ఒంగోలు వన్‌టౌన్ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఏపీ వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాజీలేని పోరాటం చేస్తుందని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి వారి సంక్షేమమే ధ్యేయంగా ఫెడరేషన్ పనిచేస్తోందన్నారు. ఆదివారం స్థానిక మాంటిస్సోరి పబ్లిక్ స్కూల్లో నిర్వహించిన వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో జాలిరెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న మండల విద్యాధికారులు, ఉప విద్యాధికారులు, డైట్ అధ్యాపకుల పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కొత్త రాష్ట్రంలో ప్రభుత్వ, పంచాయతీరాజ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీస్ రూల్స్ సాధించేందుకు ప్రభుత్వం కృషి చేయాలన్నారు.
పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేసేందుకు వెంటనే డీఎస్పీ ప్రకటించాలని జాలిరెడ్డి కోరారు. పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానానికి బదులుగా పాఠశాలల పర్యవేక్షణాధికారి పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే ఓబుళపతి మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, ఉద్యోగులకు 60 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే పీఆర్ సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు మంజూరు చేయాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండ్రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 398 రూపాయల నిర్ణీత వేతనంతో పనిచేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర మహిళా కార్యదర్శి కే ఆదిలక్ష్మి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూడా రెండేళ్ల చైల్డ్ కేర్ లీవ్ మంజూరు చేయాలని కోరారు. వైఎస్సార్ టీఎఫ్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న గ్రేడ్-2 భాషా పండితులు, వ్యాయామోపాధ్యాయుల పోస్టులను స్కూలు అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు. హుదూద్ తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజానీకాన్ని ఆదుకునేందుకు వైఎస్సార్ టీఎఫ్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు విరివిగా విరాళాలు ఇవ్వాలని సమావేశంలో తీర్మానించారు.
వైఎస్సార్ టీఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. సంఘ జిల్లా కన్వీనర్ డీసీహెచ్ మాలకొండయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వైఎస్సార్ టీఎఫ్ గౌరవ సలహాదారు ఎస్ రామచంద్రారెడ్డి, గాయం లక్ష్మీరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు మాలకొండారెడ్డి, ప్రసాద్, వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు, అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.
టీచర్ల సమస్యలపై రాజీలేని పోరు
Published Mon, Oct 20 2014 1:44 AM | Last Updated on Tue, May 29 2018 6:35 PM
Advertisement
Advertisement