‘గదుల’పై గద్దలు
‘మా కార్యకర్తలు చెప్పింది వినండి. వారు చెయ్యమన్న పనులు చేసిపెట్టండి. వారిని చూసుకుంటేనే మా సర్కార్‌ను మరోసారి చూస్తాం. లేదంటే మీకూ ఇబ్బందే.. మాకూ ఇబ్బందే’ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజయవాడలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌లతో అన్న మాటలివి. ఆయన ఏ ఉద్దేశంతో ఆ మాటలన్నా ఆ రోజు నుంచీ జిల్లాలో తెలుగుదేశం నేతలు అన్ని పనుల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్నారు. నిబంధనలను తుంగలో తొక్కేస్తున్నారు. దక్కినంత సొమ్ము దండుకుంటున్నారు.
- ఎస్‌ఎంసీలు చేపట్టాల్సిన అదనపు గదుల నిర్మాణం
- కాంట్రాక్టర్లకు అప్పగిస్తున్న టీడీపీ నాయకులు
- జిల్లావ్యాప్తంగా 10 నుంచి 15 శాతం కమీషన్ వసూలు
- కొన్నిచోట్ల వాటాలు కుదరకపోవడంతో పనుల్లో జాప్యం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘తమను చూసుకోమని’ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న మాటలను తెలుగుదేశం కార్యకర్తలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని సొమ్ము చేసుకోవడానికి లెసైన్సుగా పరిగణించి అన్ని వ్యవహారాల్లో ‘సొంత లాభానికే’ ఆరాటపడుతున్నారు. అది, ఇది అని లేకుండా.. చివరకు విద్యార్థుల కోసం చేపట్టే అదనపు గదుల నిర్మాణంపైనా రాంబదుల్లా వాటి కమీషన్‌ల కోసం పీక్కుతింటున్నారు. అడిగే నాథుడు లేడన్న బరి తెగింపుతో స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఎస్‌ఎంసీ)లను కాగితాలకే పరిమితం చేస్తున్నారు. జిల్లాలో మూడొంతుల నియోజకవర్గాల్లో దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని చోట్ల 10 శాతం ముట్టజెప్పేలా ఒప్పందాలు జరుగుతుంటే నోరున్న నేతలున్న ప్రాంతాల్లో 15 శాతం కూడా దండుకుంటున్నారు. కమీషన్‌లపై నేతల మధ్య పేచీలతో నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్న పరిస్థితి కూడా జిల్లాలో నెలకొంది. ఈ పరిస్థితుల్లో అదనపు గదులను మార్చి నెలాఖరుకు ఎలా పూర్తి చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
రాజీవ్ విద్యామిషన్ పర్యవేక్షణలో జిల్లాలో అదనపు తరగతి గదుల నిర్మాణానికి ఇటీవల శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి విద్యార్థుల కోసం 927, ఎనిమిదో తరగతి విద్యార్థుల కోసం 184తో కలిపి జిల్లా వ్యాప్తంగా 1111 గదుల నిర్మాణానికి అనుమతి లభించింది. ఈ గదుల నిర్మాణం కోసం జిల్లాకు రూ.58.63 కోట్లు కేటాయించారు. ఒక గదికి గతంలో రూ.3.60 లక్షలు కేటాయించగా ఇప్పుడా మొత్తాన్ని మరో రూ.2.20 లక్షలు పెంచారు.ఆ పెంపుదలే అధికారపార్టీ నేతలకు వరంగా మారింది. రాజీవ్ విద్యామిషన్ పర్యవేక్షణలో పాఠశాలమేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్, స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కన్వీనర్‌గా నిర్మాణ బాధ్యతలు చేపట్టాలనేది నిబంధన. నిర్మాణాన్ని కమిటీలకు అప్పగిస్తే నాణ్యత బాగుంటుందన్నది ప్రభుత్వం ఉద్దేశం.
ఎక్కువ కమీషన్ ఇచ్చిన వారికే..
అయితే ఈ వ్యహారమంతా నియోజకవర్గాల్లో టీడీపీ ముఖ్య నేతల కనుసన్నల్లోనే బాహాటంగా జరుగుతుండటంతో పర్యవేక్షించాల్సిన అధికారులు మొక్కుబడి పరిశీలనలకే పరిమితమవుతున్నారు. నేతలు కమిటీలను గుప్పిట్లో పెట్టుకుని నచ్చిన కాంట్రాక్టర్‌లకు పనులు అప్పగించి ముందే 10 నుంచి 15 శాతం కమీషన్ మూటగట్టుకుంటున్నారు. ఉదాహరణకు ముమ్మిడివరం నియోజకవర్గం.. తాళ్లరేవు, ఐ. పోలవరం మండలాల్లో నిర్మాణ పనులు మండల స్థాయి నేతలు చెప్పిన వారికే కట్టబెట్టాలని ముఖ్యనేత హుకుం జారీచేశారు. అక్కడ 10 శాతం కమీషన్ ఇస్తామన్న కాంట్రాక్టర్‌ను 15 శాతం కోసం డిమాండ్ చేస్తుండటంతో నేతల మధ్య వివాదం తలెత్తింది. ఆ కమీషన్ ముందుగానే ముట్టచెపితేనే పనులు అప్పగిస్తామంటుండటంతో కాంట్రాక్టర్‌లు వెనకడుగు వే స్తున్నారని సమాచారం. తాళ్లరేవు మండలంలో 30 అదనపు గదుల నిర్మాణానికి కేవ లం సుంకరపాలెం, ఇంజరం, గాడిమొగల్లో పనులు కిటికీల వరకే వచ్చాయి. మిగిలిన వాటిసై కాంట్రాక్టర్‌లతో ఒప్పం దాలు ఇప్పుడిప్పుడే కొలిక్కివస్తున్నా యి. ఐ.పోలవ రం మండలంలో అన్ని గదుల నిర్మాణం కాంట్రాక్టర్‌లకే ఇచ్చేలా ఒప్పందానికి వచ్చినట్టు సమాచారం.
రాజోలులో ముఖ్యనేతదే మేత..
రాజోలు నియోజకవర్గంలో ముఖ్యనేతే స్వయంగా 15 శాతం కమీషన్‌క ఒప్పందాలు చేసుకుంటుండడం తో పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు గుర్రుగా ఉన్నా రు. అధినేత కార్యకర్తలను, తమ వంటి నేతలను చూడమంటే ఇక్కడ మాత్రం ఎన్నికల్లో అప్పుల పాలైపోయామంటూ పెద్ద తలకాయలే కమీషన్‌లు ఎగరేసుకుపోతున్నారని మండిపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో అదనపు గదుల నిర్మాణంలో కమీషన్‌ను మూడు వాటాలు వేసుకున్నారని సమాచారం. నేతలకు 10 శాతం, పనులు దక్కించుకున్నకాంట్రాక్టర్‌కు సబ్‌కాంట్రాక్టర్ ఇచ్చే 5 శాతం, క్షేత్రస్థాయిలో సిబ్బందికి 5 శాతం ఇచ్చేలా జరిగాయంటున్నారు.
కమీషన్‌ల ఖరారులో జా ప్యం తో ఇంతవరకు కేవలం 300 గదులనే మొదలు పెట్టా రు. నిర్మాణాల్లో జాప్యంపై శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఎస్‌ఎంసీలు ముందుకు రాకుంటే టెండర్లు పిలవాలని కలెక్టర్ ఆదేశించడం గమనార్హం. ఇప్పటి వరకూ ఈ పనులన్నీ ఎస్‌ఎం సీ లే చేపడుతున్నట్టు జిల్లా యంత్రాంగం భావిస్తున్న ట్టు కనిపిస్తోంది. టీడీపీ నేతల నిర్వాకం వల్ల భావి పౌరులు చదువుకునే భవనాల నాణ్యత ప్రశ్నార్థకం కానుంది. దీనికి ఉన్నతాధికారులు చెక్ చెప్పాలి. వారి దండుడు వ్యవహారానికి అడ్డుకట్ట వేయాలి.
మేనేజ్‌మెంట్ కమిటీలే చేపట్టాలి..
నిబంధనల మేరకు పనులను స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ, హెచ్‌ఎమ్‌ల పర్యవేక్షణలో చేపట్టాలి. ఎక్కడైనా కాంట్రాక్టర్‌లకు అప్పగించినట్టు మా దృష్టికి వస్తే ఉన్నతాధికారులకు నివేదించి చర్యలు తీసుకుంటాం.
- ఎం.శ్రీనివాసరావు, ప్రాజెక్టు అధికారి, రాజీవ్ విద్యామిషన్, కాకినాడ