సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా నూతన కలెక్టర్‌గా 2001 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ నియమితులయ్యారు. కలెక్టర్ దినకర్‌బాబు రాష్ట్ర సహకార మార్కెటింగ్ ఫెడరేషన్(మార్‌కఫెడ్) మేనేజింగ్ డెరైక్టర్‌గా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పీకే మహంతీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ యేడాది జూన్ వరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన స్మితా సబర్వాల్ ప్రస్తుతం జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. 2000 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి దినకర్‌బాబు 2012 జూలైలో జిల్లా కలెక్టర్‌గా బదిలీపై వచ్చారు.
సుమారు 15 నెలల పాటు కలెక్టర్‌గా పనిచేసిన దినకర్‌బాబు ఆకస్మిక బదిలీపై రాజకీయ, అధికారిక వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. రెండు నెలల క్రితమే కలెక్టర్ బదిలీ జరుగుతుందనే ప్రచారం జరిగింది. అయితే వచ్చే యేడాది జరిగే సాధారణ ఎన్నికల వరకు కొనసాగించాల్సిందిగా దినకర్‌బాబు చేసిన విజ్ఞప్తికి సానుకూల స్పం దన లభించినట్లు సమాచారం. అయితే ప్రస్తుత బదిలీపై దినకర్‌బాబుకు ముందస్తు సమాచారం లేదని తెలిసింది. డిప్యూటీ సీఎం, జిల్లా మంత్రులు సహా అధికార పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం పరిగణనలోకి తీసుకోకుండానే స్మితా సబర్వాల్‌కు పోస్టింగ్ ఇచ్చినట్లు వెల్లడవుతోంది. సీఎం కిరణ్‌తో డిప్యూటీ సీఎం దామోదర తీవ్రంగా విభేదిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ నియామకం చర్చనీయాంశమైంది.
స్మితా సబర్వాల్ ప్రొఫైల్
జననం: 19 జూన్, 1977
మాతృభాష: బెంగాలీ
విద్య: బీకాం (సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీ, సికింద్రాబాద్)
ఐఏఎస్:2001 బ్యాచ్, (తొలి ప్రయత్నంలోనే యుపీఎస్సీ పరీక్షలో జాతీయ స్థాయిలో నాలుగో ర్యాంకు)
2001లో ఆదిలాబాద్ ట్రెయినీ కలెక్టర్
2003-04లో చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్
2004-06లో పీడీ, రూరల్ డెవలప్‌మెంట్
2006-07లో మున్సిపల్ కమిషనర్, వరంగల్
2007-2011లో జాయింట్ కలెక్టర్ కర్నూలు, హైదరాబాద్
2011-2013 జూన్ వరకు కరీంనగర్ కలెక్టర్‌గా విధుల నిర్వహణ ముక్కుసూటి అధికారి
2001 బ్యాచ్‌కు చెందిన స్మితా సబర్వాల్‌కు ముక్కుసూటి అధికారిగా పేరుంది. కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన 26 నెలల్లో పాలనపై తనదైన ముద్ర వేశారు. పౌర సరఫరాల శాఖ వ్యవహారాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న ఓ ఐఏఎస్ అధికారిని పట్టుబట్టి బదిలీ చేయించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన 25 మంది వైద్య సిబ్బందిని మూకుమ్మడిగా బదిలీ చేశారు. ఒకే పర్యాయం 40 మంది తహశీల్దార్లను బదిలీ చేసి రెవెన్యూ పాలన గాడిలో పెట్టారు.
ప్రభుత్వ పథకాల అమలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో కరీంనగర్ జిల్లాను అగ్రస్థానంలో నిలిపినందుకు రాష్ట్ర ఐటీ శాఖ నుంచి రెండు పథకాలు, రూ.15 లక్షల రివార్డు సాధించారు. 20 సూత్రాల పథకం అమలులో 2011-12కు గాను జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలిపారు. ‘అమ్మ లాలన’, ‘మార్పు’ తదితర కార్యక్రమాల ద్వారా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. బాల్యంలో కర్ణాటక అండర్ 16 జట్టుకు బ్యాడ్మింటన్‌లో ప్రాతినిథ్యం వహించారు. ఈమె భర్త ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్.
కొత్త కలెక్టర్‌గా స్మితా సబర్వాల్
Published Wed, Oct 9 2013 3:40 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement