విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం సజావుగా సాగింది. మద్దిలపాలెంలోని డాక్టర్ వి.ఎస్.కృష్ణా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 10.30 గంటలకు ధ్రువ పత్రాల పరిశీలన, రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. కంచరపాలెంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో సమైక్యాంధ్ర ఉద్యమాల నేపథ్యంలో నాలుగు రోజుల పాటు కౌన్సెలింగ్‌కు ఆటంకం ఏర్పడడంతో ఆ కేంద్రాలను వి.ఎస్.కృష్ణా కాలేజీకి మార్పు చేసిన విషయం తెలిసిందే. ఇక్కడన్నా సజావుగా జరుగుతుందా అనే ఆందోళన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొంది. దీంతో ఉదయం ఆరు గంటలకే వీరంతా ఇక్కడికి చేరుకున్నారు. కేంద్రం పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉండడం, పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో ఎటువంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. ఉదయం 10.30 గంటలకు విద్యార్థులు, తల్లిదండ్రులను ర్యాంకు కార్డు ఆధారంగా కేంద్రాల్లోకి అనుమతించారు.
సర్టిఫికెట్ల పరిశీలన : తొలుత 1 నుంచి 1000 లోపు ర్యాంకుల అభ్యర్థులను పిలవడంతో వీరిలో 378 ర్యాంకు అభ్యర్థి యు.నమ్రత తొలి రిజిస్ట్రేషన్‌కు హాజరయింది. ఆమె సర్టిఫికెట్ల సమాచారం పూర్తిగా నిర్ధారణ కాకపోవడంతో గాజువాకకు చెందిన 778 ర్యాంకర్ సూరంపూడి మణికంఠ కు తొలి రిజిస్ట్రేషన్ పత్రం స్క్రాచ్ కార్డును కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి.చంద్రశేఖర్ అందజేశారు.
తర్వాత 378 ర్యాంకర్ నమ్రత పూర్తి సమాచారాన్ని కంప్యూటర్‌లో నిక్షిప్తం చేయడంతో రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ పరిశీలన పూర్తి చేశారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన గంటకే సర్వర్ డౌన్ కావడంతో సుమారు గంట పాటు రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ల పరిశీలన నిలిచిపోయింది. నిర్వాహకులు హైదరాబాద్ అధికారులతో సంప్రదించి సర్వర్‌ను పునరుద్ధరించారు. రాత్రి 10 గంటల వరకు ప్రక్రియ నిర్వహించగా 10 వేల ర్యాంకులకు 360 రిజిస్ట్రేషన్లు జరిగాయి.
ఇటీవల ప్రమాదవశాత్తు కాలు విరిగిన విద్యార్థిని డి.వసంత క్యాలిపర్స్ సహాయంతో కౌన్సెలింగ్‌కు వచ్చింది. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ సెప్టెంబర్ 2వ తేదీ వరకు జరగనుంది. శనివారం ఉదయం 10 గంటల నుంచి 10001 నుంచి 20000 ర్యాంకర్ల వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ తెలిపారు.