెల 20న ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల కలెక్టరేట్ల వద్ద ధర్నా నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ధర్నా పోస్టర్ ను వైఎస్సార్ టీఎఫ్ నేతలు అశోక్ కుమార్ రెడ్డి, ఓబులపతి విడుదల చేశారు. -
‘వీఎంసీ’దే విజయం
విశాఖపట్నం సిటీ: మహా నగర పాలక సం స్థ ఉద్యోగుల గుర్తింపు కార్మికుల సంఘం ఎన్నికల్లో గంట మోగింది. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మద్దతుతో వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ విజయదుందుభి మోగించింది. తెలుగు దేశం పార్టీ మద్దతుతో బరిలోకి దిగిన గుర్తింపు కార్మిక సంఘానికి జీవీఎంసీ ఉద్యోగులు షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో 700 పైచిలుకు ఓట్ల మెజార్టీ సాధించిన ‘కాగడా’ ఈసారి వెలవెలబోయింది. ఉదయం నుంచీ తొమ్మి ది చోట్ల జరిగిన పోలింగ్‌లో 3143 మంది ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం లెక్కింపు అనంతరం వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూని యన్ 153 ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లు ప్రకటించారు. అదనపు డిప్యూటీ లేబర్‌కమిషనర్ ఆర్. శ్రీనివాసరావు నేతృత్వంలోని సభ్యులు ఎన్నికలను నిర్వహించారు.ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఓట్ల లెక్కింపులో ప్రతీ రౌండ్లోనూ ఇరు యూనియన్లకు సమానంగానే ఓట్లు వస్తుండడంతో విజయం దోబూచులాడిం ది. సగం ఓట్లు లెక్కించాక వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ గుర్తు గంట మోగుతుందని ధీమాతో జీవీఎంసీ నుంచి ఊరేగింపుగా అశీలుమెట్టలోని శ్రీ సంపత్ వినాయగర్ ఆలయానికి వెళ్లి కొబ్బరి కాయ లు కొట్టారు. అక్కడి నుంచి ఊరేగింపుగా యూనియన్ కార్యాలయానికి వెళ్లారు. వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్‌కు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, బీఎంఎస్, ఇంటక్, సీఐటీయు, హెచ్ఎంఎస్ యూనియన్లు మద్దతు ఇచ్చాయి. అందరికీ న్యాయం చేస్తా విజయానికి సహకరించిన జీవీఎంసీ ఉద్యోగులందరికీ న్యాయం చేసేలా కృషి చేస్తాను. ఉద్యోగులంతా తన నాయకత్వాన్ని ఏకగ్రీవంగా కోరుకున్నారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తన అనుచరులతో కొందరు ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేశారు. తద్వారా మా గెలుపును అడ్డుకోలేకపోయినా మెజార్టీని తగ్గించగలిగారు. అవినీతి, అసమర్ధత నాయకత్వాన్ని జీవీఎంసీ నుంచి పారద్రోలేలా ఉద్యోగులిచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనది. -వి.వి.వామన రావు, ప్రధాన కార్యదర్శి-వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ విజయంపై వైఎస్సార్ సీపీ హర్షం జీవీఎంసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ బలపర్చిన వీఎంసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ విజయం సాధించడంపై ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వంశీకృష్ణ శ్రీనివాస్ ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రానున్న జీవీఎంసీ ఎన్నికలకు ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. -
టీచర్ల సమస్యలపై రాజీలేని పోరు
ఒంగోలు వన్‌టౌన్ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాజీలేని పోరాటం చేస్తుందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమమే ధ్యేయంగా ఫెడరేషన్ పనిచేస్తోందన్నారు. ఆదివారం స్థానిక మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో జాలిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న మండల విద్యాధికారులు, ఉప విద్యాధికారులు, డైట్ అధ్యాపకుల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాష్ట్రంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే డీఎస్పీ ప్రకటించాలని జాలిరెడ్డి కోరారు. పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానానికి బదులుగా పాఠశాలల పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఓబుళపతి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు 60 శాతం ఫిట్మెంట్తో వెంటనే పీఆర్ సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 398 రూపాయల నిర్ణీత వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహిళా కార్యదర్శి కే ఆదిలక్ష్మి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూడా రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయాలని కోరారు. వైఎస్సార్ టీఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రేడ్-2 భాషా పండితులు, వ్యాయామోపాధ్యాయుల పోస్టులను స్కూలు అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. హుదూద్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజానీకాన్ని ఆదుకునేందుకు వైఎస్సార్ టీఎఫ్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు విరివిగా విరాళాలు ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు. వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. సంఘ జిల్లా కన్వీనర్ డీసీహెచ్ మాలకొండయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్ టీఎఫ్ గౌరవ సలహాదారు ఎస్ రామచంద్రారెడ్డి, గాయం లక్ష్మీరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మాలకొండారెడ్డి, ప్రసాద్, వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గాన్ని హైదరాబాద్‌లో మంగళవారం ప్రకటించారు. అధ్యక్షులుగా కేశవరపు జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్ళిగా కె. ఓబుళపతి కొనసాగనున్నారు. తాజాగా ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, ఏడుగురు కార్యదర్శులతో కొత్త కార్యవర్గం ఏర్పాటయింది. సమాఖ్య గౌరవాధ్యక్షులుగా ఎం. రియాజ్ హుస్సేన్(కృష్ణా జిల్లా), అసోసియేట్ అధ్యక్షులుగా వి.శేఖర్‌రెడ్డి(చిత్తూరు), కోశాధికారిగా కె.సింహాద్రి(విశాఖ) నియమితులయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా పి.ఫ్రాన్సిస్ కిశోర్(గుంటూరు), బి.మోహన్(నెల్లూరు), జి.మహేశ్(కర్నూలు), కె.శ్రీనివాసులు, హెచ్.గిరిధర్ రెడ్డి(అనంతపురం), ఎన్ .శివశంకరరెడ్డి(కడప), బి.భువనేశ్వర్(కృష్ణా), కె.వెంకటరెడ్డి(ప్రకాశం)లను నియమించారు. కార్యదర్శులుగా బి.రఘురామిరెడ్డి(నెల్లూరు), డి.పూర్ణచంద్రరావు(కృష్ణా), పి.రెడ్డప్పరెడ్డి(కడప), కె.గోవిందరెడ్డి, కె.పుల్లయ్య(అనంతపురం), ఆర్.నరసింహులు(కర్నూలు), కె.ఆదిలక్ష్మి(ప్రకాశం) వ్యవహరించనున్నారు. ఆడిట్ కమిటీ సభ్యులుగా హెచ్.గంగాధర(అనంతపురం), అకడమిక్ సెల్ సభ్యులుగా పి.చెన్నారెడ్డి(అనంతపుర ం), బి.రెబెకా దేవదాస్(కడప)నియమితులయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జాలిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఓబుళపతి విలేకర్లతో మాట్లాడుతూ.. పిల్లల హక్కులు కాపాడటంతోపాటు టీచర్ల పక్షాన నిలిచి సమస్యలు, హక్కుల రక్షణ సాధన లో దీక్షగా ఫెడరేషన్ పనిచేస్తుందన్నారు. -
ప్రైవేటీకరణను ప్రతిఘటిస్తాం
ఆర్టీసీని కాపాడుకుందాం.. వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నిర్ణయం విభజన తర్వాత 45 సంస్థలను ప్రైవేటీకరించే ప్రమాదముంది.. ఏపీ శాఖ అధ్యక్షునిగా గౌతమ్‌రెడ్డి బాధ్యతల స్వీకారం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణను తీవ్రంగా ప్రతిఘటించాలని, అత్యంత ముఖ్యమైన ఆర్టీసీని ప్రైవేటుపరం కాకుండా పరిరక్షించుకుందామని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ రాష్ట్రంలోని కార్మిక శ్రేణులకు పిలుపునిచ్చింది. ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ టీయూ రాష్ట్ర స్థాయి తొలి సమావేశం జరిగింది. ఇందులో టీడీపీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పలు తీర్మానాలు చేశారు. ఇదే సమావేశంలో వైఎస్సార్ టీయూ ఆంధ్రప్రదేశ్ శాఖకు తొలి అధ్యక్షునిగా నియమితులైన పూనూరు గౌతమ్‌రెడ్డి(విజయవాడ) బాధ్యతలు స్వీకరించారు. గౌతమ్‌రెడ్డితో, సమావేశానికి హాజరైన ఇతర ప్రతిని ధులతో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రమాణం చేయించారు. ఇప్పటివరకు ఉమ్మడి రాష్ట్ర ట్రేడ్‌యూనియన్ అధ్యక్షుడిగా ఉన్న బి.జనక్‌ప్రసాద్‌ను పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శాలువాకప్పి సన్మానించారు. ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల నుంచి వచ్చిన టీయూ జిల్లా శాఖల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పెద్ద పరిశ్రమల కార్మికనేతలు, ఆర్టీసీ, విశాఖ ఉక్కు కర్మాగారం, మున్సిపల్ కార్మికులు, వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగుల నేతలు, బీహెచ్‌పీవీ, హిందుస్థాన్ షిప్‌యార్డు కార్మిక సంఘాల నేతలు, అంగన్వాడీ నేతలు పెద్ద సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రభుత్వరంగ సంస్థలను నష్టాల్లోకి నెట్టి ఆ తరువాత వాటిని ప్రైవేటీకరణ పేరుతో తన వాళ్లకు కట్టబెట్టడం సీఎం చంద్రబాబు నైజమని, అలాంటి చర్యలను ప్రతిఘటించాలని తీర్మానించారు. కార్మిక వ్యతిరేక విధానాలపై పోరు: విజయసాయిరెడ్డి వైఎస్సార్టీయూను క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతోపాటుగా ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన అవసరముందని పార్టీ పర్యవేక్షణ కమిటీ సభ్యుడు, ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి చెప్పారు. ఇకపై ప్రతి 60 రోజులకోసారి టీయూ పనితీరును సమీక్షిస్తామని చెప్పారు. 2019 ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా వైఎస్సార్టీయూను నిర్మించాలన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ 107 ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే.. ఒక్క మన రాష్ట్రంలోనే 1995 నుంచి 2004 మధ్య చంద్రబాబు పాలనలో 57 సంస్థలను ప్రైవేటుపరం చేశారని విమర్శించారు. ప్రైవేటీకరించిన ఈ సంస్థలు, వాటికి అనుబంధంగా ఉన్న భూముల అంచనా విలువ రూ.1,59,900 కోట్ల ని ఆయన వివరించారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కీలకమైనవేనని, కార్మికుల సంక్షేమం, ప్రయోజనాల రీత్యా ఈ రెండింటినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే 35 వేలమంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపారని, విభజన తరువాత ఏపీలో ఇంకా మిగిలున్న 45 ప్రభుత్వరంగ సంస్థలనూ ఎలా ప్రైవేటుపరం చేయాలనే ఆలోచనతో ఉన్నారంటూ.. అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. పారిశ్రామికాభివృద్ధికి కృషి: జనక్‌ప్రసాద్ కార్మికుల ప్రయోజనాలను కాపాడుకుంటూనే పారిశ్రామికాభివృద్ధికి వైఎస్సార్‌టీయూ కృషి చేయాల్సి ఉంటుందని జనక్‌ప్రసాద్ అన్నారు. దివంగత వైఎస్ కార్మిక పక్షపాతిగా పేరు తెచ్చుకున్నారని, ఆయన ఏ రోజూ కార్మికులకు నష్టం కలిగించే నిర్ణయాలు తీసుకోలేదన్నారు. కానీ చంద్రబాబు తన హయాంలో ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్మారని విమర్శించారు. వంద శాఖలు లక్ష్యం: గౌతమ్‌రెడ్డి పార్టీ ట్రేడ్ యూనియన్‌కు అనుబంధంగా వంద శాఖల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుంటున్నామని గౌతమ్‌రెడ్డి వివరించారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు 39 వాగ్దానాలు చేశారని, వాటి అమలుకోసం టీయూ తరఫున పోరాడతామన్నారు. ఎక్కడైతే కార్మిక సమస్యలుంటాయో అక్కడ వైఎస్సార్‌టీయూ జెండా ఉంటుందన్నారు. కాంట్రాక్టు కార్మికులందర్నీ పర్మినెంట్ చేయాలని, కర్మాగారాల్లో పనిచేసే కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, మహిళా కార్మికులకు రక్షణ కల్పించాలని, బాలకార్మికుల వ్యవస్థను కర్మాగారాల్లో నిర్మూలించాలని, అసంఘటిత రంగంలోని కార్మికులకూ బీమా సౌకర్యం కల్పించాలని, సమానపనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతూ సమావేశం తీర్మానాలు చేసింది. సమావేశ నిర్ణయాలను జనక్‌ప్రసాద్, విజయసాయిరెడ్డి, గౌతమ్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. పార్టీ ప్రధానకార్యదర్శి పీఎన్వీ ప్రసాద్, కార్మిక నేతలు వి.రాజదుర్గాప్రసాద్, టి.శివశంకర్‌రెడ్డి, రాజారెడ్డి, మనోరంజని, వి.రవి సమావేశంలో పాల్గొన్నారు. విషప్రచారాన్ని తిప్పికొట్టాలి: సజ్జల వైఎస్సార్సీపీపై ప్రత్యర్థులు చేసే విషప్రచారాన్ని తిప్పికొట్టడంలో ట్రేడ్‌యూనియన్ ముఖ్యపాత్ర పోషించాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. కార్మికోద్యమం బలపడితే పార్టీకి ఎంతో మేలు జరుగుతుందన్నారు. పార్టీ ఆవిర్భవించాక ఇప్పటికి 174 చోట్ల యూనియన్లను ఏర్పాటు చేయగలిగామని, ఇదంతా జనక్‌ప్రసాద్ కృషేనని ప్రశంసించారు. అన్నిరంగాల్లో మాదిరిగానే కార్మికుల్లోనూ దివంగత వైఎస్ అభిమానులు పెద్దసంఖ్యలో ఉన్నారని, వారందర్నీ సంఘటితం చేయాలని సూచించారు. -
వైఎస్సార్ టీఎఫ్కు నూతన కమిటీ
హైదరాబాద్: రాష్ట్ర వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్‌కు హైదరాబాద్‌లో ఆదివారం నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఫెడరేషన్ గౌరవాధ్యక్షులుగా ఎం. రియాజ్ హుస్సేన్(కృష్ణా), అధ్యక్షుడుగా కేశవరపు జాలిరెడ్డి(ప్రకాశం), అసోసియేట్ అధ్యక్షుడుగా టీవీ రమణారెడ్డి(వైఎస్సార్ జిల్లా), ప్రధాన కార్యదర్శిగా కె. ఓబులపతి(అనంతపురం) ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం ఓబులపతి మాట్లాడుతూ.. సమస్యల విషయంలో కొత్త కమిటీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. -
వైఎస్సార్ ట్రేడ్ యూనియన్‌లో పలువురికి చోటు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ రాష్ట్ర కమిటీలోకి పలువురు నాయకులను తీసుకున్నారు. కె.సత్యనారాయణ, లక్ష్మణ్ నాయక్, మోహన్ చౌహాన్ (హైదరాబాద్), పి.మధుసూదన్‌రెడ్డి, ఎండీ వాహెద్ (కృష్ణా), డి.పైడి రాజారెడ్డి, కె.వెంకటరావు, శ్రీకాంత్‌రాజు (విశాఖపట్నం), సూర్యనారాయణ(బాబి) (విజయనగరం), జి.శేఖర్‌నాయుడు, జి.బాలసుందరం(చిత్తూరు), బి.శ్రీనివాస్‌రెడ్డి, పి.విఘ్నేశ్వర్‌రెడ్డి (రంగారెడ్డి), జె.ప్రభాకర్‌రెడ్డి, ఎన్.శ్రీనివాస్‌రెడ్డి, అంజినారెడ్డి, (గుంటూరు), వై.రవిప్రకాష్ (కర్నూలు), ప్రదీప్‌రెడ్డి (నల్లగొండ), ఓరుగంటి కోటిరెడ్డి (ప్రకాశం) లను రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వీరి నియామకం జరిగినట్లు ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బి.జనక్‌ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
17న ఢిల్లీలో ధర్నాకు భారీగా తరలిరండి: వైఎస్సార్‌టీఎఫ్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 17న వైఎస్సార్సీపీ ఢిల్లీలో నిర్వహించనున్న ధర్నాకు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఉపాధ్యాయులకు వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ పిలుపునిచ్చింది. గురువారం జరగనున్న సీమాంధ్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. బంద్‌ను విజయవంతం చేయాలని ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ ఓబుళపతి విజ్ఞప్తి చేశారు. -
చిన్న రాష్ట్రాలు అభివృద్ధి నిరోధకాలు
సాక్షి, నెల్లూరు : చిన్న రాష్ట్రాలు అభివృద్ధి నిరోధకాలని, ఇందుకు కొత్తగా ఏర్పాటైన చిన్న రాష్ట్రాలే నిదర్శనమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ అన్నారు. సమైక్యాంధ్ర కోరుతూ గురువారం వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నెల్లూరు రూరల్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సద్భావన సదస్సు జరిగింది. ఈ సదస్సులో మేరిగ మురళీధర్ మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి సాధించి అందమైన రాష్ట్రంగా మారిందన్నారు. పచ్చగా ఉన్న రాష్ట్రాన్ని ఓట్లు, సీట్లు ప్రాతిపదికన కాంగ్రెస్ అధిష్టానం రెండుగా ముక్కలు చేసి సీమాంధ్రుల ఉసురు పోసుకుందని ధ్వజమెత్తారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ రాజకీయాలకతీతంగా సీమాంధ్రులు రోడ్లుపైకి వచ్చి పోరాడటం హర్షణీయమన్నారు. ప్రజలు ఉద్యమిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు. వైఎస్సార్ బతికుంటే ఇలా జరిగేదికాదన్నారు. హైదరాబాద్ అందరి సొత్తు: కాకాణి రాష్ట్ర ప్రజలందరూ 50 ఏళ్లపాటు అభివృద్ధి చేస్తేనే హైదరాబాద్ దేశంలోనే పేరొందిన నగరంగా మారిందని వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలన్నీ అక్కడే ఉన్నాయన్నారు. రాష్ట్ర ఆదాయంలో 55 శాతానికిపైగా హైదరాబాద్ నుంచే సమకూరుతుందని కాకాణి చెప్పారు. ఒక్కసారిగా రాష్ట్రాన్ని ముక్కలు చేసి హైదరాబాద్ మీది కాదు వెళ్లిపొమ్మంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. కొడుకు రాహుల్‌ను ప్రధానిని చేసుకునేందుకే సోని యా కుట్రపన్ని రాష్ట్ర విభజనకు పూనుకుందని కాకాణి విమర్శించారు. కాంగ్రెస్, టీడీపీ రాష్ట్ర విభజనపై స్పష్టమైన వైఖరిని చెప్పి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఒక్కటే సమైక్యాంధ్రకు కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే విజయమ్మ, జగన్ దీక్షలు చేపట్టారన్నారు. రాజీనామాలు చేయాలి: కోటంరెడ్డి కాంగ్రెస్, టీడీపీ నేతలు తమ పదవులకు రాజీనామాలు చేసి సీమాంధ్ర ఉద్యమంలోకి రావాలని నెల్లూరు రూరల్ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధరెడ్డి పిలుపునిచ్చారు. అధిష్టానాన్ని నిలదీయలేని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు రాజీనామాల డ్రామాలు ఆడుతున్నారన్నారు. వారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఢిల్లీకి వెళ్లి ఉద్యమించాలన్నారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం టీడీపీనే అన్నా రు. బాబు లేఖతోనే రాష్ట్రం ముక్కలవుతోందని మండిపడ్డారు. సీమాంధ్రలో ఉద్యమాన్ని చూసి న్యాయం చేయాలంటూ బాబు చిలుకపలుకులు పలుకుతున్నారని కోటంరెడ్డి విమర్శించారు. కుట్రతోనే విభజన: అనిల్‌కుమార్ కాంగ్రెస్, టీడీపీల కుట్రలు, కుయుక్తులతోనే రాష్ట్ర విభజన జరిగిందని నెల్లూ రు సిటీ నియోజకవర్గ సమన్వయకర్త అనిల్‌కుమార్‌యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి క్షీణించిందని సోనియా తెలుసుకొని రాష్ట్రాన్ని ముక్క లు చేసిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌తో చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్న బాబు తెలంగాణ విభజనకు అనుకూలంగా లేఖ ఇవ్వడంతోనే రాష్ట్రం ముక్కలైందన్నారు. ఏ క్షణంలో ఎన్నికలు జరిగినా రెండు పార్టీలకు ప్రజలు బుద్ధి చెబుతారని అనిల్ స్పష్టం చేశారు. ఆగే వరకు ఉద్యమం: ఓబుళపతి రాష్ట్ర విభజన ప్రకటన ఉపసంహరించుకునే వరకు సమైక్య ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ ఓబుళపతి చెప్పారు. విభజన వల్ల సీమాంధ్ర పూర్తిగా నష్టపోతుందన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. సాగు, తాగనీటి కష్టాలు తప్పవన్నారు. రాయలసీమతో పాటు దిగువన ఉన్న నెల్లూరు జిల్లాకు కృష్ణానది నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్ మహిళా జిల్లా కన్వీనర్ బండ్లమూడి అనిత, ఉపాధ్యాయనేతలు అశోక్‌కుమార్‌రెడ్డి, నరేంద్రకుమార్, ఉదయ్‌కుమార్, ఎన్.రఘురామిరెడ్డి, కేవీ నారాయణరాజు, డేవిడ్, వాసు, యానాదిరెడ్డి, సుబ్రమణ్యం, చినఅంజయ్య, బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డి, రూప్‌కుమార్‌యాదవ్, జనార్దన్‌రెడ్డి, మందాబాబ్జీ, నరసింహయ్యముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి ‘వైఎస్సార్ టీచర్స్’ సమైక్య సదస్సులు
ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కోస్తా, రాయలసీమల్లోని 13 జిల్లాల్లో బుధవారం నుంచి సమైక్యాంధ్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సద్భావన సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కే ఓబుళపతి తెలిపారు. సదస్సు నిర్వహణ కరపత్రాలను స్థానిక పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం సీజీసీ సభ్యుడు వై విశ్వేశ్వరరెడ్డి ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని, ప్రాధాన్యతను వివరిస్తూ రోజుకు రెండు జిల్లాల చొప్పున ఉపాధ్యాయ సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం 18న వైఎస్సార్ జిల్లా కేంద్రంలో తొలి సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 27 వరకూ జరిగే సదస్సులు అనంతపురంలో ముగుస్తాయన్నారు. కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో ఫెడరేషన్ సారథ్య సంఘం సభ్యులు కె.జాలిరెడ్డి, పి.అశోక్‌కుమార్‌రెడ్డి, పి.వి.రమణారెడ్డి, రియాజ్ హుస్సేన్ పాల్గొన్నారు.